Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన సమయంలో ఎక్కువ భాగాన్ని సినిమాలు, క్రికెట్ తదితర అంశాలపై చర్చించడానికి కేటాయిస్తున్నాం. ప్రజలలో ఈ విషయాలకు ఉన్న ఆదరణని దృష్టిలో పెట్టుకొని ప్రసార మాధ్యమాలు వివిధ కార్యక్రమాల్ని రూపొందిస్తున్నాయి. రేటింగ్ కోసం వాడి వేడి చర్చలు పెట్టడం, ప్రజల భావోద్వేగాలని రెచ్చగొట్టడం, పదే పదే ప్రసారం చేయడం, వీటికి నాటకీయతని జోడించడం వంటి కార్యక్రమాలని అవి చేపడతాయి. ఫలితంగా ప్రజల దృష్టి అంతా వీటిపైనే వృధా అవుతోంది. దీని వెనుక కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు ఉంటాయి.
మన దేశంలో యువతీ యువకులలో అత్యధికమంది క్రికెట్‌ను ఒక మతంగా చూస్తున్నారు. క్రికెట్ ఆటగాళ్లని దేవుళ్ళుగా ఆరాధిస్తారు. ముఖ్యంగా పాకిస్థాన్, ఇండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లను ప్రత్యేకంగా చూస్తారు. జయాపజయాలను క్రీడాభిమా నులు వ్యక్తిగతంగా తీసుకుంటారు. పందేల రూపంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఒక్కోసారి ఓడి పోయిన జట్టుకు చెందిన క్రీడాకారులపై దాడులు కూడా జరుగుతుంటాయి. దేశంలో ఏ ఇతర సమస్యలు లేనట్లు మీడియా కూడా వీటిపైనే ఎక్కువగా చర్చలు పెడుతుంటుంది. ఇటీవల ఐసిసి చేపట్టిన సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటను చూసేవారిలో భారత ఉపఖండం నుంచే 90శాతం మంది ప్రేక్షకులు టీవీ ద్వారా చూస్తారని తేలింది.
ఏదైనా పండుగ లేదా సెలవు వచ్చిందంటే ప్రేక్షకులకు ఆకట్టుకోవడానికి వివిధ టీవీ ఛానెళ్లు పలు రకాల కార్యక్రమాలని రూపొందిస్తాయి. వీక్షకుల యొక్క భావోద్వేగాలని రెచ్చగొడుతుంటాయి. టీవీల్లో నిరంతరం అనేక ఆశాస్త్రీయ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు వీటికి సామాజిక మాధ్యమాలు కూడా తోడయ్యాయి. తద్వారా ప్రజల్లో రోజురోజుకూ మూఢ నమ్మకాలు పెరుగుతున్నాయి. వీరిని లక్ష్యంగా చేసుకొని బడా కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. ప్రజల ఆలోచనలను నిర్వీర్యం చేస్తున్నాయి. దీనిని నుండి మేల్కోనట్లయితే అమూల్యమైన సమయం, శక్తి సామర్ధ్యాలు వృధాగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
- యం.రాం ప్రదీప్, సెల్:9492712836