Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుడెప్పుడో బాలనాగమ్మ కథ చెప్పేవారు. అది మాయల మరాఠి కథ కూడ. వాడు బాలనాగమ్మను ఎత్తుకుపోతాడు. ఆమెను తీసుకురావడానికి పోయిన భర్తను మంత్రం వేసి రాయిని చేస్తాడు. బాలనాగమ్మ కొడుకు పెరిగి పెద్దవాడవుతాడు. అన్ని విద్యలూ నేర్చుకుంటాడు. సముద్రాలెన్నో దాటి వెడతాడు. మాయల మరాఠి ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటాడు, వాడి ప్రాణం ఓ చిలుకలో ఉందనీ తెలుసుకుంటాడు. దాన్ని చంపితే వాడి ప్రాణం పోతుంది. వాడిని ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ ఉండదు కాబట్టి వాడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడమే ముఖ్యం. అలా తెలుసుకొని, ఆ చిలుకను సంపాదించి దాన్ని చంపి, (అంటే మరాఠిని అన్నమాట) తల్లిని తండ్రిని విడుదల చేసుకొని తమ రాజ్యానికి తిరిగి వస్తాడు. అలా సుఖాంతమవుతుంది కథ. సాధారణంగా కథ మంచిగా ముగియడమే చదివేవాళ్ళు, వినేవాళ్ళు, చూసేవాళ్ళు కోరుకునేది. ఐనా మాయలోడు మరాఠీనే ఉండనవసరంలేదని మనకు బాగా తెలిసిపోయింది. ఇప్పుడు మాయలోడు కొత్త రూపు, షేపు సంతరించుకొని మనకు కనిపించవచ్చు.
కట్ చేసి ఇప్పటికొస్తే, 'గోడు' ముగిసింది. పెట్టెలో ప్రాణం ఉంది, ఎవరిది పోతుందో ఎవరిది బతుకుతుందో కొద్ది గంటల్లో తేలిపోతుంది. ఐతే కథ ఐపోవడం కాదు, కథ మొదలయ్యింది అంతే. పెట్టెలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. అదుండొచ్చు, ఇదుండొచ్చునని కొందరు చెప్పినా మ్యాజిక్ చేసే ఇంద్రజాలికుడికే తెలుస్తుంది తాను అబ్రకదబ్ర అని మంత్రదండం తిప్పినట్టు యాక్షన్ చేసి పెట్టె తెరిస్తే ఏమొస్తుందో అని. పెట్టె మారిండొచ్చు కాని అందరి ఆసక్తి మారలేదు. అసలు అది మాయల మరాఠీ పెట్టె అనేవాళ్ళూ ఉండొచ్చు. ఏమైతేనేం పెట్టెనే జీవితం కొందరికి!!
మాయా బజార్ సినిమాలో ఓ తమాషా పెట్టె చూపిస్తాడు శ్రీకృష్ణుడిగా వేసిన అన్న రామారావు. ఆ పెట్టె తెరిచి చూస్తే ఎవరెవరికి ఏది ఇష్టమో అది కనిపిస్తుంది. శశిరేఖకు అభిమన్యుడు, బలరాముడి భార్య రేవతికి నగలు, బలరాముడికేమో తన ప్రియమైన నేస్తం దుర్యోధనుడు కనిపిస్తారు. ఇక కృష్ణుడు చూస్తే శకుని కనిపిస్తాడు, పాచికలు సిద్ధం చేస్తూ. ఇదంతా తమాషాగా అనిపించినా కనిపించినా ఇప్పుడున్న నాయకులు అలాంటి పెట్టెలోకి చూస్తే ఎవరెవరు కనిపిస్తారు అన్నదానికి సమాధానంగా ఎన్నో తమాషా విషయాలు చెప్పుకోవచ్చు. ఒకరికి ఆ పెట్టెలో ఒక రాష్ట్రమో కొన్ని రాష్ట్రాలో కనిపిస్తే ఇంకొకరికి దేశం మొత్తం కనిపించొచ్చు. ఒకరికి కనిపించింది ఇంకొకరికి కనిపించనూ వచ్చు లేదా కనిపించక పోవచ్చు. మనసులో ఉన్న కోరికను బట్టి ఆ కనిపించడాలు ఉంటాయి. కృష్ణుడికి శకుని కనిపించినట్టు ఒకళ్ళకి ఒకరు కనిపించవచ్చు. వాళ్ళు నిద్ర రాకుండా చేస్తూ ఉండొచ్చు. అసలు చాలా రోజులుగా నిద్ర లేకుండా ఉన్నోళ్ళూ ×ండొచ్చు. ఇంకెక్కడో తనకు నిద్ర రాకుండా చేస్తున్న మనిషీ ఉండొచ్చు. ఒక రాష్ట్ర+లో తమ పెట్టెకు నష్టం కష్టం అనుకున్నప్పుడు ఇంకో రాష్ట్రం మీదికి పోవచ్చు. ఇదంతా చదరంగం ఆటలా ఉంటుంది. ఇంతకీ ఆ చదరంగం గళ్ళు కూడా గదులే కదా!!
