Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైన వేళ...ఆ ఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ఉప ఎన్నికను సృష్టించిన బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగబోతున్నదంటూ కొందరు అభిప్రాయ పడుతుంటే... మహిళల ఓట్లన్నీ కాంగ్రెస్‌కే పడనున్నాయని మరికొందరు వాదిస్తున్నారు. డబ్బు ప్రభావం, మధ్యం ఏరులై పారటం, విందులు, వినోదాలతో ఎలక్షన్ కుంభమేళా మహా జోరందుకుంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి తనకు జ్వరం వచ్చిందంటూ మంచమెక్కటం, మొయినాబాద్ ఫామ్‌హౌస్ తతంగం బయటకు పొక్కటం, యాదాద్రిలో బండి సంజరు ప్రమాణాలు వగైరాలన్నీ మునుగోడు ఉప ఎన్నికను మరింత రసవత్తరంగా మార్చాయి. ఈ రసవత్తర ఘట్టాన్ని మరింత రంజుగా మారుస్తూ అన్న కిలారి ఆనంద పాల్ (కేఏ పాల్)... బ్రేక్ బ్రేక్ అంటూ హుషారైన స్టెప్పులతో జనానికి మాంచి కిక్కిచ్చారు. ఆ కిక్కు ఎంతగా ఉందంటే... ప్రధాన పార్టీలన్నీ కలిసి పోయించిన మందుకంటే కమ్మగా ఉండేంతగా అంటూ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్న వారు (మందుబాబులు) తెగ సంబరపడిపోతున్నారు. పాలన్న వేసిన స్టెప్పులతోపాటు ఆయన నూనెలో వేయించిన మిరపకాయ బజ్జీలను, ఇస్త్రీ చేసిన చొక్కాలను చూసి మురిసిపోతున్నారు. వారి మోముల్లోని సంతోషాన్ని, కళ్లలోని ఆనందాన్నీ చూసిన పాల్ గారు...మరో అడుగు ముందుకేసి తనదైన రీతిలో భవిష్య వాణిని వినిపించారు. 'మునుగోడులో నా విజయం ఖరారైంది. అది చూసి కేసీఆర్ వణికిపోతున్నారు...' అంటూ పవర్ఫుల్ కామెంట్ చేశారు. ఇగ జూస్కో నా సామిరంగా... సోషల్ మీడియాలో 'మమ మాస్.. అన్న స్టెప్పేస్తే మాస్.. అన్న మాట్లాడితే మాస్... అదీ మల్లా...' అంటూ పాలన్న అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మునుగోడులో బ్రేక్ డ్యాన్స్ స్టెప్పేసిన పాల్... నిజంగానే గెలిచి రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తారా..? లేదా..? అనే దాని కోసం వెయిట్ అండ్ సీ.
-బి.వి.యన్.పద్మరాజు