Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుగోడు ఎన్నికల ఫలితం, ఆ మాట కొస్తే ఇటీవల దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఏడు ఉప ఎన్నికల ఫలితాల గురించి పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు. ఎవరి స్థానాల్లో వారున్నారు. ఏడు స్థానాల్లో నాలుగు స్థానాలు బీజేపీ గెలుచుకుంది. అందులో మూడు గతంలో తాను ప్రాతినిధ్యం వహించినవే తిరిగి నిలుపుకుంది. ఇంకో రెండు స్థానాల ఎన్నికలు బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరగా వచ్చినవి. అందులో ఒకటి వచ్చింది ఒకటి పోయింది. కాగా, అందరి దృష్టి తెలంగాణలో మునుగోడుపైనే ఉండింది. ఎందుకంటే అక్కడి అధికార పార్టీ తెరాసను దెబ్బకొట్టడాని బీజేపీ ఫిరాయింపులకు తెగబడిమరీ కోరి తెచ్చుకున్న ఎన్నిక. పైగా అక్కడి శాసనసభ ఎన్నికలు ఏడాదికే రానున్నాయి. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తానే గట్టి పోటీదారునని నిరూపించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ ఉప ఎన్నికను తీసుకు వచ్చింది. ఆ రెండు బలమైన పార్టీలూ అన్ని రకాలా బలాల్ని ఒడ్డి పోరాడాయి. అందులో భాగంగా ఇరు పార్టీల సౌజన్యంతో అతి ఖరీదైన ఎన్నికలుగా పోటా పోటీగా సాగిన ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ నే వరించింది. అయితే కేవలం ఒక బల నిరూపణ కోసం, ఒక పైచేయి కోసం ఏ మార్పూ తేలేని ఒక తతంగానికి బీజేపీ ఇంతకు తెగించాలా? ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఆయా పార్టీలు తెస్తున్న చేటు కొలవగలమా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు, సిద్ధాంతాలు మ్యానిఫెస్టోలు వెనక్కిపోయి, రాద్ధాంతమే కీలకమైన వ్యూహంగా మార్చడం మంచి పరిణామాలు కావు. సామాన్యుడికి ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ఈ ధోరణికి ఇది అంతం కాదు, ఆరంభం. డబ్బు ప్రభావం లేని ఎన్నికల సంస్కరణలు వచ్చేలా పౌర సమాజం ఒత్తిడి తీసుకురాలేకపోతే పరిస్థితిలో మార్పును ఆశించడం అత్యాశే.
- డాక్టర్ డి.వి.జి. శంకరరావు