Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అమ్మో! ధరలు చాలా పెరుగుతున్నాయి. 10ఏండ్ల క్రితం ఒక లీటరు సన్ ఫ్లవర్ నూనె ధర రూ.45లుంటే, ఇప్పుడు ఒక లీటరు ధర రూ.90లకు పెరిగింది''. ''అవును.. నిజమే! కిలో కందిపప్పు ధర ఆనాడు రూ.25లుండేది. కానీ ఇప్పుడు రూ.75లకు పెరిగింది''. 2002 నుండి 2012 వరకు పదేండ్ల కాలంలో నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెరిగాయో... ఇద్దరు సాధారణ గృహిణులు చర్చించుకుంటున్న సంభాషణ ఇది.... గుణాకార ప్రక్రియ పరిచయం కోసం 5వ తరగతి గణిత పుస్తకంలో ప్రచురించబడిన పాఠ్యాంశంలోని ఒక భాగం. ఒక్కొక్క వస్తువు ధర 2002 సంవత్సరంలో ఎంత ఉండేది? 2012 నాటికి వాటి ధర ఎంత పెరిగింది? ఎన్ని రెట్లు పెరిగింది? అనే అంశం ఈ పాఠంలో పట్టిక రూపంలో ఇవ్వబడింది. పాఠ్యపుస్తకాలలోని పాఠాలు చాలాకాలం నుండి కొనసాగుతున్నాయి. కాబట్టి అందులో 2002 నుండి 2012 నాటి ధరల గురించి ప్రస్తావించబడింది. అయితే 2002, 2012 మధ్యకాలంలోని ధరలను పరిశీలిస్తూ... ప్రస్తుత ధరలను బేరీజు వేసుకుంటే బుర్ర గిర్రున తిరిగిపోతుంది. ఎందుకంటే... 2002 సంవత్సరంతో పోల్చితే 2012 నాటికి సరుకుల ధరలు దాదాపు రెట్టింపునకు పెరిగాయి. కానీ 2022 నాటికి (నేటికి) ఈ ధరలను విశ్లేషిస్తే రెండింతలు, మూడింతలు కాదు, నాలుగింతలకు పైగా పెరిగాయి. ఉదాహరణకు వంట గ్యాస్ బండ ధర 2002లో రూ.181 ఉంటే, 2012లో అది రూ.384కు పెరిరింది. కానీ 2012 నుండి 2022 నాటికి గ్యాసు బండ ధర అమాంతంగా రూ.1150కి చేరింది. అంటే, గత పదేండ్లతో పోలిస్తే ఈ పదేండ్లలో ఇది దాదాపు మూడు రెట్లు, 2002తో పోలిస్తే దాదాపు 6 రెట్లు పెరిగింది. ఈ అంశంపై విశ్లేషణ చేస్తున్నప్పుడు విద్యార్థులు కూడా విస్తుపోవడం, ఆశ్చర్యం వ్యక్తం చేయడం కొసమెరుపు. అసలు సరుకుల ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఏమిటి?
'ఏ సరుకైనా ఎక్కువగా ఉత్పత్తి జరిగి, డిమాండ్ మేరకు మార్కెట్లో అందుబాటులో ఉంటే ధరలు నియంత్రణలో ఉంటాయనీ, సరుకు తగినంత ఉత్పత్తి జరగక కొరత ఏర్పడితే ధరలు పెరుగుతాయనేది' ఒక సాధారణమైన నియమం. అయితే ఇదంతా గతం..! నేడది చెల్లుబాటు కాని సూత్రంగా మారిపోయింది. సామాన్యులకు అంతుబట్టని మర్మాలు, దుర్మార్గమైన వ్యాపార సూత్రాలు, పాలకుల సంకుచిత విధానాలే ధరల పెరుగుదలకు కారణాలుగా మారుతున్నాయి. డిమాండ్ కన్నా అధికంగా ఉత్పత్తి అయిన సరుకులను నిలువ చేసుకునేందుకు అవసరమైన శీతల గిడ్డంగులు, గోడౌన్లు ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో ఉండటం ధరల పెరుగుదలకు ఒక కారణం. ఆయా సీజన్లలో అధికంగా ఉత్పత్తి అయిన సరుకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి, తమ ప్రయివేటు గోడౌన్లలో, శీతల గిడ్డంగుల్లో నిలువ చేసుకుంటారు. ఆ సరుకులు ప్రజలకు అందుబాటులోలేని సీజన్లో తమ గోడౌన్ల నుండి మార్కెట్లోకి విడుదల చేయకుండా కృత్రిమ కొరత సృష్టిస్తారు. మార్కెట్లో సరుకుల కొరత వల్ల డిమాండ్ పెరిగి, ధరలకు రెక్కలొస్తాయి. తాము కొనుగోలు చేసిన సరుకులను చాలా కాలం పాటు నిల్వచేయగల సామర్థ్యం, వనరులు, అవకాశాలు కలిగిన బడా కార్పొరేట్ వ్యాపారులు... సీజన్లో కూడా సరుకుల కొరతను సృష్టించగలుగుతారు. సీజన్ ముగిశాక ఆ సరుకులను మార్కెట్లోకి విడుదల చేసి అందుబాటులోకి తేగలుగుతారు. ఆ రకంగా సీజన్లో కృత్రిమ కొరతను సృష్టించడం ద్వారా, అన్ సీజన్లో