Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా పిల్లలతో కలసి పనిచేయడం వలనే అందమైన భవిష్యత్తును నిర్మించుకోగలరు. పిల్లలతో కలసి జీవించడం ప్రాకృతిక సహజలక్షణం. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ మనిషి యొక్క సహజ గుణాలను చంపుతూ పరాయికరణను (ఎలియనేషన్) పెంచుతున్నది. మనిషిని మనిషి నుండి దూరం చేస్తున్నది. మనిషి కాకుండా చేస్తున్నది. మనిషిని యంత్రంగానో (రాబో) జంతువుగానో దిగజారుస్తున్నది. స్వార్థపరుని గానో, అరాచకునిగానో తయారు చేస్తున్నది. అందులో భాగంగానే 'కేరీర్' అనే వ్యక్తిగత అభివృద్ధి మిఠాయి పొట్లాన్ని ఆశగ చూపే విద్యా వ్యవస్థను నెలకొల్పింది. సమిష్టితత్వం, సామాజిక స్పృహ అలవడ కుండా చేస్తున్నది. ఫలితంగా మనిషితనాన్ని కోల్పోయే దురవస్థను చిన్నప్పటి నుండే విద్యా వ్యవస్థ కల్పిస్తున్నది. దీనికితోడు మనదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మత ఉన్మాద సంస్థలు కొన్ని పిల్లల్లో చిన్నప్పటి నుండే విద్వేషభావాలు నూరిపో స్తున్నాయి. పిల్లల్లో తెలియకుండానే ఇవి హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నాయి.
మతం - కులం - లింగం - ఆధారంగా సాగుతున్న పెంపకం, విద్యా బోధన వలన పిల్లల మధ్య కనిపించని అసమానతలు, అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. దివ్యాంగులు, ప్రత్యేక సామర్థ్యం గల పిల్లల పట్ల సమదృష్టి కలిగేలా పాఠశాల విద్యాబోధన ఉండాలనే భావన గగనకుసుమమైంది. ఈ కారణంగా బాలల హక్కులు గల్లంతు అయిపోతున్నాయి. సహజంగా వారి మధ్య విరబూయాల్సిన ప్రేమ, స్నేహం, ఐక్యత, ఆత్మీయత, జాలి, దయ, సహకారం వంటి సున్నిత భావాలు కనుమరుగైపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల మీద ప్రేమ ఉన్నవాళ్ళు తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా, ఇతర పెద్దలైనా... పిల్లలని ప్రేమించడం, గౌరవించడం, వారి కోసం పని చేయడం ఆధునిక నాగరిక లక్షణంగా ముందుకొచ్చింది. పిల్లల కోసం పనిచేయడం - అదీ ఓ ఉద్యమంలా పనిచేయాల్సిన అవసరం, అగత్యం ముందుకు తోసుకువచ్చిందనే విషయాన్ని ఎవ్వరమూ కాదనలేం.
ఇదో సామాజిక బాధ్యతగా చాలామంది ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగానే తరగతి గది ఆవల (బ్రియాండ్ ద క్లాస్ రూం) అనే భావనలను గమనిస్తున్నారు. ప్రతి పెద్ద - పిన్నలకు గురువే (ఎవ్వరి ఎల్డర్ యాజ్ ఎ టీచర్ టు యంగర్ వన్) అనే పద్ధతిలో పిల్లల పట్ల చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన తరుణంగా గుర్తిస్తున్నారు.
పిల్లలను ప్రేమిస్తూ, పిల్లలతో కలసిపోతూ, అర్థవంతమైన ఆనందకరమైన విద్యాబోధనలు గతంలో ఎన్నో ఉన్నాయి. మాంటిస్సోరి, మహాత్మగాంధీ, గిజూబారు వంటివారు అమూల్యమైన బోధనా పద్ధతులు మనకు ఎన్నో అందించారు. ఇప్పుడున్న మూస బోధనా పద్ధతి - పాఠ్యపుస్తకం, టీచర్, పాఠం, బ్లాక్‌బోర్డు, విద్యార్థి, పరీక్ష, మార్కులు, ఉత్తీర్ణత, ర్యాంకులు - అంటే అంతి మంగా బైహార్ట్ (బట్టీ) పద్ధతే నేటికీ కొనసాగుతున్నది. కాలక్రమేణా అది కాపీ కొట్టే పద్ధతిగా దిగజారుతున్నది. ఈ క్రమంలో విలువలతో కూడిన నాణ్యమైన విద్య పిల్లలకు దక్కడం లేదని అందరూ వాపోతున్న విషయం తెలిసిందే. చాలా నివేదికలు అదే వాస్తవాన్ని వ్యక్తపరుస్తున్నాయి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు టీచర్లు, కొన్ని పాఠశాలలు కొన్ని ప్రత్యామ్నాయ విద్యాబోధనలకు శ్రీకారం చుట్టి పిల్లల సమగ్ర వికాసం కోసం పాటుపడుతున్నాయి.
