Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా విజయం సాధించడాన్ని యావత్ ప్రపంచం స్వాగతించింది. తీవ్ర మితవాద అధ్యక్షుడు జేర్ బోల్సనారోను ఓడించి నూతన అధ్యక్షుడిగా లూలా గెలుపొందడం బ్రెజిల్ భవితవ్యంపై, మొత్తంగా లాటిన్ అమెరికా ప్రాంతంపై ప్రభావం చూపనుంది.
అక్టోబరు 30న జరిగిన రెండో రౌండ్ ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ (పి.టి) అభ్యర్ధి లూలా 50.9 శాతం ఓట్లు గెలిచారు బోల్సనారోకి 49.1 శాతం ఓట్లు లభించాయి. అంటే మొత్తంగా 21,25,334 ఓట్ట తేడాతో ఆయన గెలుపొందారు. 1980వ దశకంలో బ్రెజిల్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికలు ఇంత పోటా పోటీగా జరగడం ఇదే తొలిసారి. అలాగే గద్దె మీదున్న అధ్యక్షుడు ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి.
మొదటి రౌండ్ ఎన్నికల్లోనే లూలా చాలా సులభంగా విజయం సాధిస్తారని అనేక పోల్స్, వ్యాఖ్యాతలు ఊహించారు. బోల్సనారోపై లూలాకు రెండంకెల పాయింట్ల తేడా వుంటుందని వరుసగా జరిగిన పలు సర్వేలు వరుసగా చెబుతూ వచ్చాయి. కానీ, ఈ ఊహాగానాలన్నీ తప్పు అని అక్టోబరు రెండున జరిగిన మొదటి రౌండ్ ఎన్నికల్లో రుజువయ్యాయి. లూలాకు 48.3 శాతం ఓట్లు లభించాయి. బోల్సనారోకు 43.20 శాతం ఓట్లు లభించాయి. ఏ అభ్యర్ధి అవసరమైన 50 శాతం ఓట్లను పొందలేకపోవడంతో రెండో రౌండ్ ఎన్నికలు నిర్వహించడం అవసరమైంది.
2003-2010 మధ్య లూలా రెండుసార్లు బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికైంది మూడోసారి. అయితే ఈ సమయంలో బ్రెజిల్లో పరిస్థితులు గణనీయంగా మారినందున మూడో పదవీకాలం తీవ్ర సవాళ్ళతో కూడినదిగా కనిపిస్తున్నది.
తొలిసారి లూలా అధ్యక్షుడిగా ఎన్నికైనపుడు సరుకుల మార్కెట్లో పెద్ద బూమ్ ఉంది. దాన్ని అవకాశంగా తీసుకుని, పి.టి ప్రభుత్వం అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వీటివల్ల లక్షలాదిమంది బ్రెజిలియన్లు దారిద్య్రం నుంచి బయటపడ్డారు. 2014 చివరి నాటికి లూలా, ఆయన వారసురాలు దిల్మా రౌసెఫ్‌లు అనుసరించిన విధానాల కారణంగానే బ్రెజిల్ ఆకలి నుంచి బయటపడినట్టు ప్రకటించారు. ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారింది. ఆహారం, పోషకాహార సార్వభౌమాధికారం, భద్రతపై బ్రెజిలియన్ రీసెర్చ్ నెట్వర్క్ వెల్లడించిన వివరాల ప్రకారం, 3.1 కోట్ల మంది బ్రెజిలియన్లు ప్రస్తుతం ఆకలి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య గతేడాది కన్నా దాదాపు రెట్టింపుగా ఉంది.
కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు 7 లక్షల మంది బ్రెజిలియన్లు మరణించారు. బోల్సనారో ప్రభుత్వ అసమర్ధత, నిర్వహణా లోపమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. కరోనా వైరస్ లేదని, అదేమీ వ్యాపించడం లేదని బోల్సనారో చెప్పారు. దీంతో సహజంగానే ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి దేశం సరిగా సిద్ధం కాలేదు. సైన్స్‌ను నిరాకరించడం, ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల కారణంగా ఆరోగ్య వ్యయంలో కోతలు పెట్టడంతో కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం మరింత ఉధృతమైంది. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో తలెత్తిన ముడుపుల ఆరోపణలు ప్రభుత్వ అమానవీయ సంస్కృతిని బహిర్గతం చేశాయి.
