Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనది మత ప్రమేయంలేని లౌకిక ప్రజాస్వామ్యం - అని మన నాయకులు చెపుతుంటారు. కానీ, మతానికీ, రాజ్యాధికారానికి కలిపి విడదీయరాని ముడి వేస్తుంటారు. ఆ బంధానికి ప్రచార సాధనాలన్నింటితో ఊడిగం చేయిస్తుంటారు. మఠాధిపతులకు పాలకులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటారు. మత ప్రచారకులేమో పాలకులకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంటారు. వీరు ఇరువురు కలిసి, వాస్తవిక జీవన సత్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి పనికిరాని పూజలు, క్రతువులు పెద్ద ఎత్తున జరిపిస్తుంటారు. ఇవన్నీ ముక్తిమార్గానికి దారులు కావు. పలాయన వాదానికి రహదారులు. చచ్చు పుచ్చు బాబాల మహిమల్ని, 'అమ్మ'ల ముద్దులకు ఉన్న శక్తుల్ని పాలకులు నిసిగ్గుగా ప్రచారం చేస్తుంటారు. ఇవన్నీ తిరోగమనానికి తిరుగులేని మార్గాలు. చెప్పేవి శ్రీరంగ నీతులు... అన్నట్లు పాలకులు వ్యవహరిస్తుంటారు.
అయితే ప్రతి తరంలోనూ కొందరు మహానుభావులు ఇలాంటి దుశ్చర్యలను దుయ్యబడుతూనే ఉన్నారు. అందుకే రాజా రామ్మోహన్రారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం లాంటి మహనీయులు భారత జాతీయ పునరుజ్జీవనోద్యమ వైతాళికులుగా మనకు మిగిలారు. మరోవైపు గురజాడ, గిడుగు, కొమర్రాజు, కవిరాజు, గోరా వంటి ప్రగతిశీల ఉద్యమకారుల వారసులుగా మనం మిగిలాం. ఇలాంటి వారి జీవితాల గూర్చి, వారి ఉద్యమ స్ఫూర్తి గురించి యువతరం తెలుసుకోకుండా పాలకులు జాగ్రత్త పడుతుంటారు. వారి స్మృతి చిహ్నాలు నిలుపుకోవాలన్న తపనగానీ, వారి గ్రంథాలు మరుగున పడకుండా కాపాడుకుందామన్న ఆలోచన గానీ పాపం మన పాలక శిఖామణులకు ఉండదు. పైగా ఆలయాల పునరుద్ధరణ చేపట్టి మతాన్ని సజావుగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాల్ని వదిలించాల్సింది పోయి, పాలకులే వాటిని నిలబెట్టడానికి గట్టి కృషి చేస్తుంటారు. వారిని ఇతర పార్టీల నాయకులు కూడా అనుసరిస్తుంటారు. అమాయక ప్రజల అంధ విశ్వాసాల్లో వీరంతా భాగస్వాములై ఇంగిత జ్ఞానాన్ని మరిచి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వివేకవంతులైన సామాన్య ప్రజలు ఏం చేయాలీ? పాలక వర్గాల్ని ప్రశ్నించాలి. సమైక్యంగా నిలబడి పాలకుల విచక్షణా జ్ఞానాన్ని తట్టి లేపాలి.
డబ్బులు వెదజల్లి అక్రమ మార్గంలో ఎవరైనా పాలకులు అయిపోవచ్చు. మనం చూస్తూనే ఉన్నాం. చదువు, విజ్ఞత లేకపోయినా అధికార పీఠాలు ఆక్రమించి, బహిరంగంగా అక్రమాలు చేస్తున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. మరి వారిని అలాగే సమాజంలో విచ్చలవిడిగా వదిలేద్దామా? లేక అడ్డుకుని సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదామా? ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చేసింది. ఉట్టి ఆలోచనతో కూడా పనికాదు. దాన్ని ఆచరణలో పెట్టగలగాలి కూడా! ఇవన్నీ జరగాలంటే స్ఫూర్తి దాయకమైన విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఇతరులకు చెపుతూ సంఘటితమవుతూ ఉండాలి. ముఖ్యంగా, యువతీ యువకులపై శ్రద్ధ పెట్టి వారిని ఇందుకు అనుగుణంగా తయారుచేసుకుంటూ ఉండాలి.