కూడా సరుకుల సరఫరా ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తారు, ధరల పెరుగుదలకు కారణం అవుతారు. అయినప్పటికీ ఈ బడా కార్పొరేట్ వ్యాపారులను నియంత్రించాల్సిన ప్రభుత్వాలు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా, వారికే సహకరిస్తుంటాయి. కాశ్మీర్లో మొన్నామధ్య ఏర్పడిన అప్రకటిత, ఉద్దేశపూర్వక ట్రాఫిక్ జామ్... వందలాది ఆపిల్ రైతులకు అన్యాయం చేసి, బడా కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే చర్యలో అంతర్భాగమే. నిత్యావసర సరుకుల జాబితాను క్రమంగా కుదిస్తూ, ఆయా ధరల పెరుగుదలకు ఆస్కారమిచ్చే చర్య మరో కారణం. ఉల్లిగడ్డ వంటి సరుకులను నిత్యావసరాల జాబితా నుండి తొలగించే కుతంత్రాలకు పూనుకోవడం ఇందుకో ఉదాహరణ. ఒక సరుకును నిత్యావసరాల జాబితానుండి తొలగిస్తే దానిని నిల్వలపై ఏ నియంత్రణలకూ అవకాశమూ ఉండదు. దాని ధర నియంత్రణ కూడా అప్రధానమవుతుంది. నిరుపేదలు, సాధారణ ప్రజలు సైతం అనునిత్యం తమ ఆహారంలో భాగంగా వినియోగించే ఉల్లిగడ్డను కూడా వారి నోటినుండి లాగేసే ఈ చర్యలు ఎవరి మేలు కోసమో? ఆలోచించాలి మరి.
అతి ప్రాధాన్యత కలిగిన సరుకుల ధరల నిర్ణయం, నియంత్రణ వంటి బాధ్యతల నుండి ప్రభుత్వాలు క్రమంగా వైదొలగడం, వాటిని పూర్తిగా కార్పొరేట్ కనుసన్నల్లో నిర్ణయించబడేట్లుగా విధానాలు రూపాంతరం చెందించడం ధరల పెరుగుదలకు ఇంకో కారణం. ఉదాహరణకు పెట్రోల్ ఉత్పత్తుల ధరల నిర్ణయం, నియంత్రణ గతంలో ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతనే ధరల పెరుగుదలకు ఆస్కారం ఉండేది. కానీ ప్రస్తుతం పెట్రోలు ఉత్పత్తుల ధరల నిర్ణయం పూర్తిగా కార్పొరేట్ శక్తుల పరిధిలోకి వెళ్లిపోయింది. ముడిచమురు ధరలు పెరిగినప్పుడేగాక, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం వంటి రకరకాల కారణాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం పరిపాటిగా మారింది. దీంతో ఒకవైపు పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిపోతూ ఉంటే, మరోవైపు దాని ప్రభావం పడి సరుకు రవాణా, ప్రజా రవాణా, మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించకపోవడం మరో విచిత్రకర విషయం. కార్పొరేట్ సంస్థలు చేసే ఈ వికృత చేష్టలను చూస్తూ ప్రేక్షక పాత్ర వహించే స్థాయికి ప్రభుత్వాలు దిగజారడం మరింత దారుణమైన విషయం. ఇక పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నుల వల్ల సామాన్యులపై మరింత భారం పడుతున్నది. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం పన్నులు విధిస్తుండగా, వాటి విక్రయాలపై రాష్ట్రాలు పన్నులు విధిస్తున్నాయి. 2021 లెక్కల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పెట్రోల్‌పై 54శాతం, డీజిల్‌పై 49శాతం పన్నుల రూపంలో దండుకుంటున్నాయి. ప్రభుత్వ మార్కెటింగ్ కంపెనీల స్థానంలో కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పించడం వల్ల, లాభాపేక్ష పెరిగి ప్రజల ప్రయోజనాలు గాలికొదిలేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. నిత్యావసరాల ధరలపై ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలను క్రమంగా ఎత్తేయడం ధరల పెరుగుదలకు మరో కారణం. ధరలు తగ్గించాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు... దానికి బదులుగా సబ్సిడీలను తగ్గించి, ప్రజలకు ప్రయోజనం కల్పించే బదులు భారాన్ని మోపుతున్నాయి.
