Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రుడెన్సియా అయాల (1885-1936) ఎల్ సాల్వడార్ కవయిత్రి, వ్యాసకర్త, స్త్రీ హక్కుల కార్యకర్త. 20వ శతాబ్దపు ప్రారంభంలో తన రచనలతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న మహిళ. ఎల్ సాల్వడార్లో స్త్రీలకు ఓటు హక్కు కూడా లేని రోజుల్లో ఆమె అక్కడ దేశాధ్యక్ష స్థానానికి మొదటిసారి పోటీలో నిలిచిన ధీరవనిత! అలాంటి సమాజం ఆమెను ఎలాగూ గెలవనివ్వదు. కానీ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, అంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఆమె ప్రదర్శించిన గుండె ధైర్యం, తెగువ ఎంతటిదో ఊహించుకోవాల్సిందే! ఆ దేశపు సుప్రీంకోర్టు ఆమె నామినేషన్‌ను అప్పుడు కొట్టేసింది. అయితే, ఆమె మరణం (1936) తర్వాత చాలా కాలానికి ఆ దేశ రాజ్యాంగ సవరణ ప్రకారం 1950లో మహిళలకు అక్కడ ఓటు హక్కు లభించింది.
సోన్ సొనేట్ ప్రాంతంలో ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆమె, సాంటా అనా నగరంలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, జర్నలిస్ట్‌గా, రచయిత్రిగా, కార్యకర్తగా రూపుదిద్దుకున్నారు. ఎల్ సాల్వడార్ మధ్య అమెరికాలో ఒక దేశం. దీనికి సాన్ సాల్వడార్ రాజధాని. ఇదే ఆ దేశంలోని అతిపెద్ద నగరం. అక్కడి ప్రస్థుత జనాభా 6.8. మిలియన్లు. ఇందులో ఎక్కువ శాతం మంది స్పానిష్ మాట్లాడుతారు. ప్రుడెన్సియా అయాల కేవలం మహిళా సాధికారత కోసం ఉద్యమించడమే కాదు, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా స్పందిస్తూ వచ్చారు. అమెరికా నియంతృత్వ ధోరణితో- వారి దేశం మీద సైనిక చర్య చేపట్టడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. అంతేకాదు, పరిపాలనలో పారదర్శకత ఉండాలనీ, ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని, మద్యం అమ్మకాలను నియంత్రించాలని, హక్కులు స్త్రీలతో పాటు పిల్లలకు కూడా ఉండాలని సామాజిక కార్యకర్తగా ఆమె ఉద్యమాలు సాగించారు. ఫలితంగా అనేక సార్లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గాటిమల, ఎల్ సాల్వడార్‌లలో కొంతకొంత కాలం జైల్లో పెట్టారు. అందుకు ఆమె విచారించలేదు.
పై వాటితో పాటు, పెళ్ళికాని జంటలకు పుట్టిన పిల్లలకు కూడా హక్కులు వర్తింపజేయాలని ఆమె డిమాండ్ చేశారు. అక్రమ సంబంధంతో పిల్లల్ని కన్నవారికి శిక్ష విధించవచ్చు గానీ, ఏమీ తెలియని పిల్లలు ఎందుకు బలికావాలీ? అన్నది ఆమె వాదన. యువ జంటలు పెళ్ళయిన వారా? కానివారా? వారి సంబంధం సక్రమ మైందా కాదా? - అని పసి బిడ్డలు చూసుకుని పుట్టరు కదా? పుట్టారంటే వారికి బాలల హక్కులు, ఆ తర్వాత మానవ హక్కులు వర్తించవల్సిందేనన్నది ఆమె ఉద్దేశం.
''స్త్రీ-పురుషుడు ఉంటేనే ఇల్లు. స్త్రీ-పురుషుడు ఉంటేనే ఇంట్లో ఇంద్ర ధనుస్సులు. స్త్రీ-పురుషుడు ఉంటేనే సమాజం. స్త్రీ-పురుషుడు ఉంటేనే రాబోయే తరాలు. స్త్రీ-పురుషుడు అంటేనే జీవన సౌందర్యం! స్త్రీ-పురుషుడు ఉంటేనే అర్థం-పరమార్థం. అందువల్ల దేశంలో పౌరసత్వం అనేది ఇద్దరికీ సమానమే. ఓటు హక్కుతో పాటు ఇతర హక్కులూ బాధ్యతలూ ఇద్దరికీ సమానమే. సమాజంలో సమ భాగస్వాములైన స్త్రీలను తక్కువగా చూడటం, సౌకర్యాలు కల్పించకపోవడం, విద్యనందించక పోవడం హేయమైన చర్య. సత్వరం దాన్ని సరిచేసుకోవాలి'' అని ఆమె జీవితాంతం ఆవేదన చెందారు. ఆక్రోషించారు. చివరికి ఆమె మరణం తర్వాత చాలా కాలానికి - ఆమె కృషి ఫలితంగానే - మార్పులు జరుగుతూ వచ్చాయి.
