Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదగిరి నరసింహస్వామిని సందర్శించుకునేందుకు ఆకాశమార్గాన బయలుదేరాడు నారదుడు. కొంతదూరం పయనించిన తర్వాత భూమిపై ఏదో అలికిడైనట్లు గమనించి కిందికి చూశాడు. లక్ష్మీదేవి ఆందోళనపడుతూ ఎటో వెళుతున్నది!
''ఏమితల్లి ఎక్కడికో ప్రయాణం! ఎందుకు ఆందోళన చెందుతున్నావు? ఏమి జరిగింది?'' అంటూ ప్రశ్నించాడు నారదుడు లక్ష్మీదేవి వద్దకు చేరుకుని.
''ఇంకా ఏమి జరుగవలె నారదా! ఏమి జరుగకూడదో అదే జరిగిపోయినది?'' అన్నది లక్ష్మీదేవి దుఃఖిస్తూ.
''అయ్యో! తల్లీ ఏమి జరిగినదో వివరంగా సెలవియ్యండి!'' అన్నాడు నారదుడు కూడా ఆందోళన చెందుతూ.
''నిన్నటి నుండి నా స్వామి కనిపించుటలేదు నారదా!'' అన్నది లక్ష్మీదేవి.
''ఆఁ స్వామివారు కనిపించుట లేదా! నేను సైతం స్వామి వారి సందర్శనకే బయలుదేరితిని తల్లీ! స్వామి వారు ఆలయంలోనేలేరా! లేక యాదాద్రిలోనే కనిపించటంలేదా?'' అడిగాడు నారదుడు.
''లేదు! నారదా! యాదాద్రిలోనే కనిపించుటలేదు! అందుకే ఇంకెక్కడైనా కన్పించుతారేమోనని వెదుకుతున్నాను. కాని ప్రయోజనం లేదు!'' అన్నది లక్ష్మీదేవి.
తన మనోవాక్కయ కర్మలతో స్వామిని ధ్యానించాడు నారదుడు. ''అన్ని మన్వంతరాలలో నారదుడు నీ భక్తుడే అయితే నీవు తక్షణమే ప్రసన్నం కావాలి స్వామి!'' అని ధ్యానించాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచిచూశాడు. స్వామి దర్శనం కాలేదు. కాని ఆ పక్కనే ఎవరో నల్లగా, పూర్తిగా ఒంగిపోయి, పలచబడ్డ జులపాలతో కనిపించాడు. స్వామి ప్రసన్నం కాలేదని మరోసారి ధ్యానించబోయాడు నారదుడు.
''ఇంకా ఎన్నిసార్లు ధ్యానిస్తావు నారదా! నేనే నర్సింహాస్వామిని!'' అంటూ నల్లగా, ఒంగిపోయిన వ్యక్తి నారదుడి ముందుకు వచ్చాడు.
ఆ మాటలు వింటూనే లక్ష్మీదేవి స్పృహ తప్పి పడిపోయింది. నారదుడు చేసిన ఉపచారాలతో కాసేపటికి స్ప్పహలోకి వచ్చింది. తర్వాత నారదుడు, లక్ష్మీదేవి ఆ వ్యక్తిని తేరిపార చూశారు! నిజమే! ఆ వ్యక్తి మరెవ్వరో కాదు! నర్సింహాస్వామే!
''స్వామి! ఏమిటిది? ఏడేడు పద్నాలుగు లోకాలను, మునివేళ్ళ కింద తొక్కేసిన రాక్షసరాజు, హిరణకశ్యపున్నే ప్రళయ భీకరమైన రీతిలో వధించిన లోకోత్తర తేజోమూర్తియైన నర్సింహ్మస్వామినేనా మేము చూస్తున్నది! ఎందుకిలా మారిపోయితిరి స్వామీ?'' అన్నాడు నారదుడు పట్టరాని ఆవేదనతో.
''నాకు పాపము తగిలినది నారదా?'' అన్నారు స్వామివారు నీరసంగా.
నారదుడు, లక్ష్మీదేవి ఉలిక్కిపడ్డారు.
సకలలోక పాపములు హరించువాడవు! నీకే పాపము తగిలినదా! ఏమీ కలి కాలము! ఏ పాపము తగిలినది! ఎప్పుడు తగిలినది స్వామీ!'' అన్నది లక్ష్మీదేవి.
''నిన్న మధ్యాహ్నమే దేవి! పువ్వుగుర్తు పార్టీ నాయకుడు తడిబట్టలతో వచ్చి ఎమ్మెల్యేల కొనుగోళ్ళలో తన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని నా పాదాలమీద మన గుళ్ళో ప్రమాణం చేసినా మరుక్షణమే నాకు పాపం తగిలినది దేవి! అప్పటి నుండే నేను నల్లబడిపోయాను. ఒంగిపోయాను! నా జూలు పల్చబడిపోయింది! ఒక్కమాటలో చెప్పాలంటే నా తేజస్సు అంతా కోల్పోయాను దేవీ!'' అన్నాడు స్వామివారు.