తఈ సంఘానికి మంచి దారి చూపాలనుకున్న ఎందరో సంఘ సంస్కర్తలు నిజ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కున్నారు. అవమానాలకు గురయ్యారు. అయినా, వారు వారి ధ్యేయాన్నించి దృష్టి మరల్చలేదు. ఉదాహరణకు ఇక్కడ కందుకూరి వీరేశలింగం ఆత్మకథలోంచి కొన్ని అనుభవాలు నెమరువేసుకుందాం. ఇవి ఇప్పటికి 142 ఏండ్ల క్రితం జరిగినవి. కందుకూరి (1848-1919) 'రాజశేఖర చరిత్ర' (1880) శీర్షికతో తెలుగు భాషకు ఆధునిక తొలి నవలను అందించిన గొప్ప రచయిత. మనుషులకు సమాన హక్కులు లేనికాలంలో, స్త్రీ పురుషులకు సమాన స్థాయి లేని కాలంలో మతమే పెద్ద ప్రతిబంధకమైంది. కొంతమంది సంస్కర్తలు తమ జీవితాలు ధారపోసి ఎదిరిస్తే కదా? ఈనాటి ఈ సమాజానికి ఒక స్వరూపం ఏర్పడిందీ? సతీసహగమనంలోంచి స్త్రీలను బయటికి లాగి, స్త్రీ పునర్వివాహాలు జరపడం అంత సులభంగా ఏమీ జరగలేదు. ''ప్రగతి శీల భావాలతో వీరేశలింగంది రాబోయే కాలం అయితే, ఆయనను విమర్శించే వారిది పోయేకాలం'' అని ఛలోక్తి విసిరారు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. కందుకూరివారు తమ స్వీయ చరిత్రలో స్వయంగా ఇలా రాసుకున్నారు.
లిలిలి లిలిలి లిలిలి
వ్యభిచారం, భ్రూణహత్యలూ వంటి సమస్యలు లేకుండా బాల వితంతువులు తమ భర్తలతో సుఖంగా ఉంటే చూసే అదృష్టం ఎప్పుడు కలుగుతుందా? అని ఎదురుచూసి, చివరకు ఆహ్వాన పత్రిక రాశాను. అది చూసి పండితులంతా నా మీద కత్తులు నూరడం ఆరంభించారు. ఒక సభ జరిపి 30 స్మృతులకంటే ఎక్కువగా తెప్పించి వాదించాను. సింహాల వలె నా మీద విరుచుకుపడి దూషించారు. మంచి మాటలతో కొందరూ, భయపెట్టి కొందరూ నన్ను మార్చాలని చూశారు. చర్చిద్దామని కాకినాడలోని దేవాలయంలో సభ పెడితే కొందరు సభ నుండి లేచిపోయారు. కొందరు అల్లరి చేయాలని తోపులాట మొదలెడితే పోలీసులు అడ్డుకున్నారు. మరి కొంతమంది రాళ్ళు రువ్వుతుంటే నాకు సాయంగా వచ్చిన విద్యార్థులు వారి మీద తిరగబడి చితకబాదారు. చెన్నపట్నంలో కూడా ఇలాగే వైష్ణవ పండితులు దొమ్మీ చేసి నా మీద పడబోతే ఒక మిత్రుడు నన్ను తప్పించి బండి ఎక్కించి పంపించేశారు. వితంతు వివాహ ఉద్యమం ప్రారంభించి రెండేండ్లయినా మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. అన్ని ఖర్చులూ నేనే భరించాను. ఉపన్యాసాలు ముద్రించి ఉచితంగా పంచిపెట్టాను. వాదన కోసం 40వరకు స్మృతులూ పుస్తకాలూ కొన్నాను. వితంతు వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చిన విద్యార్థుల చదువుకయ్యే ఖర్చులు చెల్లించాను. బాల వితంతువులు ఎక్కడెక్కడున్నారో తెలుసుకుని వచ్చేవారికి సొమ్ములిచ్చి అమలాపురం, మండపేట, తాళ్ళపూడి, కాకినాడ, రామచంద్రపురం, పాలకొల్లు మొదలైన చోట్లకు పంపించాను. కొన్ని స్థలాలకు నేనే స్వయంగా వెళ్ళాను. మా శ్రమను చూసి కొంతమంది మాకు చేయూతనిచ్చారు. ఇక వాదనలు మాని ఎలాగైనా వితంతు వివాహం చెయ్యాలని నడుం కట్టాము.
వితంతు వివాహం చేయబోతున్నానని తెలుసుకుని కొందరు బ్రాహ్మణులు నన్ను మార్కండేయస్వామి ఆలయానికి రప్పించి కొట్టాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈ వార్త విని సభ ప్రారంభమైన అరగంటలోపే 200మంది విద్యార్థులు కర్రలతో వచ్చి నా చుట్టూ కూర్చున్నారు. ఆ రోజు నుంచి కక్షలు మరింత పెరిగిపొయ్యాయి. విరూపాక్ష పీఠస్థులైన శంకరాచార్య స్వాముల వారు విజయనగరం నుండి బయలుదేరి వచ్చి వితంతు వివాహాన్ని ప్రోత్సహించిన వారినందరినీ వెలివేస్తామని హెచ్చరించారు. ధనసంపాదన కోసం ఆయన చేసిన అకృత్యాలను మా వివేకవర్థని పత్రికలో ప్రచురించి ప్రజల కళ్ళు తెరిపించాము. దానితో స్వామివారికి మా ఊళ్ళో భిక్ష దొరకడం కష్టమైపోయింది.
