Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేటు విష వలయంలో చిక్కుకున్న వైద్యం రోజురోజుకు ఖరీదైపోతున్న విషయం మన కండ్లముందు ఉన్నది. పెద్దపెద్ద ఆస్పత్రులలో వైద్యానికి వెళ్తే ఉన్న ఆస్తులు అమ్ముకున్నా ఫీజులకు సరిపోని పరిస్థితి. అదే ఆస్తులులేని పేదలు తమ ఆరోగ్యం కాపాడుకోవడం అసాధ్యమన్నట్టుగా తయారైంది వైద్యం పరిస్థితి. పెద్ద పెద్ద రోగాలు వస్తే విధిలేని పరిస్థితిలో మృత్యువును ఆహ్వానించడం తప్ప మరో గత్యంతరంలేని స్థితి మన భారత పౌరులది. అయితే ఈ పరిస్థితులలో జనరిక్ మందులు తక్కువ ధరకు అందుబాటులోకి రావడం కొంత ఉపశమనం. కొన్ని దీర్ఘకాలిక రోగాలకు బ్రాండెడ్ కంపెనీలకు సమానమైన ఫార్ములాతో అందుబాటులోకి వచ్చిన జనరిక్ మందులు పేద, మధ్యతరగతి ప్రజలకు వరంగా మారాయి. ప్రభుత్వం తెచ్చిన ఈ జీవన ధారా జనరిక్ షాపుల వలన చాలా రోగాలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులోకి వచ్చాయని ఆనంద పడుతున్న గానే, ఈ జనరిక్ మందుల వల్ల, ప్రభుత్వ అసమర్థ విధానం మూలంగా జనానికి రావలసిన ప్రయోజనం మెడికల్ వ్యాపారులకు చేకూరుతోంది. ఎలాగంటే జనరిక్ బ్రాండ్ మందుల స్లిప్పులపై ముద్రించే వాటి ధరకి, వాస్తవంగా అమ్మే ధరకి దాదాపు 50శాతం నుండి 80శాతం వరకు డిస్కౌంట్ అని పేర్కొంటున్నారు. దీనివలన ఆ మందు యొక్క అసలు ధర ఎంతో వినియోగదారులకు తెలియడం లేదు. దీనినే ఆసరా చేసుకుని జనరిక్ మందులనే బ్రాండెడ్ మందులతో సమానంగానూ లేదా కొద్ది తేడాతోను మార్కెట్లోని కమర్షియల్ మెడికల్ షాపుల వ్యాపారులు కూడా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న తక్కువ ధరకు మందులు అమ్మకం మెడికల్ వ్యాపారులకు లాభాల పంటను పండిస్తుండగా, వినియోగదారులను దోపిడీకి గురి చేస్తున్నది. కావునా ప్రభుత్వాలు దీనిని తక్షణమే నియంత్రించాలి. మెడికల్ వ్యాపారులకు రావాల్సిన వ్యాపారానికి సంబంధించిన లాభాన్ని వాస్తవిక ధరకు కలిపి నిర్ణయించి, ఈ భారీ డిస్కౌంట్ పేరుతో జరిగే మోసాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఒకే ఫార్ములాతో ఉన్న మందుల మధ్య కూడా కంపెనీ కంపెనీకి ఉన్న ధరల తేడాను కూడా అరికట్టాలి.
- టి కిషోర్, 9440725437