Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షరం ఆమె ఆయుధం. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. చెదరని చిరునవ్వు ఆమె ఆభరణం. తెలుగు రచయిత్రులందరినీ అక్షరయాన్ పేరుతో ఏకం చేసిన ఘనత ఆమె సొంతం. రేడియో అనౌన్సర్‌గా అందరికీ సుపరిచితం. ఆమే అయినంపూడి శ్రీలక్ష్మి. ప్రస్తుతం తెలుగుయూనివర్సిటీ చిత్రవాణి విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తూ సాహిత్య, కళారంగాలకు విశేష కృషి చేస్తున్న ఆమె పరిచయం మానవి పాఠకులకు ప్రత్యేకం.
మీ బాల్యం విద్యాభ్యాసం?
నేను పుట్టింది బోధన్‌లో. నాన్నగారు అయినంపూడి శ్యాంసుదర్రావు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు. బాబాయి పిల్లలు ముగ్గురు, మేం ముగ్గురం, తాత, నానమ్మ ఇంట్లో గంపెడు మందిమి. నాన్న జీతం సరిపోయేది కాదు. పాలు, పెరుగు అమ్ముకుంటూ జీవనం కొనసాగించాం. మేం ముగ్గురం ప్రతి ఇంటికి వెళ్ళి పాలు, పెరుగు ఇచ్చి వచ్చే వాళ్ళం. పిడకలు కొట్టిన జ్ఞాపకాలు కూడా బోలెడు. మానాన్న సంస్కరణాభిలాషి. పాటలు బాగా రాసేవాడు. ఆ పాటలు నేను, తమ్ముడు బాగా పాడేవాళ్ళం. చిన్నప్పటి నుండి మైక్ పట్టుకున్న ఘటనలే ఎక్కువ.
రచనలపై ఆసక్తి ఎలా వచ్చింది?
నాన్న బాగా పుస్తకాలు తెచ్చేవారు. అమ్మ బాగా కథలు చెప్పేది. నాన్నని అందరూ మెచ్చుకుంటుంటే నాన్నే నా హీరో కాబట్టి నాన్నలా రాయాలని అనిపించి మొదలుపెట్టాను. అమ్మ వాటిని సరిచేసేది.
మిమ్మల్ని ప్రభావితం చేసినవారు?
వ్యక్తిగత జీవితంలో మా నానమ్మ నా రోల్ మోడల్. మేము పేదరికంలో ఉన్నా పెద్ద వాళ్ళు సైతం మా నాన్నమ్మ నిజాయితికి, నిక్కచ్చితనానికి భయపడే వారు. సాహిత్యంలో తిలక్, శ్రీశ్రీ, ఖలీల్ జిబ్రాన్లున్నారు. గురువు నాళేశ్వరం శంకరం, సైబపంధాములుగార్ల ఆశీస్సులు నా విజయానికి సోపానాలు.
ఆలిండియా రేడియోతో మీ అనుబంధం?
30 సంవత్సరాలు పని చేశాను. 16వ ఏట మొదటి కవిత చదివిన జ్ఞాపకం. ఆకాశవాణిలో నా కవితలు వస్తున్నామని తెల్సి నా ఫ్రెండ్స్‌తో పాటు చుట్టుపక్కల వారంతా వచ్చి మా అరుగు మీద కూర్చుని విని వెళ్ళేవారు. గొప్పగా చెప్పుకునేవారు. అది చాలా గర్వంగా వుండేది. కవితలు వస్తేనే ఇంత గొప్పగా చూస్తున్నారు రేడియోలో ఉద్యోగం చేస్తే ఎంత గొప్పగా వుంటుందోనని పట్టుబట్టి వ్యాఖ్యాతినయ్యాను. 1992లోనే 23 ఏండ్లకే ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను. గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూలు చేశాను. 'కొత్త ప్రేమ లేఖలు' రాసి వేలమంది అభిమానాన్ని పొందాను.
అక్షరయాన్ స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చింది?