మొదటి వివాహం: జిల్లా పోలీసు అధికారి మా ఇంటి చుట్టూ 60మంది పోలీసులను కాపలా ఉంచారు. వీధంతా పోలీసులను ఏర్పాటు చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ స్వయంగా రక్షణ ఏర్పాట్ల గురించి తెలుసుకుంటూ ఉన్నారు. నా ప్రాణాలకు సైతం కొంత మంది ముప్పు తలపెట్టారు. కానీ, నా విద్యార్థులు, పోలీసులు రక్షణగా ఉండటం వల్ల నాకే అపాయమూ కలగలేదు. విశాఖపట్నానికి చెందిన గోగులపాటి శ్రీరాములు అనే 22ఏండ్ల యువకుడికి భార్య చనిపోగా అతనికి 1881 డిసెంబర్ 11న ఒక బాలవితంతువుతో వివాహం జరిపించాము.
పెళ్ళితరువాత కల్లోలం: పెళ్ళిలో ఒక మిత్రుడు భోజనం చేసినందుకు అతని బంధువులంతా ఘోల్లుమని గోలపెట్టి ఏడ్చి శపిస్తూ లేచిపొయ్యారు. నా మిత్రులు కూడా నాతో మాట్లాడటానికి భయపడసాగారు. కొందరు మా వీధిలో నడవడానికి భయపడి చుట్టూ తిరిగిపోయేవారు. బంధువులంతా నన్ను జాతి భ్రష్టుడిలా చూశారు. కొంతమంది ఇళ్ళకు వెళ్ళి ప్రాయచ్చిత్తం చేసుకున్నారు. ఈ పెళ్ళితో సంబంధం ఉన్న వాళ్ళందరినీ అద్దె ఇళ్ళ నుంచి ఖాళీ చేయించారు. వారిలో కొంతమందికి నేను ఆశ్రయం ఇచ్చాను. నూతులలో నీళ్ళు తోడుకోనివ్వలేదు. శుభకార్యాలకు పురోహితులను రాకుండా చేశారు. శ్రీశంకరాచార్యుల వారు 30మందిని కులం నుండి బహిష్కరిస్తున్నట్టు పత్రికలు పంపించారు.
పై చేయి కందుకూరిదే: ఎంత గందరగోళం జరిగినా చాలా మంది తమ వితంతు బాలికలకు వివాహం చేయడానికి మా పట్టణానికి రావడం మొదలు పెట్టారు. మొదటి పెళ్ళి జరిగిన నాలుగవ రోజునే రెండవ వితంతు వివాహం 12ఏండ్ల బాలికకు చేశాం.
లిలిలి లిలిలి లిలిలి
కందుకూరి వారి స్వీయ చరిత్రలో ఈ చిన్న భాగం చదివితేనే మనకు 142ఏండ్ల క్రితం మన సమాజ స్వరూపం ఎలా ఉండేదో అర్థమవుతుంది కదా? మరి ఎన్ని కష్టనష్టాలకు ఓర్చుకుని, ప్రాణాలకు తెగించి ఆనాడు వీరేశలింగం స్త్రీలకు పునర్వివాహాలు జరిపించాడో కదా? నమ్మకస్థులైన ఆయన విద్యార్థులు తమ గురువుగారిని ఎలా కంటికి రెప్పలా కాపాడుకున్నారో కూడా అర్థమవుతుంది. ఇకపోతే, ఈ తరం యువతీ యువకులకు లభిస్తున్న ఈ స్వేచ్ఛ ఊరికే రాలేదు. కందుకూరి లాంటి వారు... ఎంతో మంది సంఘ సంస్కర్తలు పూనుకుంటే వచ్చింది. దాన్ని అలాగే నాగరికంగా, గౌరవంగా నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. దొరికిన ఈ స్వేచ్ఛను అనాగరికం చేసి, అభాసుకావడం విజ్ఞత అనిపించుకోదు. స్త్రీ పురుష సంబంధాలు, మానవ సంబంధాలు ఎక్కడ ఎప్పుడు వెర్రితలలు వేసినా, వాటిని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. విశాలాంధ్ర దినపత్రిక పూర్వ సంపాదకులు సి. రాఘవాచారి వీరేశలింగం గూర్చి ఒక మంచి మాట చెప్పారు. ''తిరోగమన శక్తులకు నాటికీ నేటికీ వీరేశలింగం- సింహస్వపన్నమే!'' అని! తమ మత విశ్వాసాల్ని జనంలో నిలుపడానికి పీఠాధిపతులు, వేద పండితులు శతాబ్దాలుగా దౌర్జన్యాలు చేస్తూ వస్తున్నారన్న విషయం - కందుకూరి వారి స్వీయ చరిత్రలో స్పష్టంగా ఉంది.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.