Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఉప'ద్రవాలు రాష్ట్రాన్ని ఊరికే వదిలివేయడంలేదు. వాయుగుండం తుపానుగా మారి వర్ష బీభత్సాన్ని సృష్టించినట్లు అవి ఒకటి వెనుక ఒకటిగా వస్తూ ప్రజల ఓపికకు పరీక్షలు పెడుతున్నాయి. 'ఉప'ద్రవాల తాకిడికి ఓటర్లు ఉక్కిరిబిక్కిరి అయిపోవడం, ఇటీవలి కాలంలో మనం తరచుగా చూస్తూ వస్తున్న దృశ్యమే. దుబ్బాకలో మొదలైన ఈ పరిణామం ఇప్పుడు మునుగోడులో కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తోంది. హుజురాబాద్, నాగార్జునసాగర్, హుజూర్నగర్లలో జరిగిన పరిణామాలను ప్రత్యేకంగా ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పనిలేదు.
ద్రవం కన్నా 'ఉప'ద్రవం తీవ్రమైనదంటారు. అసలు ఎన్నికలకన్నా ఉప ఎన్నికలు కీలకమైననవిగా మారిపోతున్నాయి. ఎంత కీలకమైనవి కాకపోతే ఇంతమంది నాయకులు ఇంత పట్టుదలగా వీటిని ఎందుకు తీసుకుంటారు చెప్పండి? ఒకానొక రాష్ట్రంలోని ఒకానొక ఉప ఎన్నికపై సాక్షాత్తు కేంద్ర నాయకులు సైతం దృష్టిని కేంద్రీకృతం చేస్తున్నారంటేనే దాని తీవ్రత ఏమిటో తెలిసిపోవడం లేదూ? ముఖ్యమైన పార్టీల ముఖ్య నేతలంతా 'మునుగోడు' అనే ఒక చిన్న ప్రాంతంలోకి ఒక్కొక్కరే దిగుతూవుంటే చూసేవాళ్లకు అది మామూలుగా తోచడం లేదు. ఇతరేతర ప్రాంతాల నుండి అపరిచిత శక్తులేవో తమ ప్రాంతంపైకి దండయాత్రకు బయలుదేరి వస్తున్నట్టుగా జనం భావిస్తున్నారు. మునుగోడు ప్రజలు ఎన్నడూ చూడని వాహనాలు! ఎప్పుడూ చూడని మనుషులు! తాత్కాలిక వ్యూహ శిబిరాలు! పోటీపడి ప్రచారాలు! ఎక్కడ చూసినా ఒకటే ఉత్కంఠ! అంతా యుద్ధ వాతావరణం! ఏమిటీ యుద్ధం? అసలు ఎందుకీ వాతావరణం? ఒక సాదాసీదా ఎన్నికను ఇంత అసాధారణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకొచ్చింది?
పాలనను ఒక ప్రాంతానికి పరిమితం చేసి, నేతలు పావులు కదుపుతున్న తీరుకు ఎవ్వరైనా ఆశ్చర్యపోకుండా ఉండగలరా? ఇక్కడ నీతి నిజాయితీలకు స్థానం-ప్రజాభిప్రాయానికి విలువ - ప్రజాస్వామ్యమంటే గౌరవం ఏమిలేవు. అసలు ఇక్కడ చేసిన రాజీనామాలకు అర్థమే లేదు. ఉన్నదల్లా వ్యాపార లావాదేవీల వ్యవహారమే. వ్యక్తుల వ్యక్తిగత అజెండాలు - వ్యవస్థీకృత పాలనా వైఫల్యాలు- వెరసి ఇలాంటి ఉప ఎన్నికలకు కారణభూతమవు తున్నాయి. ఫలితంగా వేలకోట్ల ప్రజాధనం ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఖర్చు కావడం భారతీయ ఎన్నికల వ్యవస్థకు పెద్ద ఉపద్రవంగానే పరిణమిస్తోంది!
ఎన్నికలు అనివార్యమైనప్పుడు ఏ పార్టీ అయినా పోటీకి దిగకుండా ఎందుకు ఉంటుంది? ఓటర్లను ఆకర్షించడంలో ఏ పార్టీ అయినా ఎందుకు వెనుకడుగు వేస్తుంది? ఇక్కడ అన్ని పార్టీల నాయకులూ కొత్త ఓటర్లను పట్టుకునేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. నాయకులు తమతమ కార్యకర్తలను నయాన్నో, భయాన్నో తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే, అలకలు, బుజ్జగింపుల పర్వాలను కొనసాగిస్తూ ఓటర్లను ఆకర్షించడంలో తలమునకలవుతున్నారు. ఎన్నికల డ్యూటీలో ఏమరుపాటుగా ఉంటే ఏమి జరుగతుందో తెలుసు కాబట్టి ఎంతో జాగ్రత్తగా పావులు కదుపుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ రోజువారీ హాజరుశాతం తగ్గితే అక్కడ అధినేతల దగ్గర మార్కుల గ్రాఫ్ పడిపోతుందనే స్పష్టతతోనే నేతలంతా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి వ్యూహాలు ఇదివరకటి ఎన్నికల కన్నా పూర్తి భిన్నమైనవి. ఎన్నికల తీరు ఎలా మారుతున్నదో, అవి ఏ స్థాయికి అభివృద్ధి చెందాయో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు? ప్రజాస్వామ్యం ఏకస్వామ్యమై ఓటరును ఒక ముడి సరుకుగా చేసి, ఎన్నెన్ని విడ్డూరాలు చేయిస్తున్నదో చూస్తున్నారుకదా! అధినాయకుల ముందు నడుం వంచితే తప్ప నాయుకుడుగా మనలేని దుస్థితి ఇక్కడ నెలకొని ఉన్నది. ఇదీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు అత్యంత దయనీయ పార్శ్వం.