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక సాహిత్యరంగంలో ఓ స్తబ్ధత వచ్చింది. ప్రతి కార్యక్రమానికి తెలంగాణ వాళ్ళా కాదా అని ఆలోచించి పిలవటం, ఎంతో మందిని దూరం పెట్టటం అప్పటి దాకా మిత్రులుగా వున్నవాళ్ళం పక్కకు తప్పుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి చూశాను. నాకది మనస్తాపం కల్గించింది. ముఖ్యంగా సభా కార్యక్రమాలకు వెళితే 100 మంది పురుషులు కన్పిస్తే 5,6 మంది మహిళలు కన్పిస్తున్నారు. అది కూడా పిలవాలి కాబట్టి పిల్చినట్టుగా ఉండేది. రచయితకి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వుండాలి. అందుకే 'అక్షరయాన్' ఆవిర్భవించింది. దేశంలో 1180 మంది మహిళా సాహిత్య వేత్తలున్న అతిపెద్ద యాక్టివ్ సంస్థ మాదే కావటం మా సభ్యుల కమిట్మెంట్కి నిదర్శనం. ఇప్పుడు మేం కార్యక్రమాలు పెడితే పురుషులొచ్చి మమ్మల్ని కూడా పిలవండి అని అడుగుతున్నారు.
అక్షరయాన్ ఇంత విజయవంతంగా నడవటానికి కారణం?
రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాదు మొత్తం 8 రాష్ట్రాల్లో వున్న తెలుగు వారు మా అక్షరయాన్లో వున్నారు. మాలో ఎక్కువగా 50 ఏండ్ల వయసు వారిమే. బాధ్యతలు అయిపోయిన వారిమి 70శాతం మంది ఉన్నాము. ఉద్యోగులు 60శాతం. కాబట్టి చెప్పింది అర్థం చేసుకుంటారు. ఏ అంశం మీదైనా ఒక పుస్తకాన్ని ఒక్క రోజులో రాసేస్తాం. తెలుగు టైపింగ్ చేయటం నేర్పించాం కాబట్టి ఏ రచన పంపించమన్నా టైప్ చేసి ప్రింటింగ్‌కి ఈజీగా పంపిస్తారు. అందరం అక్కచెల్లెల్లమే కాబట్టి కోపాలు తాపాలు వున్నా అప్పటికప్పుడే. మరో విషయం ఏమిటంటే పైసా కూడా ఎవర్నీ అడగకూడదని మా అక్షరయాన్ ప్రధమ సూత్రం. కాబట్టి డబ్బు దగ్గరొచ్చే గొడవలు వుండవు. రాజభవన్ బతుకమ్మ, షీ టీమ్ బుక్స్, సీడ్ బుక్స్ - 2 ఇలా ఎన్నో పుస్తకాలు వేయటం, అందరూ అసాధ్యం అనుకున్నవి చేసి చూపించటం వల్ల నా పట్ల అందరూ నమ్మకంగా వుంటారు. కొందర్ని మా గ్రూపు నుండి తొలగించాం కూడా. మోనార్క్‌గా వ్యవహరిస్తామని తిట్టుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.
రచయిత్రులను ప్రభావితం చేసినవి?