''అంటే ఆ నాయకుడు చేసిన ప్రమాణం తప్పా స్వామీ!'' అడిగాడు నారదుడు.
''అందులో అనుమానమేల నారదా! కోల్పోయిన నా తేజస్సే నీకు సమాధానం చెబుతున్నది కదా!'' అన్నారు స్వామివారు.
''ఇందులో మీకు సంబంధమేమున్నది స్వామి! ఆ నాయకుడు చెప్పింది తప్పైతే శిక్ష అతనికి పడాలికాని మీకు పడిందెందుకు?'' ప్రశ్నించాడు నారదుడు.
''పిచ్చి నారదా! ఇది కలి కాలం. ఆ నాయకుడు నా గుళ్ళోకి వచ్చి, నా పాదాల సాక్షిగా తమ పార్టీ తప్పేమీ లేదని ప్రమాణం చేశాడు! అందువల్ల అతని తప్పొప్పులకు నేను బాధ్యత వహించవలసి వచ్చింది!'' అన్నారు స్వామివారు.
''ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు! కారుగుర్తు పార్టీ ఎమ్మెల్యేలను పువ్వుగుర్తు పార్టీ కొనుగోలు చేయనేల! చేసిరిపో! అది బయటపడనేల! బయటపడెనుపో! అది అబద్ధమంటూ ఆ నాయకుడు మీ పాదాలవద్ద ప్రమాణము చేయనేల? దానికి మీ తేజస్సు పోనేల! ఇది అంతా విడ్డూరముగా నున్నది స్వామీ! నాకేమీ అంతబట్టుట లేదు!'' అన్నాడు నారదుడు.
''తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని పువ్వుగుర్తు పార్టీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు నీవు గతంలో నా వద్దకు వచ్చినప్పుడు చర్చించుకున్నాము! ఆ ప్రయత్నంలో ఇదంతా భాగమే కావచ్చు!'' అన్నారు స్వామివారు.
''ఇదేమి స్వామి! ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేయవచ్చు! గెలవవచ్చు! కాని ఇలా గెల్చిన ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి కొనుగోలు చేయుట ఎందుకు?'' అడిగాడు నారదుడు.
''నా నోటితో చెప్పింతువేమయ్యా! ఆ పువ్వు గుర్తు పార్టీకి ఇదేమీ కొత్తకాదు! ఈ విద్యలో వారు మంచి నైపుణ్యం సాధించారు! ఇంతకు ముందే కర్నాటక, గోవా, మహారాష్ట్ర, అసోం మొదలైన ఏడు రాష్ట్రాల్లో ఈ విధమైన ప్రయత్నాన్ని విజయవంతంగా అమలు చేసిన చరిత్ర ఆ పార్టీకి ఉంది కదా! ఆ నైపుణ్యాన్ని తెలంగాణలో కూడా ఉపయోగించదలచి యుండవచ్చు!'' అన్నారు స్వామివారు.
''నా ప్రశ్నకు సంతృప్తికర సమాధానం ఇవ్వండి స్వామీ!'' అన్నాడు నారదుడు.
''చూడు నారదా! ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు! అందువల్ల ప్రజలను మభ్యపెట్టో, ప్రలోభాలకు గురిచేసో ఓట్లు వేయించుకుంటుంటాయి రాజకీయ పార్టీలు. పువ్వుగుర్తు పార్టీ మరో రెండడుగులు ముందే ఉంటుంది! కులం, మతంతో మా లాంటి దేవుళ్ళను కూడా ఉపయోగించుకుని భావోద్వేగాలను రెచ్చగొట్టి తనకు అనుకూలమైన ఫలితాలు పొందుతున్నది. ఇవన్నీ కుదరని పరిస్థితిలో ఎన్నికల్లో గెల్చిన ఎమ్మెల్యేలనే కాంట్రాక్టులు, పదవుల పేరిట ప్రలోభపెట్టడం, దానికి లొంగకపోతే ఈడీ, సీబీఐ, ఎన్ఐఎ లాంటి సంస్థలతో దాడులు చేయించి భయపెట్టైనా సరే వశపర్చుకునే ప్రయత్నం చేస్తున్నది. పైగా కోట్లాది మంది ప్రజల కన్నా వందల సంఖ్యలో గల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం సులభం కదా!'' అన్నారు స్వామివారు.
''అదంతా సరే! మీ పునర్ వైభవం ఎప్పుడొస్తుందో సెలవివ్వండి స్వామీ!'' అన్నది లక్ష్మీదేవి.
''నేను ముందే తెలిపితిని కదా! ప్రజలే అంతిమ నిర్ణేతలు! వారే నన్ను యథాస్థితికి తీసుకుని రాగలరు!'' అన్నారు స్వామివారు.
-ఉషాకిరణ్,సెల్: 9490403545