Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''చెరపకురా..చెడేవు'' అనే సామెత.. ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. కాంగ్రెస్‌ను చెడగొట్టి లబ్ధిబొందాలని చూసిన ఆయనకు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఓ గుణపాఠం నేర్పింది. ఉప ఎన్నికకు దారి తీసిన పరిస్థితులు, ఆ తరువాత పరిణామాలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు ఇలా అనేక పరిణామాల తరువాత వచ్చిన ఫలితం రాజగోపాల్ రెడ్డికి చెంపపెట్టులానే భావించాల్సి వస్తుంది. ఒక దశలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగ ప్రకటన చేసిన ఆయన... ఇప్పుడు రాజకీయాలకు గుడ్‌బై చెబుతారా? లేక బీజేపీలోనే కొనసాగుతారా అనేది స్ఫష్టం చేయాల్సివుంది.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి కూడా ఒక గుణపాఠంగా చెప్పవచ్చు. ఓటు బ్యాంకు భారీగా పెరిగిందని మేకపోతు గాంభీర్యం ప్రకటిం చినా, అమిత్‌షా పాచికలు తెలం గాణలో పారలేదనే స్ఫష్టమైంది. అనేక ఎత్తులు వేసినప్పటికీ ఫలించలేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా 18వేల కోట్ల కాంట్రాక్టు కోసమేననేది ప్రజల్లో నాటుక పోవడమే కాదు, రాష్ట్ర అస్థిరతకు దారి తీసేందుకు అడుగులు వేశారనేది టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోళ్ల పరిణామాలు స్పష్టం చేశాయి. సంవత్సరంన్నర కాలంలో సాధారణ ఎన్నికలుండగా ఉప ఎన్నికకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ? కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో బీజేపీకి సపోర్ట్‌గా మాట్లాడంతో పాటు, గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పోడవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారు.
ఒకవైపు ఉప ఎన్నిక, మరోవైపు టీఆర్ఎస్ నలు గురు ఎమ్మెల్యేలకు ఎర అంశం దేశ రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. ఒక్కో ఎమ్మెల్యేను వంద కోట్లతో కొనుగోలు చేసే ప్రలోభాల అంశం, ఇందులో బీజేపీ పెద్దలు న్నారని ప్రచారం జరగడం, ఇందుకు సంబంధించి తొలుత ఆడియో టేపులు బయటకు రావడం రాష్ట్ర ప్రజలను కలవర పర్చింది. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తీవ్ర నష్టం కలిగించిందని చెప్పవచ్చు. ఆయన రాజీనామా వెనుక మునుగోడు ఉప ఎన్నికే కాదు రాష్ట్ర అస్థిరతకు దారి తీసేలా బీజేపీ కుట్ర దాగిందని ప్రజల్లో విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర పెద్దలు నిజాయితీని నిరూపించుకోలేక పోయారనేది స్ఫష్టమైంది. కేంద్ర హోం మంత్రి, ప్రధానిపైనా అరోపణలు వచ్చిన నేపథ్యంలో... వారి నుండి నేరుగా స్పందన రాకపోవడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ పరిణామాలు రాష్ట్రంలో బీజేపీ మనుగడను దెబ్బతీసేలా ఉన్నాయి. ఇప్పటికీ ఆ పార్టీకి రాష్ట్రంలోని ఆయా నియోజక వర్గాల్లో సరైన అభ్యర్థులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను చేర్చుకుని, వచ్చే సాధారణ ఎన్నికల్లో నిలబెట్టి అధికారంలోకి రావాలన్న ఆశలకు ప్రస్తుత పరిణామాలు గండి కొట్టాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్లేందుకు బహుశా ఎవరూ సాహించరనే చెప్పవచ్చు. వీటి ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికల్లో చూపే అవకాశాలు లేక పోలేదు.
మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఎంపీ కోమటిరెట్డి వెంకట్ రెడ్డి ప్రస్తుత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందనే చెప్పవచ్చు. గత సంవత్సర కాలంగా ఆయన తీరు ఆ పార్టీ అదిష్టానంలో అనేక అనుమానాలకు తావివ్వగా, ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో లీకైన ఆడియో, ఆస్ట్రేలియాలో చేసిన వ్యాఖ్యలు దానిని స్పష్టం చేశాయి. దీంతో రానున్న కాలంలో వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్‌లో భవిష్యత్ ఉండదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డీలా పడ్డ బీజేపీలోకీ వెళ్లలేక, కాంగ్రెస్‌లో ఉండలేక రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు లేక పోలేదు.
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వామపక్ష భావాజాలానికి పెట్టింది పేరు. ఇక్కడ బీజేపీకి స్థానం లేదనేది మరోసారి నిరూపించారు మునుగోడు ఓటర్లు. బీజేపీకి వచ్చిన ఓట్లలో ప్రలోభాలు, కోమటిరెడ్డిపై ఉన్న వ్యక్తిగత పలుకుబడితో వచ్చినవి మాత్రమేననేది ఉప ఎన్నిక ఫలితం స్ఫష్టం చేసింది. వామపక్ష సీపీఎం, సీపీఐ రెండు పార్టీల క్యాడర్ బలంగా ఉన్న మండలాల్లో ఓటర్లు ప్రభావం చూపారు. విధానాల పరంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకమైనప్పటికీ, ఈ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిచ్చారు. ఓటరు తీర్పుతో వామపక్ష భావజాలం ఎటూ డైవర్ట్ కాలేదనేది స్పష్టమైంది. వామపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయంతో రానున్న రోజుల్లో కొన్ని ప్రయోజనాలు నెరవేరే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగ, కార్మికులు... రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే మార్గానికి ఈ ఉప ఎన్నిక ఫలితం దిక్చూచిగా నిలుస్తుందని పలువురు ఆశిస్తున్నారు.
- చిలగాని జనార్థన్
8121938106