Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాన్రాను ఎన్నికలు భలే రంజుగా మారుతున్నాయి వదినా. మొన్నటికి మొన్న మునుగోడులో ఓటుకు నాలుగువేలు, ఐదువేల రూపాయలు ఇచ్చారు తప్ప, ఇస్తామన్న తులం బంగారం ఏదీ? ఎక్కడా? అని నిలదీసే ఓటర్లును కూడా చూడగలం?
- అంతేనా వదినా. పుక్కట్లో వచ్చిన దాన్ని పూటుగా తాగి తలకిందులు ఆసనాలు వేసిన వాళ్ళ ఫొటోలు కూడా చూసాంగా. డప్పుల మోతలు, తీన్మార్ వీరంగాలకు లెక్కేలేదు మరి.
- బ్లాక్ అండ్ వైట్ పాత పౌరాణిక సినిమాల్లో నేలపై కత్తులు, బాణాలు, గుర్రాలు, ఏనుగులు, రథాల యుద్ధాలు జరుగుతుంటే, ఆకాశంలో ఘటోత్కచుడు - రాక్షస మంత్రుల మాయలమారి యుద్ధాలు భలేగా జరిగేవి. ఆ చందాన ఇళ్ళ సందుల్లో రోడ్లపై ఈ డబ్బుల పంపకం జరుగుతుంటే, పై స్థాయిలో ఫాంహౌసుల్లో ఎమ్మెల్యేల వందల కోట్ల కొనుగోలు వ్యవహారం రట్టయింది.
- అవునొదినా ఒక్కో ఎమ్మెల్యే ధర వందకోట్లకు పైగా పలికిందటగా. పిండికొద్దీ రొట్టె... మొత్తం మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో 500 కోట్లుపైగా ఖర్చయిందంటున్నారు నిజమేనా? మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్టు?
- ఏం చేస్తుంది. 'ఓటును అమ్మవద్దు - కొనువద్దు' అని తనకు తానే ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీబోర్డులు చూసి నవ్వుకుని ఉంటుంది.
- బాగా చెప్పావ్ వదినా, మరి ఎన్నికలు ఇక సక్రమంగా జరగవా ఏంటి?
- ఏమో! ప్రజాస్వామ్యానికి పంగనామాలు పెట్టడంలో అందరూ ఆరితేరినవారే. ఐహిక సుఖాలు త్యజించామన్న స్వామిజీ రామనంద భారతిలు, మత ప్రవక్త కె.వి.పాల్ వంటి వారు కూడా రంగంలోకి వస్తున్నారుగా...
- నిజమే వదినా, పాల్‌ను మిస్ అయితే అస్సలు నవ్వే ఉండదు. పోలింగ్‌కు ముందు నాదే గెలుపు, అందరూ చిత్తుగా ఓడిపోతారు, ప్రభువు చెప్పాడు అని డంబాలు పలికాడు. వచ్చిన ఓట్లు నాలుగంకెలు దాటలేదు. ఇక చూస్కో వలపోత. ఆ వలపోతకు స్పందించి కెమెరాలు ముందు కొస్తున్నాయో... కెమెరాలు చూసి వలపోత ఎక్కువవుతుందో సమజవడం లేదు.
- మరి విశ్లేషణలు చూడలేదా? కమ్యూనిస్టులు లేకపోతే కారు కదిలేది కాదని అందరూ ఒప్పుకున్న విషయం. కమలం ఓడి గెలిచిందని, కారు గెలిచి ఓడిందని అన్నారు. మెజార్టీ పదివేలే కదా! ప్రజల్ని విడిచి పాలన చేస్తే ఎవరి గతైనా అంతేగా...! నేలవిడిచి సాముచేసినట్టే. ఇదో గుణపాఠం.
- కొత్త విషయాలు చెప్పొవదినా..
- అందుకేగా నిన్ను పిలిచింది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల గురించి వార్తలు చదువుతుంటే కొత్త అనుమానాలు వస్తున్నాయి. పాత పింఛన్ పథకానికి మేమిక మంగళం పాడబోతున్నామోచ్ అని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రకటించాడు.
- అదేదో గొప్ప వరమైనట్టు...
- అవునవును. పైగా కాంగ్రెస్ దాన్ని పునరుద్దరిస్తామని అంటుందీ... అది హుళక్కే అన్నాడు. దానితో రిటైరైనవారు, అయ్యేవారు అందరూ తెల్లబోయారు. తలలు పట్టుక్కూర్చున్నారు.
