Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ... అమ్మ.
ఆ... ఆవు.
- ఏమిట్రా ఎప్పుడూ తెలుగేనా... ఇంగ్లీషు చదివి ఏడువు.
ఎ... ఫర్ యాపిల్
బి... ఫర్ బ్యాట్
- నోర్మురు. ఎ ఫర్ ఆదివాసి. చదువు గట్టిగా చదువు అడ్డగాడిదా...
- అయ్యో... అయ్యో... అయ్యో.. పిల్లవాడ్ని అలా గుడ్లురుముతూ తిడితే జడుసుకోడూ.
- నువ్వూ నోర్మురు. నీ కొడుకూ నీవూ కూపస్త మండూవాల్లా అలానే తగలడండి. ప్రధాని మోడీగారి నూతన భాష్యాన్ని అర్థం చేసుకోపోతే ఎవడేం చేస్తాడు?
- ఏమన్నారేమిటండీ?
- 'నాకు ఎ అంటే ఆదివాసీలు. వారి ఆశీస్సులతోనే గుజరాత్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను' అన్నారు. విన్లేదూ...
- ఎలా వింటాను. అదేదో గుజరాతీలో అక్కడ మాట్లాడారు. ఇక్కడ మన తెలెగువారికి ఎలా తెలుస్తుందండీ.
- అందుకే ఒకే దేశం. ఒకే జాతి. ఒకే భాష అని మొత్తుకు చస్తున్నా ఎవరూ అర్థం చేసుకోరు..?
- బాగానే ఉంది సంబడం. అది గజరాతీ. ఇది తెలుగు. ఎక్కడివాళ్ళు అక్కడి భాష మాట్లాడతారు. అది చదువుకుంటారు. ముందు ఇది అర్థం చేసుకోండి చాలు. ఇంకేం సెలవిచ్చారేమిటి?
- ఇప్పుడు నాకు నచ్చావ్ సుమీ. అలా అడుగుతుంటే ఎన్నైనా చెప్పబుద్దేస్తుంది. గతంలో డాక్టర్లు కోసం అడవుల్లో వెతుక్కోవలసి వచ్చేది. ఇక ఇప్పుడు అక్కడే ఆస్పత్రులు డాక్టర్లు అట.
- అమ్యో రామ! అలా చెపితే ఇలా నమ్మేయడమేనాండీ! ఆదివాసులు కూడా మనలాంటి మనుషులే కదండి. మనకు లభించే కనీస వసతులు. విద్యా వైద్య సదుపాయాలూ వారికి కూడా దక్కాలి కదండీ. స్వాతంత్య్రం వచ్చి ముప్పాతిక ఏళ్ళయినా వారింకా అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదు? ఆకలి, కరవు, విషజ్వరాలు, అరకొర చదువులు ఇప్పటికీ వారిని పీడిస్తున్నాయి కదండీ. వారలా దూరంగా ఉండిపోవడంలో ఏలేవారి పాపం లేదా?
- ఉందనుకో. అందుకేగా మోడీగారు శ్రీకారం చుడుతున్నారు.
- మీమతి మండా. ఇరవయేండ్ల క్రితమే మోడీగారు గుజరాత్ ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రధాని అయి ఎనిమిదేండ్లు. నాకు ఎ అంటే ఆదివాసులు అనుకున్నప్పుడు ఈ మంచి పనులు అప్పుడే మొదలు పెట్టొచ్చుగా.
- అవును. నిజమే. మరిప్పుడు ఎందుకు అంటున్నారు.
- దీన్నే నటన అంటారు. మళ్ళీ గుజరాత్‌కు ఎన్నికలు వస్తున్నాయి కనుక మొదలెట్టారు భాగోతం.
- గుజరాత్‌ను తానే తయారుచేసానని మోడీగారు చెప్తే ప్రజలూ అలానే అన్నారు తెలుసా..?
- అది కూడా పచ్చి అబద్దం. తయారు చేయడానికి అవేమన్నా పిడకలా..! పిడకలు తయారుచేయ డానికైనా పేడతేవాలి. తేలిగ్గా మండేలా ఎండుగడ్డి, ఊకా కలపాలి. గొడకు కొట్టి ఎండబెట్టాలి. ప్రతి తయారీ పనిలో బుద్ది, శ్రమ, నైపుణ్యం ఉంటాయి. ప్రజలందరూ చేస్తేనే అభి వృద్ధి. అంతేగానీ మీ ఒక్క మోడీ వల్ల ఏదీ తయారు కాదు. పైగా 'గుజరాత్‌ను నేనే తయారు చేసా' అని ప్రజల చేత అనిపించడం సిగ్గుగా లేదూ..?
- ప్రధానిని పట్టుకుని అలా మాట్లాడతావేంటి. కొంచెం సౌమ్యంగా మాట్లాడవచ్చుగా.
- ఆయనైతే నాటకాలు వేయోచ్చా? నేమో సరిగ్గా మాట్లాడకూడదా? భలేగా ఉందండీ.
- ప్రధానివి నాటకాలు అంటావేంటి? నీ దగ్గర ఆధారాలు ఏమిటి?
- ఆదివాసుల గురించే చెపుతాను. అడవుల నుండి ఆదివాసులను వెళ్ళగొట్టేలా, అక్కడి నిధి నిక్షేపాల కోసం కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కై అనుమతులు ఇస్తున్నారా లేదా? అటవీ హక్కుల చట్టానికి విరుద్ధంగా కార్పొరేట్లతో కలసి అడవుల పెంపకం పేర మోసపూరిత పథకాలు రచిస్తున్నారా లేదా? ఆ అమాయకపు మూగ ప్రజలను ఫారెస్టు వారు, రెవెన్యూవారు, పోలీసు వారు, సరిహద్దు సైన్యం నానా ఇబ్బందులు, చిత్రహింసలు పెడుతున్నారా లేదా? ఇవన్నీ మానవత్వం కలిగిన పాలకులు చేయాల్సిన పనులేనా? ఎక్కడికక్కడ ఈ దుర్మార్గపు పనులన్నీ చేస్తూ పైకి మాత్రం నంగనాచిలా నాకు ఎ అంటే ఆదివాసులు అనంటే నేను ఒప్పుకుంటానా ఏంటి?
- ఆ... ఆ... చూస్తుండగానే అలా కోపంగా భద్రకాళివైపోతున్నావేంటి?
- అయిపోను మరి, దొంగనాటకాలు ఆడుతుంటే... ఎవరైనా ఎంతకాలం సహిస్తారు. మనందరం ఆ ఆదివాసుల మూలాల నుండి వచ్చామనే కనీస ఇంగితజ్ఞానం, కృతజ్ఞతాభావం లేకపోతే ఎలా? మనషన్నాక..! అర్థమయిందా..?
- అర్థమయిందమ్మా. శాంతించు. శాంతించు. నువ్ చదువుకోనాన్నా...
- కె. శాంతారావు
9959745723