Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్నఫళంగా, రాత్రికి రాత్రి 7,500 మంది దాకా ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు అనేక పాఠాలు నేర్పుతున్నది. ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాలకు కనీస గ్యారెంటీ ఉండదనేది వాస్తవమే అయినప్పటికీ, ఇంత మితిమీరిన స్థాయిలో అకస్మాత్తుగా ఉద్యోగులను తొలగించే వెసులుబాటు అట్టి సంస్థలకు ఉండటం ఎంత ప్రమాదకరమో కూడా ఈ ఉదంతం తెలియ జేస్తోంది. ఈ ఉదంతంలో ఉద్యోగుల భవితవ్యం గురించిన సమస్యకన్నా సదరు గుత్త సంస్థల ఏకపక్ష నిర్ణయాలు భయపెట్టేలా ఉన్నాయి. ఇలాంటి తొలగింపులో తొలగించ బడిన ఉద్యోగులకు జరిగే నష్టాన్ని మాత్రమే చూడకూడదు. దాని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటుందన్న దృక్కోణం లో ఆలోచించాలి. ఇలాంటి నియామకా లకు, తొలగింపులకు అవకాశం ఇస్తున్న చట్టాల పునః సమీక్షపై దృష్టి పెట్టాలి. లాభాపేక్ష కోసం వెంపర్లాడుతూ ఉద్యోగుల భవిష్యతు ్తపై ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరించే సంస్థల పనితీరులపై సమీక్షలు జరగాలి. వీటన్నిటికీ మార్గదర్శకాలు జారీచేసే వివిధ దేశాల, ప్రభుత్వాల విధానాలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ఎందుకంటే ప్రపంచీకరణ తర్వాత నైపుణ్యం గల వాళ్లకి అనేక అవకాశాలు తమ దేశమూ, ప్రదేశమూ కాని చోటే దొరుకుతున్నాయి. కానీ అంతకుమించిన స్థాయిలో ఆ ఉద్యోగులకు, వారి ఉపాధికి అనిశ్చితి కూడా చాలా ఎక్కువగానే ఉన్నది. ఇలాంటి వాటిపై కూడా సమగ్రమైన పునరాలోచన జరగాలి.
ఎలాన్ మస్క్ అనబడే ప్రపంచ కుబేరుడు ట్విట్టర్ సంస్థను ఈ అక్టోబర్ 27, 2022న తన హస్తగతం చేసుకున్నాడు. ఆ తరువాత అత్యంత తక్కువ సమయంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడటం కార్పొరేట్ల యొక్క దుర్నీతికి నిదర్శనం. ట్విట్టర్ అనబడేది ఒక సమాచార ఎక్స్చేంజ్ (బదలాయింపు) కు ఉపయోగపడే ఆన్లైన్ మాధ్యమం. అలాంటిది, నేడు ప్రభుత్వాలను శాసించే దశకు చేరుకున్నది. ట్విట్టర్గాని, ఫేస్బుక్ గాని, వాట్సాప్ గాని లేదా ఇంస్టాగ్రామ్ తో పాటు అనేక ఆన్లైన్ ప్లాట్పామ్లన్ని ప్రజల మధ్య దూరాన్ని తగ్గిస్తూ సమాచార బదలయింపు లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీటివల్ల ఉత్పాదకతకు పరోక్ష సహకారం అందిందని కూడా చెప్పవచ్చు. అదే సమయంలో వీటివల్ల జరుగుతున్న నష్టాలు కూడా తక్కువేమీ కాదని గుర్తించాలి. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి మాధ్యమాలు రాజకీయ దూషణలకు, ప్రతి దూషణలకు వేదికలుగా మారి సామాజిక, రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నా యనడంలో సందేహం లేదు. దీనిపై నియంత్రణ ఎవరు పెట్టాలి? ఈ సంస్థలన్నీ తమ సంపాదనకై ప్రోత్సహిస్తున్న అపరిమిత అడ్వటైజ్ మెంట్ల విషయంలో గానీ, ఇతర కంటెంట్ల విషయంలో గానీ, వాటి ద్వారా జరుగుతున్న నష్టం గురించి సరైన నియంత్రణ అన్ని దేశాల ప్రభుత్వాలు గాలికి వదిలేసినట్లే ఉన్నది.
ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగానికి కూడా సరిసమానంగా అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళ్లే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నేడు కొనసాగుతున్నది. కానీ ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగానికి స్వస్తి పలికే విధంగా ప్రయివేట్ రంగాన్ని మితిమీరి ప్రోత్సహించడం జరుగు తున్నది. ఈ ప్రయివేట్ రంగంలో పోటీతత్వంతో మెరుగైన సేవలు, తక్కువ ఖర్చుకే వినియోగ దారులకు లభిస్తాయని భావించారు. కానీ, ప్రయివేటు రంగంలో గుత్తాధిపత్యం ఎక్కువై ఏకస్వామ్యం (మోనోపొలి) దిశగా పయనిస్తోంది. అనేక దేశాల్లో ప్రభుత్వం రంగాన్ని కుదించి ప్రయివేటు రంగానికి అవకాశాలు కల్పించడం ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించారు. మొదట్లో అవకాశాన్ని అందిపుచ్చుకుని, ప్రయివేటు రంగంలో అనేక కంపెనీలు వెలసినప్పటికీ, క్రమేపీ ఆంగ బలం, ఆర్థిక బలం, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం కలిగిన బడా కార్పొరేట్ సంస్థలు మిగతా చిన్నా చితక కంపెనీలను తమ ఆధిపత్యపు (ప్రిడేటరీ) విధానాలతో హస్తగతం చేసుకొని వాటికవే మార్కెట్లో ఏకస్వామ్య సంస్థలుగా రూపుదిద్దు కుంటున్నాయి. ఆ తర్వాత తమ ఇష్టారీతిన ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం లేదా తమ వ్యాపార వ్యవహారాలను నిలిపివేసి సమాజానికి, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం అనుభవంలో చూస్తూనే ఉన్నాం. భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ పెరిగి పెద్దదై దేశ పరిపాలనని హస్తగతం చేసుకుని రెండొందల సంవత్సరాలు వలస పాలన సాగించిన తీరు నుండి, నేడు మరో గుత్త పెట్టుబడిదారి సంస్థగా ఎదగనున్న రిలయన్స్ వరకు అనేక ఉదాహరణలు మన ముందున్నాయి. టెలికమ్ రంగంలో పన్నెండు ఆపరేటింగ్ కంపనీలు నేడు నాలుగుకు పడిపోయాయి. 2016లో అడుగుపెట్టిన రిలయన్స్ జియో కంపెనీ అతి త్వరలో ఏకస్వామ్య సంస్థగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే రేట్లు పెంచిన జియో, రానున్న రోజుల్లో తన వ్యాపారాలను స్తభింపజేసి ప్రభుత్వాన్ని ప్రజలను శాసించే ప్రమాదం లేకపోలేదు. 1970ల్లో బంగ్లాదేశ్-పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా ఆయిల్ మేజర్లుగా పిలువబడే విదేశీ సంస్థలు భారత వైమానిక దళానికి పెట్రోల్ నిరాకరించిన ఉదాహరణలు మనకు తెలుసు. ఒక చిన్న చిన్న వస్తువులను సరఫరా చేసేందుకు ఆవిర్భవించిన అమేజాన్, చిన్న చితకా వ్యాపారాలన్నిటినీ నేలమట్టం చేసింది. అమేజాన్ ఈ రోజు తన సర్వీసులను ఓ గంట సేపు నిలిపి వేస్తే ప్రపంచం తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది. అదే రకంగా ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ సర్వ్సులన్నీ కూడా..! అందువల్ల మితిమీరిన గుత్తాధిపత్యాన్ని కంపెనీలకు కట్టబెట్టడంపై పునరాలోచన జరగాలి.
ఈ ట్విట్టర్ ఉదంతం నేడు ప్రభుత్వ రంగాల ప్రాధాన్యతను, కార్మిక చట్టాల ఆవశ్యకతను, ప్రభుత్వ, న్యాయ వ్యవస్థల జోక్యతను మరోసారి ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది. వ్యాపార వ్యవహారాలపై నియంత్రణ ఉండడం వలన అభివృద్ధి కాస్త మందగించవచ్చు, ప్రయివేటు పెట్టుబడిదారులకు లాభాలు కాస్త తగ్గవచ్చు. కానీ నియంత్రణలు సరిగ్గా అమలు చేయడం వలన విచ్చలవిడితనం తగ్గి సమగ్ర, దీర్ఘ కాలిక అభివృద్ధికీ, ఎక్కువమందికి న్యాయం జరిగేందుకూ అవకాశం ఉంటుంది. ప్రయివేటు వ్యాపార వ్యవహారాలకు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కొంతమందికి మితిమీరిన లాభం జరిగి ఎక్కువమందికి నష్టం జరుగు తుందనేది జగమెరిగిన సూత్రం, నేడు కండ్లముందరి సత్యం. అయితే డబ్బు రాజకీయా లను ప్రభావితం చేస్తున్నప్పుడు, అట్టి డబ్బు కార్పొరేట్ల నుండే సమకూరుతున్నప్పుడు రాజకీయాలన్నీ కాక్పొరేట్ల కనుసన్నల్లో నడుస్తాయి. పర్యావసానంగా సమాజంపై అకస్మాత్తుగా దుశ్ప్రభావాలు పడతాయి. అందువలన ప్రతీ రంగంలోనూ ప్రత్యామ్నాయ ప్రభుత్వ రంగం ఉంటేనే దీనికి విరుగుడు.
- జి. తిరుపతయ్య
9951300016