1. డిస్క్లోజర్ (వెల్లడి) - మనసులోని అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా, నిజాయితీగా టీచర్ వెల్లడిచేస్తూ, పిల్లలచేత వెల్లడి చేయించడం. పైకి ఒకటి, లోపల ఒకటి, సగం దాచి, సగం చెప్పి - ఈ అరకొర బోధన వలన పిల్లలు సహజంగా స్వేచ్ఛగా ఎదగాల్సిన పద్ధతిలో ఎదగలేరనేదే వారి భావన.
2. రెసిప్రొకేషన్ (ఇచ్చిపుచ్చుకోవడం) - ఉన్నతమైన, ఉదాత్తమైన, ఆరోగ్యకరమైన భావాలు ఉపాధ్యాయులు - పిల్లలు ఇచ్చిపుచ్చుకోవాలి. అరమరికలు ఉండకూడదు. పిల్లల నుండి మంచి విషయాలు నేర్చుకోవడానికి ఉపాధ్యాయులూ సదా సిద్ధంగా ఉండాలి. సృజన ఎవరి సొత్తూకాదు. ఈ వాస్తవాన్ని అంగీకరించాలి.
3. హ్యుటిగాజి (స్వయం ఎరుక) - ఏదైతే సొంతంగా తమ అనుభవంలోకి తెచ్చుకుంటారో అదే నికరమైన విద్యగా విద్యార్థులకు మిగులుతుంది. అందుకు ఉపాధ్యాయుడు పక్కనుండి సహకరిస్తుంటాడు.
4. నయాతాలిం - (నూతన విద్య - గాంధి) చదువైనా, మనం చేసే పని ఏదైనా మనస్సు - మెదడు - చేతులకు సమన్వయం ఉండాలి. అంతిమంగా మనం చేసే పనే మన విజ్ఞానం (అవర్ వర్క్ ఈజ్ అవర్ నాలెడ్జ్). పాఠశాల పరిసరాల్లో అన్ని పనులు (పొలం పని, చేతి వృత్తులు, కార్ఖానాలు మొదలైన) విద్యార్థికి తెలిసి ఉండాలి.
5. శాస్త్రీయ విద్య (సైంటిఫిక్ ఎడ్యుకేషన్) - విద్యార్థికి హేతువాద దృక్పథం (రేషనాలిటీ) కలుగజేయాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? ఎప్పుడు? ఎక్కడీ ఇలా ప్రశ్నలు వేసుకుని సరైన సమాధానం రాబట్టేలా బోధన చేయా లి. మంచి - చెడుకు విచక్షణ తెలియాలి. ప్రశ్నించే తత్వం అలవడాలి.
ఇలాంటివి ఎన్నెన్నో నూతన బోధనా పద్ధతులు ముందుకొస్తున్నాయి. మనదేశంలోనూ, మన తెలుగు రాష్ట్రాలల్లోనూ అక్కడక్కడా అమలు అవుతున్నాయి. ప్రస్తుతం మన దేశ జనాభా 140కోట్లు. 1-30 సంవత్స రాల మధ్య వయస్సు కలిగినవారు 60శాతం మంది ఉన్నారు. దాదాపు 84కోట్ల మంది భారత యువత శిశు, కౌమార, యవ్వన దశలో ఉన్నారు. అందుకే యంగ్ ఇండియా (యువ భారత్)గా మనల్ని పిలుస్తున్నారు.
ఈ 30ఏండ్ల లోపు వారిలో 3-18 సంవత్సరాల వయస్సు గల వారు దాదాపు 50శాతం అనుకుంటే వారి సంఖ్య 42కోట్ల మంది. శిశు విద్య మూడవ సంవత్సరం నుండి మొదలువుతున్నది. 18 సంవత్సరాల వరకు ప్రాథమిక, ఉన్నత, ఇంటర్ వరకు చదువుకోవాలి. తక్కువలో తక్కువ 50 మందికి ఒక టీచర్‌ను లెక్కేసుకున్నా 84లక్షలమంది కావాలి. అయితే దేశ వ్యాప్తంగా జూనియర్ కళాశాల లెక్చరర్స్‌తో కలిపి కూడా 20లక్షల మంది టీచర్లు కూడాలేరు. వీటిలోనూ రెండులక్షలపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మిగిలిన పిల్లలు, విద్యార్థులు ప్రయివేటు విద్యా సంస్థలపై ఆధారపడి చదువుకుంటున్నారు. లేదా చదువు లేకుండానే ఉంటున్నారనే విషయం గ్రహించాలి. వ్యవస్థీకృతంగానే మన పిల్లలు సరైన చదువుకు ఎంత దూరంగా ఉంటున్నారో తెలుస్తున్నది కదా! రక్షణరంగం సైన్యం కోసం వెచ్చిస్తున్న బడ్జెట్లో ఐదవభాగం బడ్జెట్ కూడా కేంద్రం విద్యారంగానికి కేటాయించడం లేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. పైగా కేంద్రీకరణ, కాషాయికరణ, కార్పొరేటీకరణ విధానాలను అమలు పరిచే విధంగా నూతన జాతీయ విద్యావిధానాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లల వికాసానికి బోధనా పద్ధతులపై శ్రద్ధపెట్టక తప్పదు. ఈ బోధనా పద్ధతులు ఉపాధ్యాయులకే కాదు పిల్లలమీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి.
- కె. శాంతారావు
సెల్:9959745723