Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాలపరిమితి ఇంకో ఏడాదిన్నర మాత్రమే ఉంది. ఇలాంటి స్థితిలో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి, బీజేపీలో చేరి ఉపఎన్నిక తీసుకురావడం సిగ్గు చేటైన విషయం. తన నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలేదని అందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. రాజీనామా చేయడం వల్లనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే తప్పుడు సంకేతం ప్రజలకు ఇవ్వడం ఒకటి కాగా, రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి, ఆ పార్టీకి ద్రోహం చేసి బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉపఎన్నికల్లో పోటీ చేయటం రెండో అంశం. ఇది అత్యంత విస్తుగొలిపే అంశం..! మునుగోడు నియోజకవర్గం పట్ల ప్రభుత్వం నిజంగానే పక్షపాత వైఖరి అవలంబిస్తుందని ఆయన భావించినట్లయితే గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినప్పుడు జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలి. అభివృద్ధి కార్యక్రమాలు జరక్కపోతే శాసనసభ్యుడుగా ఆయన చట్టసభలో ప్రభుత్వంపై ప్రజావాణి గట్టిగా వినిపించి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టాలి లేదా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కృషి చేయాలి. ఆ పని చేయకుండా రాజీనామా చేసి ఉపఎన్నిక తీసుకురావడమే ఓ విడ్డూరం కాగా, పార్టీ ఫిరాయించడం మరీ విడ్డూరం. రాజగోపాల్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, దేశంలో గుర్తించదగిన కాంట్రాక్టర్ల జాబితాలో ఒకడు. ఆయన కేవలం కాంట్రాక్టు కొరకు తన సొంత ప్రయోజనాల కొరకే ఈ ఎన్నిక తీసుకొచ్చారనేది ఎంత నిజమో, దీని వెనుక బీజేపీ కుట్ర, కుతంత్రం అంతకంటే నిజం.
కేంద్ర బీజేపీ పాలకులు తనకు 18వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పని కట్టపెట్టారని ఆయనే స్వయంగా ప్రకటించడం గమనార్హం. వాస్తవం ఇది కాగా, 'తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ మేత కోసం' అన్నట్టు, తన స్వప్రయోజనానికి మునుగోడు అభివృద్ధిని సాకుగా చూపడం విడ్డూరం కాక మరేమిటి? అయితే ఈ విపరీత ప్రచారాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోని వ్యతిరేకిస్తున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం, బీజేపీ నేతల అంతర్గత ఎజెండా అమలు కోసం మునుగోడు అభివృద్ధిని ముడివేయడాన్ని ప్రజలు అర్థం చేసుకోవడంతో ఆయనకు చలి జ్వరం పట్టుకుంది. దీనితో మునుగోడు నియోజకవర్గంలో తమ ఓటమి ఖాయమని తెలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయనకి బడా కాంట్రాక్టు అప్పగించడంతో పాటు, రాజకీయ ఆశ్రయం ఇచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు కమ్యూనిస్టుల మీద ప్రేలాపనలకు దిగారు.
దక్షిణ తెలంగాణలో కృత్రిమ ఊపును సృష్టించడానికి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఓ వాపును సృష్టించేందుకు బీజేపీ అధినాయకత్వం రాజగోపాల్‌రెడ్డిని ఒక ఎరగా ప్రయోగించి బలపడడానికి చేస్తున్న కుట్ర ఫలితమే ఈ మునుగోడు ఎన్నిక. దేశవ్యాప్తంగా బీజేపీ పాలకులు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను నయానో భయానో తమ వైపు చేర్చుకొని, బీజేపీయేతర ప్రభుత్వాలను గద్దె దించే అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న సంగతి జగమెరిగిన సత్యం.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి, దేశంలో వారికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అక్రమ పద్ధతుల్లో, అనైతికంగా, అప్రజాస్వామికంగా కూల్చి, నిసిగ్గుగా తమకు అనూకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను నామరూపాలు లేకుండా చేయడానికి పూనుకుంటున్నది. దాంట్లో భాగంగానే తెలంగాణలో కూడా టీఆర్ఎస్ శాసనసభ్యులను వందల కోట్ల రూపాయలతో కొనడానికి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. తమను కాదన్నవారిపై ఈడి, సీబీఐలతో దాడులు చేయించి కేసులు పెట్టి వేదిస్తున్నారు. బీజేపీ పార్టీలో చేరితే నీతిపరులు, బీజేపీని వ్యతిరేకిస్తే అవినీతిపరుల కింద ముద్ర వేస్తున్నారు. ఇది వాళ్ళ నిజ స్వరూపం. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి అంటూ ప్రజలను చీలుస్తూ మత సామరస్యాన్ని సమాధి చేస్తున్నారు. శాంతియుత ప్రజా జీవనాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఈ దేశ ప్రజల భవిష్యత్తును బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు. మరో మారు అధికారంలోకి వచ్చేందుకు, విచ్ఛిన్నకర రాజకీయ ఎత్తుగడలకు పూనుకుంటున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఉపఎన్నిక ద్వారా మునుగోడు నియోజకవర్గాన్ని, బీజేపీ ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకుంది. అందుకు బడా కాంట్రాక్టర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం, బీజేపీకి బలమైన ఎరగా కనబడింది. ఇంకేముంది... ఏడాది లోపు ఎన్నికలుండగానే ఈ అనవసర ఎన్నికను తెచ్చిపెట్టింది. అయితే, చైతన్యవంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రజలందరితో పాటు మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ఈ ఉప ఎన్నికకి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వప్రయోజనాన్నీ, బీజేపీ అంతర్గత కుతంత్రాన్నీ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సైతం ఈ కుతంత్రాన్ని ఎండగట్టి, బీజేపీ మతతత్వ విచిన్నకర విధానాల్ని తిప్పికొట్టేందుకు, ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాయి. అందుకే బీజేపీ నాయకులకు ఓటమి జ్వరం పట్టుకుంది. దిక్కు తోచక కమ్యూనిస్టులపై అవాకులూ చెవాకులూ పేలుతున్నారు. ప్రజలు ఇది అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో అవకాశవాద, విచ్ఛిన్నకర రాజకీయాలకు తావులేకుండా సమాధి చేసేలా మునుగోడు ప్రజలు తీర్పు చెప్పడం ఖాయం.
- జూలకంటి రంగారెడ్డి