Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారం వారం శీర్షికలో ఒకే విషయం మీద వరుసగా రెండోవారం రాయడం అరుదుగానే జరుగుతుంది. గుజరాత్ హిమాచల్ ఎన్నికలతో సహా అనేక విషయాలను సృశించవలసి వుంది కూడా. అయినా ఈ వారం మనం హైదరాబాద్ ఆపరేషన్ ఫాంహౌస్, దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన అందోళనకర సమాచార సముద్రం, బోనులో చిక్కిన బీజేపీ కేంద్ర రాష్ట్ర నేతలు కొనసాగిస్తున్న అర్థరహితమైన వాదనలు, దేశంపై వీటి ప్రభావం గురించి తక్కువ చేసి చెబుతున్న కొందరు మేధావుల విచిత్ర అంచనాలు, ఈ విషయాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేస్తున్న హెచ్చరికలు, వీటి నేపథ్యంలో తరలివస్తున్న ప్రధాని మోడీ పర్యటన రాజకీయాలు చెప్పుకోవలసి వస్తున్నది. ఈ మధ్యలోనే మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ సంకేతాలూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే బీజేపీని తక్కువ అంచనా వేసిన వారు గానీ, ఎక్కువ అంచనా వేసి దాని చుట్టూ పరిభ్రమిస్తున్న వారు గానీ నేర్చుకోవలసిన పాఠాలు చాలా వుంటాయి. నేర్చుకోని వాళ్లకు నేర్పడం కోసం స్వయంగా ప్రధాని మోడీ, హొంమంత్రి అమిత్‌షా దూతలే రావడం ఇక్కడం విశేషం. మరొకరి భాష్యం వివరణ లేకుండా బీజేపీ బేహారులే చెప్పిపోయినా ఇంకా వారి తరపున వకాల్తా పుచ్చుకునేవారూ వక్రీకరించే వారూ లేదంటే తిప్పి తిప్పి మాట్లాడుతూ కేసీఆర్ దెబ్బతిన్నట్టు చూపించే వారు ఇంకా కనిపిస్తున్నారంటే మన వ్యవస్థలోనూ మీడియాలోనూ వారెంత లోతుగా వేళ్లూను కున్నదీ తెలుస్తుంది.
దారితప్పించే వాదనలు
గతంలో టీఆర్ఎస్లో చేరికలను పోటీ పెట్టి చూపడం వీరి మొదటి అస్త్రం. అలాగే ఎనిమిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేస్తే లేనిది ఇప్పుడు ఏమవుతుందని మరో సవాలు. చివరగా ఇవన్నీ కోర్టులో నిలవబోవని చప్పరించడం. ఏతావాతా వీటన్నిటి పరమార్థం ఒకటే. ఏమీ కాలేదు, ఏమీ కాదు! గతవారం ఈ శీర్షిక రాసిన రోజునే మరో పత్రికాధిపతి కేసీఆర్ వెనుకంజ వేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తమపై వచ్చిన లిక్కర్ స్కామ్ ఆరోపణల కారణంగా రాజీకి దీన్ని ఉపయోగించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పైగా అమిత్‌షా వంటివారికి సంబంధం వుందని నిరూపించడం కుదిరేపని కాదని కూడా తేల్చేశారు. ఇక్కడ జరిగింది రాజకీ యంగా ఎవరిపనో ప్రతివారికీ అర్థమైంది. మరొకటి సాంకేతికంగా కోర్టులో ఒక ఒరిగిపడుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. కాకపోతే కేసీఆర్ ఈ భాగోతం మొత్తం భారత దేశానికి చేరుస్తానని ప్రకటించారు గనక తెలంగాణకో ఏపీకో పరిమితం కాబోదని మాత్రం స్పష్టమైంది. అయితే దాన్ని కూడా తక్కువ చేసి చూపడం ఏం నీతి? ప్రజలు ప్రజాస్వామ్య ప్రియులు ఈ మొత్తం తతంగాన్ని అసహ్యించుకున్నారు గనకే మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు వెల్లువెత్తారు. దాన్ని గెలిచి నెమ్మదిగా తెలుగు నాట పాగా వేస్తామని బీరాలు పలికిన బీజేపీ నేతలు ప్రచారానికే మొహం చాటేశారు. అగ్రనేతలు వెనక్కి మళ్లారు.త
అగ్రనేతలు వెనక్కు