ఎన్ని జాతరలు కలిస్తే ఈ ఎన్నికల జాతరను మరిపిస్తాయి? ఎన్ని రసాలు కలియబెడితే వచ్చిన సారమైనా ఇక్కడ పంచబడే 'మధు'రసం వలె ఇంతలా ఏరులై పారుతుందిచెప్పండి? తేనెతుట్టెను కదిపినప్పుడు కందిరీగలు పైకి లేచినట్లు నోట్లకట్టల పాములు కట్లు తెంచుకొని నియోజకవర్గమంతా పాకుతున్నాయి. నువ్వు గొర్రెలనిస్తే నేను బర్రెలనిస్తానన్నట్టు సాగుతోంది ఎన్నికల ప్రచార సరళి. గుళ్లు ఫంక్షన్ హాళ్లు, అడిగిందే తడవుగా పోటీపడి హామీలు. ప్రతిజ్ఞలకు కొదవలేదు. జోస్యాలకు అంతులేదు. రాజకీయ పార్టీల నేతలెందరో జ్యోతిష్యులుగా మారిన వైనం మనకిక్కడ స్పష్షంగా అనుభవానికి వస్తోందికదూ? వీళ్లు కాలజ్ఞానం తెలిసినవారి స్థాయిలో మాట్లాడుతూ- పక్క పార్టీ అభ్యర్థికి ఎలాంటి దుస్థితి వస్తుందో, ఏ అభ్యర్థి ఎంత దారుణంగా ఓడిపోతాడో - ఎన్నికల తరువాత ఏ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందో వారి 'భవిష్యత్తు చిత్రపటం' ఏమిటో వీరు బొమ్మ గీసి మరీ చూపిస్తున్నారు. ధరావత్తు కోల్పోబోతున్నవాళ్లు కూడా గెలుస్తామని ధైర్యంగా చెబుతున్నారు. ఆఖరికి పండుగను కూడా ప్రచారంలో భాగం చేయడం ఈ ఎన్నిక ప్రత్యేకతగా మనం భావించవచ్చు. చక్కెర, పేనీ, సేమియా వంటి తీపి పదార్థాలను పంపిణీ చేస్తూ కొందరు నేతలు ఓటర్లను దీపావళి పండుగకు సన్నద్ధం చేశారు. తాము మాత్రం 'ఓట్ల పండుగ'ను జరుపుకోవడానికి సమాయత్తం అవుతున్నారు. ఇంతటి సృజనాత్మకతను ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిస్తే ఎంత బాగుండునోకదా అని అనిపిస్తోంది కదూ! రేపు తెలంగాణలో పాగా వేయాలన్న కేంద్రంలోని ఎలికల పాచికలాట తప్ప, ఈ ఉప ఎన్నికలో ప్రజా ప్రయోజనమేమున్నది?
ఇక్కడ ఎవరి 'గోడు' వారిదే అనే విషయం ఎవరికైనా సులువుగానే అర్థమవుతూనే ఉంది. కానీ ఈ 'గోడు'ల హౌరులో కలిసిపోయి, మునుగోడు జనం గోడు ఎవరికీ వినిపించకుండా పోతున్నది. ఇదంతా 'ఉప'ద్రవం మహత్యమే అని సరిపెట్టుకోవాలి కావొచ్చు. ఇలా 'ఉప'ద్రవాలు వెంటవెంటనే వచ్ఛి ఊళ్ల మీద పడిపోతు న్నప్పుడు సాధారణ జనజీవనం స్తంభించి పోకుండా ఉంటుందా? ప్రత్యేకించి కేంద్ర రాజయకీయ మంతా ప్రస్తుతం మునుగోడులోనే కేంద్రీకృతం అయి నట్లు కనిపిస్తూవున్నది. తీరం దాటేంత వరకూ అది ఎవరినీ తిన్నగా ఉండనివ్వదు. ఎందుకంటే అన్ని రకాల అస్త్రశస్త్రాలతో అందరూ సిధ్ధంగా ఉన్నట్లు కనిపిస్తూనే ఉన్నది. ఓటమిని తేలికగా తీసుకోవడానికి మాత్రం రాజకీయ పార్టీలలో ఒక్కరు కూడా సిధ్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు మరి!
- గుండెబోయిన శ్రీనివాస్
సెల్:9985194697