Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేతలు తిట్టినా... కించపరిచినా ప్రజలు అంత ఈజీగా మర్చిపోరు. తమను ఏవరేమన్నా మనస్సుల్లోనే దాచిపెట్టుకుంటారు. లోలోన మదనపడిపోతారు. సమయం, సందర్భం, అవకాశం వచ్చినప్పుడు తమను అవమానించిన నేతలను తమ మాటల తూటాలతో దుమ్ముదులిపి, తిత్తిదీసి కడిగిపారేస్తారు. గిప్పుడు మునుగోడు నియోజకవర్గంలో గదే తంతు జరుగు తున్నది. బీజేపీ నేతలు దళితుల్ని అవమానించిన మాటల్ని ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ఏం మొహం పెట్టుకుని మా వాడల్లోకి ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ''గొడ్డుకూర తినేటోడి చందాలు మా రాములోరి గుడికి వద్దన్న బీజేపీ రాజాసింగ్... ఇప్పుడు గొడ్డుకూర తినేటోళ్ల ఓట్లు ఎట్లా అడుగుతరు బీజేపీ రాజగోపాల్'' అంటూ మునుగోడు దళిత వాడల్లో వెలిసిన ప్లెక్సీలు అలజడి సృష్టిస్తున్నాయి. ఇవి ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. నిజమే కదా! గొడ్డుకూర తింటున్నారనే నెపంతో దళితులపై బీజేపీ, దాని అనుబంధ సంఘాల కార్యకర్తలు దాడులు చేసిన విషయం తెలిసిందే. కొందర్ని కొట్టి చంపిన సంగతీ తెలిసిందే. ఇప్పుడు ఆ అంశాలతో పాటు రాజాసింగ్ అన్న మాటల్ని ఎత్తిచూపుతూ దళిత యువకులు ప్రశ్నించడం సబబే. ప్రజల్ని రాజకీయంగా రెచ్చగొట్టేందుకు నేతలు వాడుతున్న పదజాలం, చేస్తున్న చేష్టలు చివరకు కాలక్రమంలో వారి మెడకే చుట్టుకుంటాయనేది జగమెరిగిన సత్యమనే భావన ఈ ప్లెక్సీలతోనే అర్ధం అవుతున్నది.
- అచ్చిన ప్రశాంత్