ఎగ్జిట్‌పోల్స్ ఏవీ బీజేపీకి విజయం గానీ భారీ ఓటింగు గానీ వస్తుందని చెప్పలేక పోయాయి. పండితులు పాలకులు ఏమంటున్నా సామాన్య ఓటర్లు సారాంశం సరిగ్గా గ్రహించారు గనకే ఇలా జరిగిందనడం నిస్సందేహం. ఈ విషయంలో మీడియానే గాక ఉన్నత న్యాయస్థానం కూడా ఆశ్చర్యకరంగానే ప్రవర్తించింది. తెలంగాణ హైకోర్టులో ఇద్దరు ఏకసభ్య దర్మాసన నాయ్యమూర్తులు రెండు రకాలుగా ఆదేశాలిచ్చారు. జస్టిస్ విజయసేన్‌రెడ్డి బీజేపీ వేసిన పిటిషన్‌ను స్వీకరించి దర్యాప్తును వాయిదా వేయాలని చెప్పగా జస్టిస్ సుమలత మాత్రం పోలీసుల పిటిషన్‌పై నిందితులను పద్నాలుగు రోజులు కస్టడీకి అనుమతించారు. ఇలా ఒకే కోర్టు నుంచి రెండు తీర్పులు రావడమేమిటని సుప్రీం కోర్టుకే సందేహం కలిగిందంటే భిన్న వ్యవస్థల పాత్ర అర్థమవుతుంది. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ గవాయి, జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఎవరో నిందితులను పట్టుకుంటే ఒక రాజకీయ పార్టీ (బీజేపీ) పిటిషన్ వేయడమేమిటి? వారికేం సంబంధం? దాన్ని ఎలా అనుమతించారు? అని ఆక్షేపించారు. మరోవైపున వారే ఈ కౌంటర్ ట్రాప్ కేసులో సులభంగా బెయిలు ఇవ్వొచ్చు, మా దగ్గరికి వస్తే అప్పుడే ఇచ్చేవాళ్లం, కాకుంటే బీజేపీ పిటిషన్ వేయడం వల్లనే కాస్త ఆలోచించవలసి వస్తు న్నది అంటూ సోమవారానికి కేసు వాయిదా వేశారు. అంటే హైకోర్టును తప్పు పడుతున్న సుప్రీంకోర్టు కూడా నిందితు లను తక్షణం విడుదల చేయొచ్చనే వైఖరి తీసుకుంది.
ఆణిముత్యాలు.. అసలు సత్యాలు
టీవీ చర్చలలోనూ ఇతరత్రా చాలామంది ఈ ఆధారాలు కోర్టులో నిలబడతాయా అని సందేహాలు గుప్పించారు. కాగా కొందరు మాజీ పోలీసు అధికారులు హైకోర్టుకు ఇచ్చిన ఆధారాలు బయిటకు ఎలా విడుదల చేస్తారని కేసీఆర్‌పై విమర్శ ఎక్కుపెట్టారు. అంతేగాని కేసు తీవ్ర స్వభావం, పథకం ప్రకారం ఉచ్చులో చిక్కించడం, ఈ సంభాషణలను పత్రాలను బట్టి దేశంలో ఇతర చోట్ల జరిగిన జరుగుతున్న కుట్రలను విశ్లేషించడం ప్రధానమని భావించలేదు. ఎందుకంటే ఆ వీడియోలలో ఆడియోలలో పత్రాలలో వున్న ఆధారాలు మామూలువి కావు. రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ల త్రయం దేశమే తమ చేతుల్లో వున్నట్టు మాట్లాడారు. తమకు నేరుగా ఆర్ఎస్ఎస్ కీలకమనీ మోడీ అయినా వారి అదుపాజ్ఞల్లో పనిచేయాల్సిందేననీ, రాష్ట్రాల అద్యక్షులు నాయకులు లెక్కలోనే వుండబోరనీ కుండబద్దలు కొట్టి చెప్పారు. 24మందితో కూడిన తమ ముఠా దేశమంతా తిరుగుతూ ఇప్పటికి 240 మందికి పైగా ఎంఎల్ఎలను కొనడం, ఎనిమిది సర్కార్లను కూల్చడం జరిగిందని చెప్పేశారు. ఇప్పుడు తెలంగాణ, ఢిల్లీ తర్వాత రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ తమ ఆపరేషన్ల జాబితాలో ఉన్నాయని ప్రకటించారు. (ఆ వివరాలు మధ్య బాక్సులో) కేరళలో రాహుల్ గాంధీపైన పోటీ చేసిన తుషార్ మోహన్, అమిత్‌షా, బిఎల్ సంతోష్‌ల త్రయం మాత్రమే ఇవన్నీ పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఇన్ని ఆధారాలు, తీవ్రమైన కుట్రలు ఒక్క సారిగా దొరికిపోయినా వాటి గురించి కాకుండా కేసీఆర్ ఎత్తుగడల గురించి మాట్లాడేవారిని ఏమంటాం? పైగా దొరికిపోయిన ముగ్గురికి మాకు ఏ సంబంధం లేదని బీజేపీ నేతలు బుకాయించడం మరీ హాస్యాస్పాదం. ఎందుకంటే వారితో సంబంధం లేకుంటే హైకోర్టులో అందరికన్నా ముందు కేసు వేయాల్సిన అవసరమే లేదు. ఆ పిటిషన్లో ప్రతివాదులుగా ప్రభుత్వాన్ని పోలీసులను తప్ప ప్రధాని తరపున వచ్చామని ప్రకటించుకున్న ఈ ముగ్గురు ముఠాను చేర్చిందేలేదు. మరి నేరుగా బీజేపీ ఆరెస్సెస్‌ల తరపున సంచరిస్తున్నామని వారు చెప్పుకుంటే మోసగాళ్లు ఈ త్రయం అయితే వారిని