ఇక కంప్యూటర్ యుగానికొచ్చినా ఈ పెట్టెలే గతి. ఇన్ బాక్స్, అవుట్ బాక్స్ ఇలా ఎన్నో పెట్టెలు మనక్కనిపిస్తాయి. కాబట్టి పెట్టెలు ఎప్పటికీ ఉంటాయి. రూపం మాత్రం మార్చుకుంటాయి. అక్కడ కూడా మనకిష్టమైన బాక్సులో మనం మన డాకుమెంట్లు పెట్టుకోవచ్చు. అసలు ఈ కంప్యూటరే ఓ పెద్ద పెట్టె. దాన్ని తెరవాలంటె తాళం చెవి ఉండాల్సిందే. ఎవరి తాళం చెవి వారికి సొంతం. ఇతరులు తీయడం కష్టం. ఇంతకు ముందైతే ఎలా దొంగ తాళం చెవులు ఉపయోగించి పెట్టె తెరిచేవారో ఇప్పుడూ అంతే. బాక్సులు మారాయంతే, మిగతా అంతా సేం టు సేం. అసలు టీవీని ఈడియట్ బాక్స్ అన్న మేధావులు కూడా ఉన్నారు. అందులో నిజానిజాల్లోకి పోవడం ఏమంత శ్రేయస్కరం కాదు కాబట్టి దాన్ని ఎలా వినియోగించుకుంటే అలా మనకు ఉపయోగప డుతుంది. విద్యుత్తు లాగన్నమాట.
సెల్ఫ్ డబ్బా అనీ తన గొప్పల్ని ఇంతవి అంతగా చేసి చెప్పేవాళ్ళను ఇలా సొంత డబ్బా కొట్టేవాళ్ళుగా వర్గీకరించారు. కమల్ హాసన్ దశావతారాల్లో అన్నీ తానై చేసినట్టు చూపించుకున్నట్టే ఈ సొంత డబ్బా వీరులు అన్నీ తమవల్లే ఐనాయని చెప్పేస్తుంటారు. ఎదుటివారు నమ్మలేదని వీళ్ళకి తెలిసిపోతుంటుంది. ఐనా ఆపలేరు, చెప్పేస్తుంటారు. వీళ్ళు చెప్పే విషయాలే వీళ్ళకన్నా బాగా కొందరు మిమిక్రీ లాగ చేసి చూపుతుంటారు. అవి ఇంకా బాగా ఉంటాయి వినడానికి. మొత్తం మీద తమ టముకు తామే వేసుకునే వీళ్ళు ఇతరులకు నష్టం చేయరు కాని తమకు లాభం చేసుకోలేరు. ఎవడి మీదన్నా కోపముంటే, తమకు పడకుంటే, లేదా అడ్డు వస్తున్నారనుకుంటే ముఖ్యంగా సినిమాల్లో ఇంకో వ్యక్తిని అరువు తీసుకుంటారు. వాళ్ళ బాక్సు బద్దలు కొట్టేస్తామని సదరు కిరాయివాళ్ళు డైలాగ్ చెప్పేస్తుంటారు. అది అలా పాకి పాకి బయటి ప్రపంచంలో కూడా ఈ ప్రయోగాలు పెరిగిపోయాయి. ఏదైనా డైలాగ్ బాగా ప్రజాదరణ పొందాలంటే దాన్ని సినిమాలో పెట్టాలి. అసలు సినిమా రీలు బాక్సుల్లో వచ్చేవి. అందుకే బాక్సాఫీసు అని సినిమాల గురించి చెప్పేటప్పుడు అంటుంటారు.
పాత సినిమాలు చూస్తే గల్లా పెట్టె కనిపిస్తుంది. అందులో డబ్బే డబ్బు. ప్రభుత్వాల దగ్గర కూడా గల్లా పెట్టెలుంటాయి. అవి ఖాళీ అవుతుంటాయి. అప్పుడు మళ్ళీ ప్రజలపైనే ఆ భారం. పన్నులు. వసూళ్ళు. మొత్తం సంవత్సరానికంతా పైసల లెక్కలు ఉండే బడ్జెట్ కూడా కొత్త పెట్టె సూటుకేసులో పెట్టుకొని వస్తారు కదా ఆర్ధిక మంత్రుల వాళ్ళు. అందులో అందరి జాతకాలూ ఉంటాయి. ఎవరిమీద ఎంత వడ్డించేది, ఎవరికి ఎంత వడ్డించేది మొదలైనవీ ఉంటాయి. ఎందరి ప్రాణాలో ఉంటాయి ఆ పెట్టెలో. అసలు ప్రజల గుండెలు కూడ పెట్టెలలాంటివే. వాటిలో స్థానం సంపాదించడం ముఖ్యం. ఆ ఒక్క పెట్టె సంపాదిస్తే మిగతా అన్ని పెట్టెలూ తమంతట తాము వచ్చి పడతాయని తెలుసుకున్నోళ్ళు బాగుపడుతున్నారు. ప్రజల జీవితాలను బాగు చేయడం ముఖ్యం. లేదంటే బాక్సులు బద్దలైపోతాయని ప్రజలే తమ నిర్ణయం ద్వారా పాఠం నేర్పుతారు.
బాక్సాఫీసు వద్ద విజయమెప్పుడూ మాదే అని ఎవ్వరూ అనుకోకూడదు. ఇప్పుడు ఆ బాక్సులు కొత్త రూపు సంతరించుకున్నాయి. చిన్న చిప్పులో పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయిప్పుడు. ఇల్లు అనే డబ్బాలో ఉండే సినిమాలు చూసేస్తున్న రోజులివి. టెక్నాలజీ ఎన్నో పాత బాక్సుల్ని బద్దలు చేస్తోంది. ప్రజలూ అంత వేగంగా మారిపోతున్నారు. అది తెలుసుకున్నోళ్ళదే విజయం. అది ఎవరి పెట్టెలో ఉందో ఎలా ఉందో మరి?
- జంధ్యాల రఘుబాబు
9849753298