అన్ని కార్యక్రమాలు ప్రభావితం చేసినవే. పసిపిల్లలు, మహిళల మీద అత్యాచారాలు చూసి చూసీ వీరావేశంతో మహిళా భద్రతా విభాగం మీదకి యుద్ధంకి వెళ్ళాం. వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి 'అత్యాచార బాధితుల'ను పిలిపించి వారితోనే మాట్లాడించారు. సమాజ తప్పులు, కుటుంబం వైపు తప్పులు అర్థం అయ్యాక స్కూల్, కళాశాల పిల్లలకు అవగాహన, కౌన్సెలింగ్ నిర్వహించటానికి సమాయత్తమయ్యాం. అలాగే కల్తీలు కనిపెట్టగల్గిన అవగాహన రైతులకు కల్గితే రైతు ఆత్మహత్యలు వుండవని విత్తన అవగాహన సదస్సుకి వెళ్ళి రెండు పుస్తకాలు (కథలు, కవితలు) తెచ్చాం. విత్తన ధృవీకరణ వారు 312 మంది రచయిత్రులతో సదస్సు ఏర్పాటు చేశారు. మరో ముఖ్య విషయం రాజ్‌భవన్ చూడటం మాకొక కిక్ ఇచ్చింది. మహిళా దర్బార్‌లో పాల్గొన్నాం. కల్వకుంట్ల కవితతో బతుకమ్మ పుస్తకం చేశాం. మా వెబ్‌సైట్‌ని ఆవిష్కరింప చేసుకున్నాం. ఎంతో మంది ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహకారం చేశాం. అన్నిటికన్నా మిన్నగా ఒక పత్రికకి వారం వారం బతుకమ్మ అంశం మీద ఒక వ్యాసాన్ని అక్షరయాన్ అందిస్తుంది.
అక్షరయాన్ని ఎలా నిర్వచిస్తారు?
అ,ఆ లుగా చెప్తాను. 'అ' అంటే అవకాశాలు కల్పిస్తుంది. అనువైన వేదికలు చూపిస్తుంది. 'ఆ' అంటే ఆదరణ కల్గిస్తుంది. ఆదాయం రప్పిస్తుంది. ఆడవాళ్ళకు ఆత్మగౌరవం అందించటం, అత్మాభిమానం కల్గించే కార్యక్రమాలనే ఏర్పాటు చేయటం, వారు రాసిన వాటిని గుర్తించి, గౌరవించి పత్రికల్లో పడేలా తర్పీదు ఇవ్వటం చేస్తున్నాం. కాబట్టే మా అక్షరయాన్ని గౌరవిస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలైనా, ప్రైవేట్ సంస్థలయినా ఏ అంశం మీద రాయాల్సిన రచనలు వున్నా సరే మా అక్షరయాన్ను ముందుగా ఎంపిక చేసుకుంటున్నారు. 'ఆల్ ఇన్ ఒన్' గా మేం నిలబడ్డాం.
ఇన్ని కార్యక్రమాలు చేసే క్రమంలో సమస్యలేమైనా ఎదుర్కొన్నారా..?
పురుషాధిక్య సమాజంలో ఆడవాళ్ళకు అడుగడుగునా సమస్యలే. అందునా ఒక సంస్థని ఇంత విజయవంతంగా నడిపించటం మాటలు కాదు. మొదట్లో పట్టుచీరల బ్యాచ్ అని నిక్ నేమ్ పెట్టారు. తర్వాత కాలంలో అక్షరయాన్కి వున్న గుడ్విల్ని చూసి కొందరు డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు అందరికీ తెల్సు. ఎవరైనా అక్షరయాన్ పెరుతో డబ్బులు అడిగితే నాకే కాల్ వస్తుంది. వెంటనే నో చెప్తాను. అది బోగస్ అని తేలిపోయింది. ఇది సాహిత్య హబ్ కాబట్టి హైదరాబాద్‌కి ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికోసం 'రచయిత్రుల హాస్టల్' ఏర్పాటు చేయాలని అక్షరయాన్ ప్రయత్నిస్తుంది. అదే ప్రధాన సమస్యగా తీసుకుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పని చేస్తున్నామని పాలనా పార్టీకి పరిమితంగా ఆలోచించినవారూ వున్నారు.
విశ్వసాహితీ వాళ్ళతో పని చేసినట్టున్నారు. అదీ మీ సంస్థనా?
లేదమ్మా... మేము విశ్వసాహితి కార్యక్రమాలకు సపోర్ట్ చేశామే తప్ప మేం వాళ్ళకి కానీ వాళ్ళు మాకు కానీ అనుబంధ సంస్థలుగా లేము. అక్షరయాన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. మా విధి విధానాలు మాకున్నాయి. మేం సూక్ష్మ కావ్యాలు, సరళ శతకాలు బాగా ప్రమోట్ చేశాం. మా వాళ్ళు 200 సూక్ష్మ కావ్యాలు, 100 సరళశతకాలు రాశారు. కొన్ని పుస్తకాలు వాళ్ళు వేశారు. అంతే ఎవ్వరితో మాకు విరోధం లేదు. ఎవరితో మితృత్వం లేదు. అందరూ మాకు సహకారమే, సహసంస్థలే.