బోనెక్కించాలి కదా? తమ దగ్గర అనేక ఐడిలు పాన్‌కార్డులు, వుంటాయని స్వయంగా చెప్పుకున్న ఆ టక్కరుల వెనక ఎవరున్నారో తేల్చాలి కదా? వారు మోడీ పేరు చెప్పుకుంటే పీఎంఓ రంగంలోకి రాలేదే? వీటిని బట్టి ఈ దళారులు ఎవరి మనుషులో తేలిపోవడం లేదా? బీజేపీ కేంద్ర పరిశీలకుడుగా వచ్చే తరుణ్‌చుగ్ కేసీఆర్ కూడా తమ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజరులా తడిగుడ్డలతో ప్రమాణం చేయాలని సవాలు చేయడం ఎంత హాస్యాస్పదం? చాలామంది మేధావులు, బీజేపీ అనుకూల అవకాశవాద వ్యాఖ్యాతలు ఇవన్నీ ప్రశ్నించే బదులు టీఆర్ఎస్పైనే అస్త్రాలు అనుమానాలు సంధించడం చూస్తే అసహ్యం కలుగుతుంది. ఎక్కడో ఒకచోట దొంగలు పట్టుబడ్డారని సంతోషించే బదులు, కోర్టులో నిలబడదు గనక ఇదంతా నిరర్థకమని తీసిపారేయడంలో కుటిలత్వమే తొంగిచూస్తుంది.
చరిత్ర చెప్పే సత్యం
ప్రజలు ఇలాంటివి పట్టించుకోరని కొట్టిపారేసేవారు దక్షిణ భారతదేశంలో నాటి కాంగ్రెస్, నేటి బీజేపీ ఎలా దెబ్బతినిపోయాయో మర్చిపోతుంటారు. దేశంలో మొదటి సారి కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని కూల్చిన కాంగ్రెస్ వరుసగా పాలన సాగించలేకపోయింది. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు ఐక్య సంఘటనలను కూల్చిన కాంగ్రెస్ అక్కడ అసలే అధికారంలోకి రాలేకపోతోంది. తమిళనాడులో డిఎంకె సర్కారును రద్దు చేసిన పాపానాకి ఇంతవరకూ జాతీయ పార్టీలు కాలూనలేకపోతున్నాయి. ఎన్టీఆర్‌ను కూల్చిన కాంగ్రెస్ పదేండ్లు మాత్రమే పాలించి ఇప్పుడు ఏపీలో అసలే ఠికానా లేకుండాపోయింది. తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే బలపడ్డాయి. బొమ్మైని కూల్చిన కర్ణాటకలోనూ ఫిరాయిం పులతో అక్రమ ధనంతో రాజ్యాన్ని సాగిస్తున్నారు. బీహార్‌లోనూ రెండు జాతీయ పార్టీలు తాముగా అధికారంలోకి వచ్చింది లేదు. కాంగ్రెస్ ఏకపక్ష రాజకీయాలు, కూల్చివేతలు ఒక తరహా అయితే... బీజేపీ మోడీ హయాంలో మరింత బరితెగించింది గనకే ఆపరేషన్ ఫామ్‌హౌస్ వంటి హీనాతిహీన కృత్యాలకు పాల్పడుతున్నది. దీనికి తోడు వ్యవస్థాగతంగానూ రాష్ట్రాల హక్కులను హరిస్తున్నది. ఏకపక్ష పెత్తనానికి ఎగబడుతున్నది. మతతత్వ రాజకీ యాలతో సమైక్యతకు చిచ్చుపెడుతున్నది. మతాధిపతులను రాజకీయ కుట్రలకూ, శాసనసభ్యుల బేరసారాలకూ వినియోగిస్తున్నది. రాజ్యాంగ నిబంధనలు, దర్యాప్తు వ్యవస్థలు, చట్టాలు, ఏవీ ఆపలేని ఈ భయానక ప్రజాస్వామ్య మేధాన్ని ప్రజలే అడ్డుకోవాల్సి వుంటుంది. వారికి లోబడి వున్నంత మాత్రాన వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ జనసేన వంటి పార్టీలను కూడా ఉపేక్షించరని గత వ్యాసం చివరలో చెప్పుకున్నాం. పట్టుబడిన నిందితులు నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని కూల్చివేయడం అందుకోసం 88 మంది ఎంఎల్ఎలను సమీకరిస్తామని చెప్పడం ఇందుకు నిదర్శనం. మోడీని మోయడమే మంచిదని సలహా ఇచ్చే కొందరు పత్రికాధిపతులు కేసీఆర్ ఎందుకు వెనకంజ వేశారని ముందస్తుగా శాపనార్థాలు పెట్టారు. వీరంతా రేపైనా కళ్లుతెరిస్తే ప్రజాస్వామ్యానికీ వారికీ కూడా శ్రేయస్కరం. రాజకీయమంతా రాష్ట్రాలకే పరిమితంచేసి దేశాన్ని మింగేస్తున్న రాహువును చూడకపోవడం ఆత్మహత్యా సదృశం. అలాగే న్యాయవ్యవస్థ, మీడియా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కెేసీఆర్ చేసిన విజ్ఞప్తి కూడా సముచితమైంది. ఆశించదగింది.