హేతుబద్ధతకు, సైన్స్‌కు బోల్సనారో వ్యతిరేకి. అంతేగాక వాతావరణ మార్పులను కూడా ఆయన తీవ్రంగా తిరస్కరిస్తారు. ఈ అభిప్రాయాలు, ఆయన కార్పొరేట్ అనుకూల వైఖరి...పర్యావరణ పరిరక్షణ నిబంధనల క్షీణతకు దారితీశాయి. దాంతో అమెజాన్ వర్షాధార అడవుల్లో పెద్ద మొత్తం కాలిపోవడానికి దారి తీసింది. పర్యావరణవేత్తలు, హరిత కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అమెజాన్ అడవుల్లో పెద్ద మొత్తం భూభాగాల్లో చెట్లను కొట్టివేశారు. వ్యవసాయ కార్పొరేషన్లు, బడా భూస్వాములు సాగించే సాగు కోసం ఈ భూములను సిద్ధం చేశారు.
రాజకీయ రంగంలో, ప్రజాస్వామిక హక్కులపై బోల్సనారో తీవ్రమైన దాడులు ప్రారంభించారు. బ్రెజిల్లో తొలినాటి సైనిక, నియంతృత్వ ప్రభుత్వాలకు బోల్సనారో బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఫాసిస్ట్ అనుకూల సానుభూతిని నిస్సిగ్గుగా వ్యక్తీకరించారు. కార్మిక సంఘాలు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలపై తీవ్రంగా దాడి చేశారు. కమ్యూనిస్టు వ్యతిరేక, వామపక్ష వ్యతిరేక ప్రమాణాలను చాటి చెప్పుకున్నాడు.
సైన్స్ వ్యతిరేక, హేతుబద్ధ వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక, కమ్యూనిస్టు వ్యతిరేక వైఖరుల కారణంగా బోల్సనారో ఎవాంజిలికల్ క్రైస్తవుల మద్దతును పొందారు. ఆయనకు గల ముఖ్యమైన మద్దతులో వీరి వాటా ఎక్కువ. బ్రెజిల్ రాజకీయాలు, సమాజంలో శక్తివంతమైన కన్జర్వేటివ్ బలగంగా వున్న ఎవాంజిలికల్ పాస్టర్లు బోల్సనారోకి తమ మద్దతును ప్రకటించారు. ఆయన నైతిక వైఖరులను సమర్ధించారు. వామపక్షాలకు వ్యతిరేకంగా క్రియాశీలంగా ప్రచారం చేసే ఈ మత మితవాద వర్గాలు 'లూలా చర్చిలను మూసివేయిస్తారని' పేర్కొన్నాయి. ఈ తరహాలో, దేశవ్యాప్తంగా బోల్సనారో మితవాద సిద్ధాంతకర్తలను సమీకరించగలిగారు. సామాజిక విభజనలను మరింత ప్రోత్సహించారు.
ఎవాంజిలికల్ క్రైస్తవులతో పాటు బోల్సనారోకు మద్దతు ఇచ్చేవారిలో నయా ఉదారవాదులు, స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక విధానాలను గట్టిగా ఆచరించేవారు, ఎగువ తరగతి వారు, వాణిజ్య వర్గాలు, బడా బూర్జువా వర్గాలు ఉన్నాయి. అగ్రి కార్పొరేషన్లు, బడా భూస్వాములు కూడా ఆయనతో పాటే నిలిచారు. ఆ రకంగా తీవ్ర మితవాద విభాగం బోల్సనారో వైపు నిలబడింది.
