Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడూ ఇచ్చిన వెంటనే కాఫీ తాగేసే గౌరీశంకర్ ... పూర్తిగా చల్లారిపోయినా ఇంకా తాగకపోయే సరికి ఏమైందా అని అనుమానమొచ్చింది భార్యామణికి.
ఇదేమిటండీ ఇంకా కాఫీ తాగలేదు. చల్లారిపోయింది కూడాను. ఉండండి. వేడి చేసి తీసుకొస్తానని వంటింట్లోకి వెళ్లబోయిన ఆమెను ఆపి... కాఫీ సంగతి తరువాత గానీ, నాకో విషయం అంతుచిక్కడం లేదు. ఎన్ని పేపర్లు చదివినా అర్ధం కావడం లేదు సరికదా, బుర్ర పాడయిపోతోందనుకో! అనడంతో...అదేమిటో చెప్పండి... నాకేమయినా అర్ధమవుతుందేమో చూద్దాం. ఏమీ లేదోరు. కేరళ, తెలంగాణ, బెంగాల్ వంటి రాష్ట్రాలలో గవ ర్నర్లు అక్కడి ప్రభుత్వాల మాట వినకుండా ఎందు కు వారిపై పెత్తనం చేస్తున్నారంటావ్? వారికే మైనా పిచ్చి పట్టిందా? ఎంత గింజుకున్నా నాకర్ధం కావటం లేదు. ఇలా చేయడం వల్ల వారికి ఒరిగిందేమిటని?
అయ్యో! ఎంత అమాయకులండీ మీరు! వారేమీ చేయడం లేదు. వారితో చేయిస్తున్నారు. మీరు చూడండి. ధరలు పెంచేస్తున్నా, దేశ సంపదను కార్పొరేట్లకు అమ్మేస్తున్నా, నిరుద్యోగం పెరిగిపోతున్నా ఈ మోడీ పార్టీ అనేక రాష్ట్రాలలో అధికారంలోకి ఎలా వస్తోందనుకుంటున్నారో తెలుసా అని ఒక సారి భర్త మొహాన్ని పరికించి చూసింది. పాపం ఆయనేమో ఏమీ అర్ధంకానట్లు మొహం చిట్లించడంతో, మరలా చెప్పడం ప్రారంభించింది. ఒక్కసారి మీరు రోజు చదివే వార్తలన్నీ దగ్గర పెట్టి చూడండి. మీకే అర్ధమవుతుంది. ఈ మోడీ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక మార్గాలను ఎలా అన్వేషిస్తోందో చూడండి.
ఒకటి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం.
రెండోది ప్రజలలో ఉన్న భక్తి భావాలను సొమ్ము చేసుకునేలా దేవుడి గుళ్ళ పేరున ఓట్లు దండుకోవడం.
మూడోది మన ప్రజలకు దైవ భక్తే కాదు. దేశ భక్తి కూడా మెండుగా ఉంది కదండీ. ఆ పేరున ఏ చైనా వాడో, పాకిస్తాన్ వాడో దేశంలోకొచ్చేస్తున్నాడని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం.
నాల్గోది, ఇక ఎన్ని చేసినా అత్యధిక రాష్ట్రాలలో గెలవలేకపోయే సరికి మరో కొత్త మార్గాన్ని మొదలెట్టారు. అదేమిటంటే ఇతర పార్టీల నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలను కోనేయడం. వారు అమ్ముడు పోకపోతే తమ చేతిలో ఉన్న సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగ సంస్థలతో తప్పుడు కేసులు బనాయించి, బెదిరించడం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ మధ్య ఇలాగే చేసింది.
ఇక ఐదోది, పైవేవీ సాధ్యం కాకపోతే రాష్ట్రాలకు తాను నియమించిన గవర్నర్లతో నాటకాలాడించడం. చూడండి మన రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లే గవర్నర్లు నడుచుకోవాలి తప్ప, వారేమీ స్వంతంగా నిర్ణయాలు చేయడానికేమీ లేదు. అందుకే కమ్యూనిస్టులతో సహా కొన్ని పార్టీలు అసలు ఈ గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు మీకర్ధంకాక బుర్ర పాడుచేసుకుంటున్నది ఈ విషయంలోనే. కేరళ గవర్నరుకు ఎంత ధైర్యం? తనకు నచ్చకపోతే మంత్రులనే బర్తరఫ్ చేసేస్తానని బెదిరిస్తున్నారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలలోని వైస్ చాన్సలర్లందరినీ మూకుమ్మడిగా మార్చేస్తానంటున్నారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన అనేక బిల్లులపై సంతకం పెట్టడం లేదు. ఇక తెలంగాణ గవర్నరయితే ఏకంగా సమాంతర ప్రభుత్వాన్నే నడిపేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా చెప్పకుండా అనేక అధికారిక కార్యక్రమాలు స్వంతంగా చేసేసుకుంటున్నారు. ఢిల్లీలో చూడండి. అక్కడి లెఫ్ట్నెంట్ గవర్నర్ ... కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఎన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారో! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలెండి. తన మాట వినని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ ఇదే తంతు.
ఇవేవీ కాకపోతే మరెన్నో కొత్త మార్గాలను చూస్తారు. మీరూ చదువుతారు. ఎలాగైనా అధికారం వెలగబెట్టడమే వారి లక్ష్యం. రాజ్యాంగం, తొక్క, తోటకూర అంటూ వారేమీ ముడుచుకు కూచోరు. మోడీ గారంటే ఏమనుకున్నారు? తమాషాలేమీ కాదు.
అమ్మో! వీటి వెనక ఇన్ని మతలబులున్నాయా? నేనెప్పుడూ పేపర్లో వార్తలు ఉన్నవున్నట్లు చదివేయడమే కానీ, వాటి వెనకున్న కుట్రలను చూడనే లేదు సుమా - అనుకుంటూ డ్యూటీకి టైమవడంతో స్నానానికి పరిగెట్టాడు గౌరీశంకర్.
- సీతారాం