Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వ మానవాళికి సంభవిస్తున్న పెనువిపత్తులకు, పర్యావరణంలో మార్పులకు అభివృద్ధి పేరుతో మానవుడు సృష్టించలేని సహజ వనరులను కొల్లగొట్టడమే కారణం. పెనువిపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, వడగాలులు, భయంకర తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, దుర్భర శీతల పవనాలు, కరువు కాటకాల లాంటి పర్యావరణ సంక్షోభం వలన నేడు భూగోళం భవిష్యత్తుకు, మానవ మనుగడకే ప్రమాదం పొంచివుంది. పర్యావరణంలో సంభవించే ప్రతికూల మార్పులను నివారించేందుకు ప్రపంచంలోని పేద, ధనిక దేశాలు తక్షణమే ఏకమవ్వాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్య సమితి ఏఏటి కాయేడు నొక్కి చెబుతున్నది. అయినప్పటికీ ఉదాసీనత కొనసాగించడం భావ్యమా! ఇలాంటి వేళ ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారంతో కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా ధనిక, పేద దేశాల మధ్య సరికొత్త ఒప్పందం అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు అమెరికా, ఐరోపాదేశాలు అధిక శాతం కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. 1995 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ''కాప్'' సదస్సును నిర్వహిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఏడేండ్లుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం వల్ల, భూగోళం భవిష్యత్తు బీటలు వారబోతున్న వేళ మరో మారు ఈనెల నవంబర్ 6 నుంచి 18 తేదీల మధ్య ''కాప్ 27'' సదస్సు ఈజిప్టు వేదికగా ప్రారంభమైంది. ఈ సదస్సులో జరిగే చర్చలు తీర్మానాలు అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
గత ఒప్పందాల వైఫల్యాలు, తక్షణ కర్తవ్యాలు నిర్దేశించుకుని ఆచరణలో కార్యరూపం దాల్చేలా చిత్తశుద్ధితో కూడిన రాజకీయ సంకల్పం కీలకమైందిగా పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గత ఒప్పందాలలో 2050 నాటికి సగటున భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేస్తామని 196 దేశాలు ప్యారిస్‌లో సంతకాలు చేశాయి. 2030 నాటికి 50శాతానికి, 2050 నాటికి సమూలంగా కర్బన ఉద్గారాల నియంత్రణకు, పర్యావరణ హితమైన కార్యక్రమాలకు అమలు కృషి చేస్తామని అన్నారు. పేద దేశాలకూ సహకారాన్ని అందిస్తామన్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా అగ్రదేశాల క్షేత్రస్థాయి అమలులో ఉద్దేశపూర్వక వైఫల్యాలను చూస్తున్నాం. కాబట్టి ఈ కాప్ 27 సదస్సులోనైనా మానవాళి మనుగడకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సారైనా పర్యావరణాన్ని కాపాడే చర్యలు ప్రణాళిక బద్ధంగా అమలు జరగాలి. లేదంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసుకున్నట్లుగా మారుతుంది ఈ ప్రపంచం. ఆ తర్వాత అగ్ర, సంపన్న దేశాలు శవాల దిబ్బగా మారిన భూగోళాలను ఏలుతారా! వీరు ఆశిస్తున్న శీఘ్రగత అభివృద్ధి, పారిశ్రామికీకరణ ఎవరికోసం? ఎందుకోసం? మానవాళితోపాటు సమస్త జీవకోటి మనుగడకోసం కాదా? అగ్ర, సంపన్న దేశాలు ఈ సదస్సును చివరి అవకాశంగా భావించాల్సి ఉంది. ఇప్పటివరకూ అగ్రదేశాలు సదస్సు వేదికలపై నీతి వాక్యాలు వల్లిస్తూ ఆచరణలో మాత్రం పొంతన లేకుండా వ్యవహరిస్తున్నాయని రుజువయింది.