నిత్యావసర సరుకుల క్రయ, విక్రయాలలో నేడు దళారి వ్యవస్థ వేళ్ళూనికుని వికటాట్టహాసం చేస్తున్నది. దళారీ వ్యవస్థ విస్తరించడం వల్ల ఉత్పత్తిదారులు, శ్రామికులకు దక్కాల్సిన శ్రమ ఫలితాలను వారు పొందలేకపోతున్నారు. వారి లాభాలను దళారులు ఎగరేసుకుపోతున్నారు. ప్రజల నుండి ఉత్పత్తి అయిన సరుకులను నేరుగా కొనుగోలు చేసే 'ప్రభుత్వ రంగ కొనుగోలు వ్యవస్థ'లు క్రమంగా నిర్వీర్యం అవుతున్నాయి. ఉత్పత్తిదారులు, శ్రామికులు దళారుల దయాదక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొన్నది. గిట్టుబాటు కాకపోయినా దళారులు నిర్ణయించిన ధరలకే తమ ఉత్పత్తి సరుకులను అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడుతున్నది. నిజాయితీగా ఉత్పత్తి చేసే రైతులు, ప్రజలు గిట్టుబాటు లేని ఉత్పత్తి వ్యవస్థలను వదిలేసి... బతుకుదెరువు కోసం పట్టణాల వైపునకు సాగుతున్నారు. ప్రజల్లో పేదరికం, నిరుద్యోగం పెరిగి, కొనుగోలు శక్తి క్షీణించడం వల్ల అది మరో సంక్షోభానికి దారి తీసే అవకాశం ఏర్పడుతున్నది.
కోవిడ్ పరిస్థితుల వల్ల, ప్రభావం వల్ల నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. కోవిడ్ విజృంభించిన కాలంలో సరుకుల ఉత్పత్తి నిలిచిపోయి, అమాంతంగా పెరిగిన ధరలు తదనంతర కాలంలో కూడా తగ్గకుండా అలాగే స్థిరపడిపోయాయి. వాస్తవంగా సరుకుల ఉత్పత్తి నిలిచిపోయినప్పుడు ధరలు పెరిగితే, సరుకులు ఉత్పత్తి పెరిగాక ఆటోమేటిక్‌గా ధరలుతగ్గాలి. కానీ అలా జరగలేదు. కార్పొరేట్ వ్యాపారులు, దళారుల మాయాజాలమే దీనికి ప్రధాన కారణం. ధరల నియంత్రణకు పూర్తి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలే. పెరుగుదలకు కారణాలను విశ్లేషించి, వాటిని అధిగమించే మార్గాలను అన్వేషించాలి. ప్రజలు ఉత్పత్తి చేసిన సరుకులను ప్రభుత్వరంగ కొనుగోలు సంస్థల ద్వారా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. ఉత్పత్తి చేసిన సరుకులు పాడవకుండా నిలువ ఉంచేందుకు అవసరమైన శీతల గిడ్డంగులు, గోడౌన్లను అవసరమైన మేరకు ప్రభుత్వమే నిర్మించి ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలి. నిత్యావసర సరుకులను బ్లాక్ చేసి, కృత్రిమ కొరత సృష్టించి, అధిక లాభాలను పొందే కార్పొరేట్ శక్తులను నియంత్రించాలి. నిత్యావసర సరుకుల జాబితాను కుదించకుండా, ప్రజలకు మేలు చేసే విధంగా సవరించాలి. ''ప్రజా పంపిణీ వ్యవస్థ''లను బలోపేతం చేయడం ద్వారా ధరల స్థిరీకరణ చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థలో సరుకుల జాబితాను పెంచాలి, నిర్బంధంగా సరఫరా చేయాలి. ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ చేయబడి ఉన్న టన్నుల కొద్దీ ధాన్యాన్ని వృధా కానీయకుండా సద్వినియోగం చేయాలి. పెట్రోల్ ఉత్పత్తులపై కార్పొరేట్ సంస్థల అధిపత్యాన్ని నిర్మూలించి, ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలి. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులను తగ్గించాలి. ఉత్పత్తిదారులు, శ్రామికులకు ప్రోత్సాహాలిచ్చి ఉత్పత్తి పెరిగేందుకు దోహదం చేయాలి. తద్వారా బడా కార్పొరేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు కాకుండా, సామాన్య ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవడం పెద్ద కష్టసాధ్యమైన పనేమీ కాదనేది అంగీకరించాల్సిన వాస్తవం...
- వంగన అశోక్
సెల్:9493001171