పురుష అహంకారాన్ని ధిక్కరిస్తూ హక్కుల కోసం పోరాడుతున్న ప్రుడెన్సియా అయాలా గూర్చి ఆ దేశపు తత్త్వవేత్త, రచయిత, జర్నలిస్ట్ అయిన అల్బర్టో మాస్ ఫెర్రర్ - ఆరోజుల్లో ఇలా రాశాడు...
''ప్రుడెన్సియా అయాల పోరాటంలో న్యాయం ఉంది. ఆమె కేవలం స్త్రీ అయినందుకే ఆమెను రాజకీయాల్లోకి రాకూడదనడం, ఎన్నికల్లో నిలబడగూడదనడం అన్యాయం. స్త్రీలను చులకనగా చూడకూడదని ఆమె గొంతెత్తి ఆక్రోషించడంలో నిజాయితీ ఉంది. నిబద్దత ఉంది. విశ్వ జనీనమైన ఆమె వాదనను ఆలకించాల్సిందే. శ్రద్ధ వహించాల్సిందే. ఒక మహౌన్నతమైన ఆశయం కోసం ఆమె సమిధ కావడానికి సిద్ధపడ్డారు. ఇక, ఈ దేశంలో లింగ అసమానత్వం ఇంకా ఎంతోకాలం నిలవదు''- అని!
హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీరవనితగా ప్రపంచం గుర్తించిన తర్వాత, ఆమె మరణానంతరం వారి దేశం ఫ్రుడెన్సియా అయాలకు దేశపు అత్యున్నత గౌరవం - 'ఆర్డర్ ఆఫ్ జోస్ మాటియాస్ డెల్ గాడో' 2014లో ప్రకటించింది.
ప్రుడెన్సియా అయాలకు సమకాలీన కాలంలో లేదా అంతకు ముందు కాలంలో భారత దేశంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం! దాని వల్ల ప్రపంచ దేశాల కంటే ఈ దేశంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయా? భిన్నంగా ఉన్నాయా బేరీజు వేసుకోవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, స్త్రీలకు ఓటు హక్కు ఉండాల్సిన అవసరాన్ని 'ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్' (1917)నొక్కి చెప్పింది. ఈ సంస్థ ప్రకటించిన 'స్త్రీ ధర్మ' పత్రిక అందుకు తీవ్రంగా కృషి చేసింది. ఆ సంస్థ రూపొందించుకున్న ధ్యేయాలు ఈ విధంగా ఉన్నాయి. 1. భారత మాతకు ప్రియమైన కూతుర్లందరూ వారి వారి బాధ్యతల్ని తెలుసుకోవాలి. 2. తల్లులుగా, భార్యలుగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఒకవైపు భవిష్యత్ భారతాన్ని తీర్చిదిద్దుతూ, మరోవైపు కుటుంబ సభ్యులకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 3. పురుషులకు ఉన్నట్లుగానే స్త్రీలు కూడా ఓటు హక్కు సాధించుకోవాలి. మున్సిపల్, లెజిస్టేటివ్ కౌన్సిల్ వంటి ఎన్నికల్లో పోటీ చేయగల హక్కును పొందాలి. 4. వివిధ మహిళా కమిటీలు ఏర్పడి, స్త్రీ జనాభ్యుదయానికి కావల్సిన వివిధ ప్రణాళికలు రూపొందించాలి. వాటికి కార్యరూపం ఇవ్వాలి. ముఖ్యంగా స్త్రీ విద్యకోసం ఎక్కువ శ్రమించాలి. ఈ ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ 1917లో మద్రాసు (చెన్నై) అడయార్‌లో ప్రారంభమైంది. మార్గరెట్ కజిన్స్, అనిబిసెంట్, జినా రాజదాస, దోరోతి వంటివారు పూనుకుని సంస్థను పురోగమన దిశగా నడిపించారు.
ఇక్కడ స్త్రీలకు విద్య నేర్పించి, వివేకవంతుల్ని చేసిన ఘనత సావిత్రిబాయి ఫూలే దే (1831-1897). ఆమె ఒక మరాఠి కవయిత్రి, మేధావి మాత్రమే కాదు... స్త్రీ జనోద్దరణకు అలుపెరుగని పోరాటం చేసిన తొలి ఉపాధ్యాయురాలు. భర్త జ్యోతిబా ఫూలే (1827-1890)తో పాటు అంటరాని తనాన్ని అంతమొందించిన ధీర వనిత! 1848లో ఆమె మహిళల కోసం తొలి పాఠశాలను ప్రారంభించారు. అందులో బ్రాహ్మణేతర జాతుల ఆడపిల్లలకు రాత్రింబవళ్ళు చదువు చెప్పారు. 1873లో 'సత్య శోధక్ మండల్' ప్రారంభించి తద్వారా ఒక మహౌద్యమానికి రూపకల్పన చేశారు. దేశంలో నెలకొన్న సామాజిక పరిస్థితుల ప్రకారం ఓటు వేసే హక్కును, విద్యాలయాల్లో చదువుకునే అర్హతను స్త్రీకి ఊహించలేమని ఆనాటి మేధావులు కొందరు ఆవేదన వెలిబుచ్చారు. అయితే 19వ శతాబ్దంలో రామ్మోహన్రారు లాంటి సంఘ సంస్కర్తలు స్త్రీ జనోద్దరణకు పూనుకున్నారు. కాలక్రమంలో పరిస్థితులు మారాయి. 20వ శతాబ్దం వచ్చే సరికి పరిస్థితులు చాలా మారాయి.
