Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయ్యా మీరు పెద్దోళ్లు
మేం తరాల పేదోళ్లం
దేశాన్ని అమ్మెటోళ్లం కాదు
దేశం కోసం చిట్లిన చెమటలం
కన్నీళ్ల దుక్కులం
పడరాని పాట్లు పడ్డం
కనకూడని కష్టాలను కన్నం
నీళ్ల కోసం అల్లాడినం
మాబతుకుల్ని హీనం చేసి
తొక్కేసినందుకు కదయ్యా
రాచకొండ గుట్టలు కదిలింది
సంస్థాన్నారాయణపురాలు
సాయుధుమైంది
తెలంగాణ పోరు జెండాలైంది
ఈ గోసిగుడ్డల అవ్వలు అయ్యలే
పోరు చరిత్రలను నమోదు చేసింది
యాద్ మరిచిండ్రా
మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తా
భాష జాగ్రత్తా,
మీ బూతు కూతలు జర జాగ్రత్తా
ఇంకా ఎన్నాళ్లు ఎన్నేళ్లు చేస్తరు
బూతు భాషల అహంకార పటేల్ గిరి
ఫ్లోరోసిస్ దేహాల్ని చెదల్లా కొట్టేస్తుంటే
చూసిండ్రు తప్ప చేసిందేమిటి?
తరాలు బలై పోతుంటే
గుక్కెడు మంచినీళ్లవ్వక పోతిరి
స్వామి కన్నీళ్లను
ఏ స్వాములోరు సూసిండ్రు
మా కోసం ఎవరు గుక్కపెట్టి ఏడ్చిండ్రు
మా దేహరూపులు మారినరు
వొళ్లు వొంకర్లుకొంకర్లు తిరిగినరు
మా కోసం ఎవరు నిలిచిండ్రు?
నిజాల నిప్పుల కుంపటిపై
ఒట్టేసి చెప్పండి
మంచినీళ్లు ఇయ్యకపోతిరి
మాటా మంచి లేకపోయే
నవిసి నవిసి సచ్చినం
కుక్కి మంచాల పాలైనం
యవ్వనాన్ని ముసలితనం వరించింది
కన్నబిడ్డల్లా చూసుకోవాల్సినోళ్లు
''నా కొడకల్లారా
మీ సంగతి చూస్తా'' అంటరా
బిడ్డా యాద్ మరువకండి
తెలంగాణ ఊరూరికి చరిత్ర ఉంది
మత పిచ్చికిక్కడ తావు లేదు
మీ ఆధిపత్యాలకు తావులేదిక్కడ
తెలంగాణ నేల ఆత్మగౌరవాల అడ్డా
మీ పటేల్గిరికిక కాలం చెల్లింది
నాలుకలు జాగ్రత్తా, మీ భాష జాగ్రత్తా
పోరాటం తెలంగాణ పెద్దబాలశిక్ష.
- శివుడు