వింటే గోడీ.. లేదంటే ఈడీ
రామచంద్ర భారతి : బీజేపీలో ఈ వ్యవహరాలన్ని ముగ్గురే చూసుకుంటారు. బిఎల్ సంతోష్, అమిత్‌షా నడ్డా, ఈ వ్యవహారం చూస్తున్నారు. పిఎం అన్ని విషయాలు చూసుకుంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది వుండదు. ఏ కమ్యూనికేషన్ గ్యాప్ రాదు.
బాలరాజు: బీజేపీ ఆరెస్సెస్ ఒక్కటేనా వేరేవేరా? జనం రెండు ఒక్కటే అనుకుంటున్నారు
రామచంద్ర: బీజేపీ వేరు ఆరెస్సెస్వేరు... బీజేపీకి బ్యాక్ఎండ్లో ఆరెస్సెస్ వుంటుంది. ముందు సంతోష్ ఒప్పుకున్నాక విషయం అమిత్‌షా దగ్గరకు వెళ్తుంది. సంతోష్ తుషార్ అమిత్ షాలకు చెప్పాము.వారు ఒప్పుకున్నారు.
.. నేను ఆరెస్సెస్ నుంచి వచ్చాను, ఆరెస్సెస్ కోసమే పనిచేస్తున్నాను.
సింహయాజి: ఆయన పిఎం గారితో ఒకే ఫ్లైట్‌లో వెళ్తూ వస్తూ వుంటారు.
రామచంద్ర : ఇవిఎంలను వ్యూహాత్మకంగానే వాడుతున్నాం.
రోహిత్: కర్ణాటక మహారాష్ట్ర ఆపరేషన్లు స్వామీజీయే చేశారు. కాంగ్రెస్‌నుంచి 16 మంది వచ్చారు...తెలంతాణ ఆంధ్ర రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కన్నా భిన్నం.
సింహయాజి: బండి సంజయ్ కిషన్‌రెడ్డి ఏదేదో చెబుతారు. కానీ వాళ్లకు మోడీ అమిత్ షాఅపాయింట్మెంట కూడా దొరకదు. బిఎల్ సంతోష్ చాలా రహస్యంగా నిగూఢంగావుంటారు. ప్రధానిమోడీనే ఆయనదగ్గరకు వచ్చిపోతారంటే మీరేంచెబుతారు?
రామచంద్ర భారతి: ముందు ఇక్కడ యాభై శాతం ఇవ్వాలి. మిగతాది అక్కడ ఇవ్వాలనినేను ఈ రోజే వాళ్లకు చెప్పాను.
సింహయాజి: వింటే గోడీ(దోస్తి) లేదంటే ఇడి.ఇప్పుడు తెలంగాణలో 36 మంది ఎంఎల్ఎలు ఈడీ లిస్టులో వున్నారు.వింటేనేమో జోడీ లేకపోతే ఈడీ అలాక్ అంటాం.
బాలరాజు: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీనిఎవరు డీల్ చేస్తున్నారు:
రామచంద్ర భారతి: సంతోష్ సార్.
(విడియోల్లో రికార్డయిన ప్రతిమాట బీజేపీ ఆరెస్సెస్ అహంభావాన్ని ప్రకటిస్తున్నాయి. ఇవన్నీ వేర్వేరు చోట్ల తీసినవాక్యాలు.)
- తెలకపల్లి రవి