స్త్రీకి పురుషుడితో సమానమైన ప్రతిపత్తి లభించాలని స్త్రీలే సంఘర్షణ ప్రారంభించారు. ప్రుడెన్షియా అయాల వంటి వారి జీవితాలు మనకు తెలిశాయి గనక, ప్రపంచ దేశాలన్నింటిలో స్త్రీల పరిస్థితి ఒకేవిధంగా ఉందని తెలుస్తోంది. ప్రపంచపు పనిలో మూడింట రెండువంతులు పనిచేసి, పదింట ఒక వంతు మాత్రమే సంపాదించుకుని - నూటికి ఒక వంతు ఆస్థి కూడా సమకూర్చుకోలేని అభాగ్యుల మీద, అర్థ జనాభా అయిన స్త్రీల మీద చరిత్రలో మొట్టమొదటిసారి ప్రపంచపు దృష్టి పడింది. అప్పటి నుంచే చరిత్ర తప్పిదాన్ని సరిచేయడానికి తగిన కృషి ప్రారంభమైంది. తల్లిగా, భార్యగా స్త్రీ నిర్వహించే పాత్ర అద్వితీయమైంది. ఆమె కాలాన్ని, శక్తిని, ఆలోచనల్ని, అన్నింటినీ ఇంటిపని మింగేస్తుంది. ఆ పని ఎంత విలువైందో, అంత 'విలువ' లేనిది! అంటే ఎంత పని చేసినా ఆమెకు ఒక రూపాయి ఆదాయంగానీ, కనీసం గుర్తింపు గానీ దొరకవు. ప్రపంచ దేశాలన్నింటా పరిస్థితి ఇదే. ఇంటి పని పోను, బయటిపని అదనం! అంటే ఒక రోజులో స్త్రీలు రెండు రోజుల పని చేస్తున్నారన్నమాట.
ప్రపంచంలో గల ఆహారంలో సగానికి పైగా పండించేది స్త్రీలే. కానీ, వారికంటూ భూమి ఉండదు. ప్రభుత్వం సహాయంగానీ, బ్యాంకు రుణాలుగానీ ఉండవు. ప్రపంచ కూలీలలో మూడువంతులు స్త్రీలే. చేసే పని ఒకటే అయినా, పురుషుడి కంటే స్త్రీకి తక్కువ కూలీ చెల్లిస్తారు. ఇంటి పనుల్లాగానే, వారు చేసే వ్యవసాయ పనులకు, నిర్మాణ పనులకు కూడా సరైన విలువ లేదు. నిన్న మొన్నటి దాకా ఉద్యోగాల్లో కూడా ఈ తేడా ఉండేది. చేస్తున్న ఉద్యోగం ఒకటే అయినా, స్త్రీల వేతనం పురుషుల వేతనం కంటే తక్కువగా ఉండేది. 1975-80 ప్రాంతాల్లో ఈ తేడా సవరించబడింది. తెలివైన చురుకైన స్త్రీలు సెక్రటరీలుగా, క్లర్కులుగా, పీఏలుగా పనిచేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు పురుషులు కూడా చేస్తున్నారు. అయితే, వారి సంఖ్య తక్కువ. పురుషులు మేనేజర్లుగా, నిర్వహణాధికారులుగా, యజమానులుగా ఉంటున్నారు. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో కూడా ఇలాగే ఉంది. ఈ 21వ శతాబ్దంలో పరిస్థితులు మరింతగా మెరుగయ్యాయి. పురుషులతో పాటు స్త్రీలకు కూడా అన్ని హక్కులూ లభించాయి. విద్యావంతుల సమూహాల్లో అవగాహన పెరిగిన కుటుంబాలలో పెనుమార్పులు చోటు చేసుకుం టున్నాయి. పురుషులు ఇంటి పనిలో, పిల్లల సంరక్షణలో భాగస్వాములవుతున్నారు. స్త్రీలు కూడా సంపాదన కోసం పరుగులు తీస్తున్నారు. అయితే, స్త్రీ, పురుష స్వేచ్ఛ కట్టలు తెంచుకోకుండా జాగ్రత్త పడాల్సివస్తోంది!
వ్యాసకర్త: కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.