Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలంతోపాటు మానవ అవసరాలు కూడా మారిపోతున్నాయి. మారిన కాలానుగుణంగా సమాజం కూడా మార్పు చెందాలి. విద్య విషయంలో గత శతాబ్దకాలంలో ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతకుముందు ఎన్నడూలేని విధంగా మూడు దశాబ్దాల క్రితం ఒక్కసారిగా ఇంజినీరింగ్ విద్యకు అత్యంత ప్రాధా న్యత లభించింది. అంతకుముందు ఇంజినీరింగ్ విద్య అనేది అత్యంత పరిమితంగా ఉండేది. కేవలం అతికొద్ది కాలేజీలే ఉండేవి. కానీ ఆ తర్వాత కంప్యూటర్, సాఫ్ట్వేర్ ప్రవేశంతో ఇతర దేశాలతోపాటు భారతదేశంలో కూడా ఇంజినీరింగ్ విద్యకు ఎక్కడలేని ప్రాధాన్యత లభించింది. ఇంజినీరింగ్ చదువుపై ఉన్నత వర్గాల్లోనే కాదు సామా న్యులకు సైతం ఆసక్తి పెరిగిపోయింది. ఇంజినీరింగ్ చదవగానే అమెరికా లాంటి విదేశాల్లో ఉద్యోగం, డాలర్లలో జీతం, ఇక దేశంలో కూడా పెద్దపెద్ద మహానగరాల్లో అనేక సంస్థల్లో అత్యున్నత జీతం, హౌదా లభిస్తుండడంతో ఇంజినీరింగ్ విద్య అభ్యసనం పట్ల విపరీతంగా మోజు పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా కాలేజీలు పుట్టుకువచ్చాయి. 1947లో భారతదేశంలో 44 ఇంజినీరింగ్ కాలేజీలు ఉంటే అందులో కేవలం మూడువేల రెండు వందల సీట్లుమాత్రమే ఉండేవి. ఇప్పుడు దాదాపు మూడు వేల ఐదువందల కాలేజీలకుపైగా పెరిగిపోయాయి. సీట్ల సంఖ్య దాదాపు పదిహేడున్నర లక్షలు దాటిపోయింది. అయినా డిమాండ్ మొన్నటివరకు విపరీతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో సాఫ్ట్వేర్ రంగానికి కొంత ప్రాముఖ్యత తగ్గడంతో ఇప్పుడు ఇంజినీరింగ్ విద్య పట్ల మోజు తగ్గింది. కేవలం ఇంజినీరింగ్ డిగ్రీ సంపాదించినంత మాత్రాన ప్రతిష్టాకరమైన సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం సాధించడం అంత సులభం కాదనే విషయాన్ని విద్యార్థులు గ్రహిస్తున్నారు. అందుకే యేడాది యేడాదికి ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. ఈ విద్యాసంవత్సరంలో తెలంగాణలో దాదాపు వదిహేనువేల సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. మరొకపక్క ఇప్పటికే మరెన్నో కాలేజీలు మూతపడ్డాయి. నిన్న ఎంసెట్ కౌన్సిలింగ్ చివరిదశ సీట్ల కేటాయింపు కార్యక్రమం ముగిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 177 కాలేజీల్లో 79వేల 346 ఇంజినీరింగ్ సీట్లలో 63వేల 900 మంది అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించగలిగారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ ఫీజులు మాత్రం లక్షల్లోనే ఉంటున్నాయి. ప్రభుత్వపరంగా కూడా ఈసారి ఇంజినీరింగ్ విద్యకు ఫీజులు భారీగా పెంచారు.
లక్షల్లో ఫీజులా?
ప్రభుత్వ నిర్లక్యం, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎస్ఆర్) అసమర్థత కారణంగా అంతా ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు అనుకున్నట్టే సాగుతున్నది. ఒక దశలో వారు కోర్టును సైతం నమ్మించి ఇష్టానుసారంగా లక్షల మేర ఫీజులను పెంచుకున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన నియంత్రణ కమిటీ తని పని తాను చేయకపోగా, ఫీజుల పెంపునకు అనుమతించడం ఆత్యంత దౌర్భాగ్యకరమైన విషయం. రాష్ట్రంలో మొత్తం 159 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.లక్షా 60 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం కాలేజీల్లో లక్షకు పైగా ఫీజులు ఉన్న కాలేజీలు 40కి పైగా ఉన్నాయంటే ఫీజుల దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఇందుకు విరుద్ధంగా లేదు.
అధికశాతం కాలేజీల్లో నాణ్యతా లోపం
అధికశాతం కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు అంతకంతకు దిగజారిపోతున్నాయనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్తీర్ణులు అవుతున్న తొంభైశాతం మంది గ్రాడ్యుయేట్లలో సాఫ్ట్వేర్ పరిశ్రమల్లో పనిచేసే నైపుణ్యం అంతగాలేదనే ఆయా కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. అందుకు అవసరం మేరకు సిబ్బంది, ఉన్నసిబ్బందిలో కూడా చాలా మందికి బోధనా సామర్థ్యం లేకపోవడం కారణాలుగా చెపుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిబంధనల ప్రకారం ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది అధ్యాపకులు ఉండాలి? అంటే... ఉన్న ఇంజినీరింగ్ సీట్ల ప్రకారం లెక్కచూస్తే లక్షకుపైగా అర్హులైన అధ్యాపకులు అవసరం. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇంకొకపక్క కనీస వసతులు, లైబ్రరీ, వర్క్‌షాప్ లాంటి మౌలిక సౌకర్యాలు లేని కాలేజీలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనికితోడు కంప్యూటర్, సాఫ్ట్వేర్ పరిశ్రమల్లో నిత్యం కొత్తకొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యేడాదియేడాదికి అవసరాలు మారిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఆ అవసరాలను తీర్చే విధంగా విద్యా బోధనలో మార్పులు చేయాలి. అది జరుగడం లేదు. ఫలితంగా ఇంజినీరింగ్ విద్య అభ్యసించిన అధికశాతం విద్యార్థులకు అదొక డిగ్రీలాగానే ఉపయోగపడుతున్నది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ సరైన ఉపాధి కల్పించలేకపోతున్నది. ఏ ఉద్యోగం లభించక నిరాశతో కుమిలిపోతున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ లక్షల సంఖ్యలో ఉన్నారు. కళాశాలలో ప్రమాణాల పతనం వల్ల అంతిమంగా విద్యార్థుల జీవితాలు అంధకారం అవుతున్నాయి. ఇతర విద్యాసంస్థలతో పాటు ఇంజినీరింగ్ కాలేజీలు కూడా వ్యాపారంగా రూపాంతరం చెందాయి. ఇది చదువుల నాణ్యతకు శాపంలా మారింది. ఉన్నత విద్యలో ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగాన్ని దళారులకు విడిచి పెట్టకుండా ప్రభుత్వమే నాణ్యతను కాపాడేందుకు నడుంకట్టాలి. నిధుల కొరత లేకుండా చూడాలి. ఇంజినీ రింగ్ డిగ్రీ చేతికి వస్తే చాలు తమ పిల్లలు అత్యంత సుఖవం తమైన జీవితాన్ని గడుపు తారనే భ్రమను తల్లిదండ్రులు విడనాడాలి. విద్యను ఒక వ్యాపారంగా భావించే కోచింగ్ కేంద్రాలు, ఇంజినీరింగ్ కాలేజీలు యువతను మాయలో ముంచెత్తి వారి జీవితాలతో ఆటలాడుకోవడం ఏమాత్రం న్యాయంకాదు.
- సభావట్ కళ్యాణ్
సెల్:9014322572