- వదినా ఇప్పుడక్కడ ఉన్నది డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కదా?
- అవును. అందుకే ఆ మిడిసిపాటు, తిరుగుబాటు (రెబల్) అభ్యర్థులు కూడా పెరుగుతున్నారు.
- మరి ఎన్నికలు వందల కోట్ల వ్యాపారం అయ్యాక ఆ బెడద ఉండదా ఏంటీ?
- 'దానికో కొత్త ఉపాయం కనుగొన్నా, అడ్డుకట్ట వేస్తా, మీరెవరూ అభ్యర్థులను చూసి ఓట్లేయ్యకండీ... మోడీ గార్ని, బీజేపీని చూసే ఓటేయండి' అంటున్నాడు నడ్డా.
- ఈ సారి తలలు పట్టుకోవడం అభ్యర్థులవంతు... అంతేగా వదినా.
- అవునంతే. సర్లే అని సరిపెట్టుకుంటే మరో బాంబు పేల్చాడు. ఉచితాలుండవు. ఆ హామీలకు మేం వ్యతిరేకం.కాంగ్రెస్ ఆ పని చేస్తుంది. ఖాళీ ఖజానా సర్కార్ పరిస్థితి.
ప్రజలకు తెలుసు. అందుకే వారు ఉచితాలను డిమాండ్ చేయరుగా.. అన్నాడు.
- ఈసారి నిజంగానే ప్రజలు గొల్లుమనుంటారు.
- ఏకపాత్రలో ద్విపాత్రభినయం. ఓవైపు మోడీ ఛరిష్మాను పైకి కీర్తిస్తూనే, ప్రజలిక ఏమి ఆశించక బీజేపీకే ఓట్లాయాల్సిన అగత్యం ఏర్పడిందని అంటున్నాడు.
- ఈ సంకట స్థితికి ప్రజలు ఎలా స్పందిస్తారు వదినా?
- మహిళలంగా మనం ఉత్సాహపడే విషయం ఇదే వదినా. హిమాచల్‌ప్రదేశ్‌లో మహిళా అక్షరాస్యత ఎక్కువ. ఓటు విలువ వారికి తెలుసు. మొత్తం 56లక్షల ఓట్లల్లో మహిళల ఓట్లు పురుషుల ఓట్లు కన్నా లక్ష తక్కువగా ఉన్నా, ఓటింగ్‌లో పురుషుల కంటే 6శాతం ఎక్కువగా పాల్గొంటారని లెక్కలు చెపుతున్నాయి.
- భలే... భలే...
- ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. అక్కడ అన్ని పనుల్లో చిన్న చిన్న బడ్డీకొట్టు వ్యాపారాల్లో మహిళలే ముందుంటారు. ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ చైతన్యం కలబోసి ఉంటాయి వారిలో... అందుకే అన్ని పార్టీల వారు మహిళల ఓట్లకు గాలం వేస్తున్నారు.
- తప్పదుగా మరి.
- బీజేపీ అయితే ఏకంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సంకల్ప పత్రమే విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అని ప్రకటించింది.
పెళ్ళి చేసుకునే అమ్మాయికి రూ.51వేలు ఆర్థిక సహాయం, పాఠశాల విద్య చదువుకునే అమ్మాయిలకు ఉచిత సైకిళ్ళు, ఉన్నత విద్య చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు, స్త్రీలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూ.500కోట్లతో కార్పస్‌ఫండ్, ఆశావర్కర్లకు జీతం రూ.4,700లకు పెంపు, కేంద్ర పథకం ఉజ్వల కింద లక్షా 36వేల గ్యాస్ కనెక్షన్లు, అబ్బో ఎన్నెనో...
- ఆగాగు వదినా. ఒక పక్క ఉచితాలు ఉండవంటూనే మళ్ళీ ఈ ఉచితాల గొడవేంటి?
- అదే అర్థంకానిది జనానికి. అనుమానాలేమో నా బోటివారికి. నీతులు, దానాలు వల్లించడానికే తప్ప, ఆచరించడానికికాదు అని మన ఎన్నికల సరళి రుజువు చేస్తూనే ఉందిగా వదినా.
-శైలి, సెల్: 9959745723