మీ భవిష్యత్‌లో కార్యక్రమాలు?
ఇప్పటి వరకు మా అక్షరయాన్ నుండి పసి మొలకలు - రుధిర జ్వాలలు, వజ్రోత్సవ భారతి కవితా సంపుటి మాత్రమే వచ్చాయి. ముందే చెప్పాం కదా. మేం పుస్తకాలు వేసినా డబ్బులు వసూలు చేయమని. కానీ పసిమొలకల పుస్తకం ఆడవాళ్ళ మీద జరిగే లైంగిక దాడులకు సంబంధించింది. దీని ముద్రణకు ఏ వ్యవస్థా, సంస్థ ముందుకు రాలేదు. మేమే డబ్బులు స్వయంగా పెట్టుకుని వేసుకున్నాం. ఇక మీదట కాస్తంత ఆర్థికంగా బలపడాలని నిర్ణయించుకున్నాం. పలు అంశాలు పరిశీలిస్తున్నాం. త్వరలో ఇతర దేశానికి వినోద పర్యటన ఒకటి, ఇతర రాష్ట్రానికి సాహితీ పర్యటన ఒకటి ప్లాన్ చేస్తున్నాం. పరమ వీర చక్ర అవార్డుల మీద కవితా సంపుటిని జనవరి 26న పెద్ద ఎత్తున ఆవిష్కరించనున్నాం. సంవత్సరం తర్వాత ఇప్పుడు బతుకమ్మ మీద వ్యాసాలను సేకరించి పుస్తకంగా తీసుకురానున్నాం.
అక్షరయాన్ జెండా, ఎజెండా ఏమిటి?
అక్షరయాన్ మహిళా ప్రభంజనం. మాకు రంగులన్నీ ఒకటే. అమ్మలం, అమ్మమ్మలం కదా. మాకు సమాజంలోని ప్రతి వ్యక్తి బిడ్డలాగానే కన్పిస్తాడు. ఏ పార్టీ జెండాలు మాకు లేవు. ఏ రాజకీయ వ్యవస్థ ఎజెండాలు మావి కావు. మేం స్వతంత్రులం. స్వేచ్ఛగా ఆలోచిస్తూనే మనిషి రేపటి అందమైన ప్రస్థానానికి బాటలు వేస్తున్నాం. కంటి రెటీనాకి ఎంత శక్తి వుంటుందో కవి కలానికి కూడా అంతే చూపు వుండాలంటుంది అక్షరయాన్. ఇది ఒక మహిళా ప్రభంజనం.
అక్షరయాన్ లక్ష్యం..?
మాతృభాష, మాతృమూర్తి, మాతృదేశం మా లక్ష్యం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేశాం. మాతృమూర్తులకు వందనం చెప్తూ వారిని జిల్లా వారిగా ఒక పెద్ద రచయిత్రిని ఆ జిల్లా వారే ఎంపిక చేసిన వారికి సత్కారం చేశాం. మాతృదేశం కోసం బాలల అభివృద్ధి, రచయిత్రుల ప్రగతి, వ్యవస్థల పుష్టికోసం పాటుపడ్తాం. పరమవీరచక్ర కవితలు, వజ్రోత్సవ భారతి సమ్మేళనాలు అలాంటివే. పంపకవి పురస్కారం, కుప్పాంబిక పురస్కారం, బండారు అచ్చమాంబ పురస్కారం, రంగాజమ్మ పురష్కారాలు ప్రతిసంవత్సరం మేమిస్తున్నాం. యువకులు, పిల్లల్ని అవార్డులతో ప్రత్సోహిస్తున్నాం. ఇక ముందు కూడా చేస్తాం.
- సలీమ