Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రసార మాధ్యమాలతో ఏదో ఒక అంశంపై వ్యాపార మెలకువలు వస్తుంటాయి. ప్రయివేటు వ్యాపారులు తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రతి రోజు బిజినెస్ ట్రిక్స్ చెబుతారు. వీటిని ఔత్సాహికులు ఒంట పట్టించుకోవడం కంటే సర్కారు బాగా ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తున్నది. అందులోనూ రవాణా శాఖ మరీనూ. చౌరస్తాలు, సందుల్లో ఎక్కడా చూసినా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షమవుతున్నారు. ఎందుకంటే ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అనుకునేరు. కాదు తాము నేర్చుకున్న బిజినెస్ ట్రిక్స్ తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. అది కూడా టార్గెట్లు పెట్టుకుని ప్రయాణీకుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. అందులో ఒక ట్రిక్ ఏందంటే ముందుగా ఒక నిబంధన రూపొందిస్తారు. అది కూడా డబ్బులు బాగా వసూలయ్యే విధంగా ఉంటుంది. ఫ్రీ లెఫ్ట్‌లో బండి ఆపితే వెయ్యి రూపాయల ఫైన్ వేస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి మన పోలీసులు అగితేనా? లైసెన్స్, హెల్మెట్, రోడ్ క్రాస్, ఫ్రీలెప్టు, ఆర్సీ, రాంగ్‌రూట్, త్రిబుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, నెంబర్‌ప్లేట్ లేకపోతే, అందులో ఒక అక్షరం లేకున్నా... ఇలా ఏ చిన్న ఆదాయ మార్గాన్ని కూడా వదిలిపెట్ట్టట్లేదు. దీనినిబట్టే సులువైన, సులభమైన మార్గంగా బిజినెస్ ఎలా చేయాలో సర్కారు నేర్చుకున్నట్టు కనపడుతున్నది. వాహనదారుల నుంచి చలాన్లు వేయడం మంచిదే అనుకుందాం... మరి వాహనదారులకు మంచి రోడ్డు సౌకర్యాన్ని ఇస్తున్నారా? అంటే అదీలేదు. రోడెక్కితే వాహనదారులు పడని అవస్థలు లేవు. ముఖ్యంగా ప్రమాదాలను అరికట్టకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినా సర్కారు వారి డబ్బుల పాట ఆగడం లేదు. ఇగ యూటర్న్ల గోస అంతా ఇంతా కాదు. యూటర్న్ల పేరుతో రెండు కిలోమీటర్లు ఎక్కువ తిరిగి రావాల్సి వస్తున్నది. బహుషా ప్రతి బండీ ఇలా నాలుగైదు సార్లు ఎక్కువ తిరిగితే పెట్రోల్ ఖర్చు ఎక్కువై ఆదాయం పెరుగుతుందనే ట్రిక్ ఉన్నదన్న గుసగుసలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఏమో ఇదీ నిజమే కాబోలు ...!
- అచ్చిన ప్రశాంత్