పాలక వర్గాలు, తీవ్ర మితవాద వర్గాల నుంచి వస్తున్న ఈ మద్దతు కారణంగా, మీడియాలో బలమైన వర్గంపై బోల్సనారోకు మొత్తంగా నియంత్రణ లభించింది. అసత్యాలు, తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించింది. దీనికి విరుద్ధంగా, సమాజంలోని నిరుపేద వర్గాల నుంచి లూలాకు మద్దతు లభించింది. ఈ వర్గాల నుంచి వస్తున్న విస్తృత మద్దతుతో లూలా గెలుపొందగలరని భయపడిన బోల్సనారో, తక్కువ ఆదాయ వర్గాల వారికి నగదు బదిలీలను నేరుగా చేసే సామాజిక కార్యక్రమమైన ఆక్సిలియో బ్రసిల్ ద్వారా వారి మనస్సులు గెలుపొందేందుకు ప్రయత్నించారు. కోవిడ్ కాలంలో ఈ పథకాన్ని పరిమిత కాల పథకంగా ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యానికి అన్ని వైపుల నుంచి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. అయితే, ఈ పథకానికి వచ్చిన సానుకూల ప్రతిస్పందన, నిరుపేద వర్గాల్లో లూలాకు గల మద్దతుకు కోత పెట్టడం చూసి బోల్సనారో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ ప్రయత్నాలన్నింటి ఫలితంగా ఈ అధ్యక్ష ఎన్నికల్లో లూలాకు... బోల్సనారో గట్టి పోటీని ఇవ్వగలిగారు. అంతిమంగా, కాంగ్రెస్‌లో, గవర్నర్ స్థానాలలో, ప్రాంతీయ అసెంబ్లీల్లో (మొదటి దఫా అధ్యక్ష ఎన్నికలతో పాటే వీటికి కూడా ఎన్నికలు నిర్వహించారు) సెంటర్ పార్టీలతో పాటు మితవాద శక్తులు కూడా మెజారిటీ సాధించడానికి దారితీసింది.
బ్రెజిల్‌లోని 27 రాష్ట్రాలకు గానూ బోల్సనారో 14 రాష్ట్రాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌లో 513 డిప్యూటీలకు గానూ 249 డిప్యూటీలను (సగానికి కాస్త తక్కువగా) మితవాద పార్టీలు గెలుచుకుని తమ వాటాను పెంచుకున్నాయి. లూలాకు చెందిన పి.టి, మిత్రపక్షాలకు కేవలం 141 సీట్లు లభించాయి.
అయితే పార్లమెంట్లో మితవాద విభాగం బలంగా వుండడం వల్ల లూలా తన ఎజెండాను అమలు చేయడం కష్టం కానుంది. ఈ నేపథ్యంలో లూలా తన పదవీ కాలంలో కొన్ని రాజీలు, సద్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం వుంది.
ఇప్పటికే లూలా గెలుపొందేందుకు కొన్ని రాజీలను కుదుర్చుకోవాల్సి వచ్చింది. తన ప్రసంగాల్లో దేవుడు, పురాణాల గురించి ఉటంకించడం ద్వారా ఎవాంజలిస్టులను అనుసరించే ప్రజలను తన వైపునకు తిప్పుకోవడానికి లూలా ప్రయత్నించారు. మాజీ ప్రత్యర్ధి, సెంటర్ పార్టీ నేత గెరాల్డో అల్కమిన్...లూలా ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఉన్నారు. లూలా సంకీర్ణంలో కమ్యూనిస్టులు, సోషలిస్టుల నుంచి లిబరల్ బూర్జువాల వరకు అందరూ వున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిం చడం, మితవాద పురోగతిని ఓడించడం, అమెజాన్ అడవులను నరికివేయకుండా కాపాడుకోవడమనే ఉమ్మడి లక్ష్యంతో వీరందరూ ఒక తాటిపైకి వచ్చారు.
బ్రెజిల్ వ్యాప్తంగా పేద ప్రజలందరూ లూలా విజయాన్ని సంతోషంగా జరుపుకున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ తిరిగి వచ్చాయంటూ వారు ప్రశంసించారు. ఇది ప్రజాస్వామ్య ఉద్యమానికి విజయమని లూలా వ్యాఖ్యానించారు. దారిద్య్రం, ఆకలి సమస్యలను తక్షణమే పరిష్కరించి, కనీస వేతనాలను పెంచుతానని, అమెజాన్ అడవులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన లూలాకు లాటిన్ అమెరికాలోని వివిధ దేశాల నుంచి ప్రపంచ నేతల వరకు అభినందనలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కచ్చితంగా బ్రిక్స్, సెలాక్ వంటి బహుళపక్ష గ్రూపులకు కొత్త ఆశాకిరణంగా వుండనుంది.
ఈ ఎన్నికల్లో బోల్సనారో ఓడిపోయినప్పటికీ, ఆయన గెలుచుకున్న ఓట్లు చూస్తుంటే సామాన్యుల్లో మితవాద సిద్ధాంతాలు ఎంతలా చొచ్చుకుపోయాయో స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి, ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించడానికి, ప్రజల జీవనోపాధులను కాపాడేందుకు, ఆకలి-దారిద్య్ర నిర్మూలనా చర్యలు చేపట్టేందుకు లూలా ప్రభుత్వం కృషి చేయాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య హక్కుకు పొంచివున్న ముప్పును నివారించగలం.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)