భూతాపానికి కారణం అవుతున్న కర్బన ఉద్గారాల (గ్రీన్హౌస్ గ్యాస్) విడుదల ధనిక దేశాల్లోనే అత్యధికంగా ఉంటుందని(ఐరాస) పర్యావరణ కార్యక్రమ నివేదిక స్పష్టం చేసింది. 2020లో కర్బన ఉద్గారాల ప్రపంచ తలసరి 6.3 టన్నులు, (కార్బన్ డై ఆక్సైడ్ ఈక్వాలింట్) కాగా భారత్ సగటు 2.4టన్నులు మాత్రమేనని వెల్లడించింది. నేడు జరుగుతున్న కాప్ 27 సదస్సును పురస్కరించుకొని ''ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2022 క్లోజింగ్ విండో'' పేరుతో ఓ నివేదిక ఈ మధ్యనే విడుదలైంది. భూతాపాన్ని గణనీయంగా తగ్గించుకోవాలన్న 2015లోని ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం ప్యారిస్ ఒప్పందం నెరవేరకపోవడం నుండి గుణపాఠంతో కూడిన స్ఫూర్తిని పొంది ముందుకు సాగాల్సివుంది. కానీ విపత్కర పర్యావరణ పరిణామాలను వెంటనే అరికట్టకుండా ఫలితాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. ఈ పెరుగుదలను 1.5డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే పేద దేశాల పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల ఆవేదన అరణ్యరోదన కారాదు. ధనిక, అగ్రరాజ్యాలు అభివృద్ధి పేరుతో చేస్తున్న చర్యలే అధిక భూతాపానికి కారణం అని హెచ్చరిస్తున్న గత, తాజా నివేదిక నుండి అయినా కళ్ళు తెరుచుకోవాలి. అభివృద్ధి, పారిశ్రామికీకరణ మాటున మానవ వినాశకర విధానాలతో సహజ వనరుల దోపిడీని ఉమ్మడి కార్యాచరణతో కట్టడి చేయాలి. మానవళి మనుగడ కోసం సహజ వనరులను పరిమితంగా అవసరాల మేరకు వినియోగిస్తూ ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. రాబోవు వినాశన నివారణ వెంటనే కార్యరూపం దాల్చాలి.
కర్బన ఉద్గారాల తటస్థ స్థితిని ప్రపంచ దేశాలన్నీ సమిష్టి విధానాలతో సాధించి తీరాలి. తాజాగా జరుగుతున్న ఈజిప్టులోని కాప్ 27 సదస్సులో అన్ని దేశాలూ విశ్వమానవాళి భద్రత కోసం భూతాప నియంత్రణ వ్యూహాలు, విధానాల అమలుకు పూనుకోవాలి. ఇది మానవజాతి మనుగడ కోసమేనని విస్మరించరాదు. పాలకులు చిత్తశుద్ధితో తక్షణమే అమలుకు ప్రతిన పునాలి. 2020లో వివిధ దేశాల తలసరి కర్బన ఉద్గారాల విడుదల ఇలావుంది... అమెరికా 14 టన్నులు, రష్యా 13 టన్నులు, చైనా 9.7 టన్నులు, బ్రెజిల్, ఇండోనేషియా7.5 టన్నులు, ఐరోపా సమాజం 7.2 టన్నులు. ప్రపంచ మానవాళి సమస్తం సంఘటితంగా ప్రకృతికి, భూగోళానికి హాని తల పెట్టకుండా జీవనం సాగించాలి. ప్రపంచ దేశాల పాలకులు పంచభూతాలైన నేల, నింగి, గాలి, అగ్ని, నీటి వనరుల విధ్వంసాన్ని విడనాడాలి. ఇవి ప్రపంచ మానవాళి అవసరాలు తీర్చగలవు. అభివృద్ధి, ప్రగతి పేరుతో పారిశ్రామికీకరణ మాటున భూమిని గాలిని నీరును పర్యావరణాన్ని విషతుల్యం చేయరాదు. ఎంత ధనం వెచ్చించినా సహజ సంపదలను సృష్టించడం మన వల్ల కాదనే వాస్తవాన్ని గమనించి వాటిని వాడుకోవాలి. మానవాళి, పాలకులు శాస్త్ర విజ్ఞానం పేరుతో ఉగ్రరూపుడు అయితే ప్రకృతి మహౌగ్ర రూపం దాల్చి ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం, అభివృద్ధి మానవ వికాసానికి తోడ్పడాలే కానీ, వినాశనానికి తావు ఇవ్వరాదు.
- మేకిరి దామోదర్
సెల్: 9573666650