Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 2021లో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆ పార్టీ కన్వీనర్, అరవింద్ కేజ్రీవాల్ భగత్ సింగ్, అంబేద్కర్లు తమకు దిశా నిర్దేశం చేసే వెలుగు రేఖలని ప్రకటించాడు. వీరి పేర్లను ఉపయోగించినప్పటికీ, ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలు నెరవేరడంలేదు. ఢిల్లీలో ఇటీవల జరిగిన పరిణామాలు ఆప్ మోసాన్ని తెలియజేస్తాయి. మొదటిది, రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా. అంబేద్కర్ ప్రతిజ్ఞలు బహిరంగంగా చేయడం వల్ల సాంఘిక సంక్షేమశాఖా మంత్రిగా రాజీనామా చేశారు. తరువాత గృహ దహనం, ఇతర అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఆప్ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ నిర్దోషి అని కోర్టు ప్రకటించిన తరువాత కూడా పార్టీ నుండి బహిష్కరించారు. దళితులు, ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత నేరాలపై ఆప్ ద్వంద్వ స్వభావం దాని ప్రతిష్టను దిగజార్చింది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటంతో, కొన్ని ముఖ్యమైన సమస్యలపై ఆప్ తప్పించుకునే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను, మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించిన వామపక్షవాది, నాస్తికుడైన భగత్ సింగ్, బహిరంగంగా హిందూమతాన్ని వదిలి, 5లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించిన అంబేద్కర్లవలె కాక, ''మేము దేశంలోని 130కోట్ల మందిని ఏకం చేయాలనుకుంటున్నాం కాబట్టి మేం నిజమైన హిందుత్వను అనుసరిస్తున్నాం'' అని కేజ్రీవాల్ అంటున్నాడు.
భిన్న ప్రమాణాలు
రాజేంద్రపాల్ గౌతమ్ రాజీనామా చేసిన వెంటనే, విచారణ పేరుతో ఢిల్లీ పోలీసులు అతడ్ని పిలిపించారు. అక్టోబర్ 5న జరిగిన మత మార్పిడి కార్యక్రమంలో దాదాపు 10వేల మందితో బౌద్ధాన్ని స్వీకరించి, అంబేద్కర్ ప్రతిజ్ఞలను పంఠించాడు. ముఖ్యంగా (బలవంతం చేయనప్పుడు) మత మార్పిడిని మన రాజ్యాంగం నిషేధించలేదు. అవినీతి ఆరోపణలపై జైలులో ఉండి కూడా మంత్రిగా కొనసాగిన సత్యేంద్ర జైన్, లిక్కర్ పాలసీలో ఆరోపణలు ఎదుర్కొని, విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిపించిన దుర్గేష్ పాఠక్‌లు పొందిన ఆప్ మద్దతు, దళితుడైన రాజేంద్రపాల్ గౌతమ్, తాహీర్ హుస్సేన్ ఇరువురూ పొందలేదు. తమ పార్టీ ద్వంద్వ వైఖరి పట్ల గౌతమ్ నిజాయితీగా అసంతృప్తిని వ్యక్తపరిచారు. తన రాజీనామా తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూలలో దళిత, ముస్లిం వ్యతిరేక సంఘటనలపై ఆప్ మౌనం పట్ల బాధను వ్యక్తం చేశాడు. ''హంతకులు అత్యాచారాలకు పాల్పడిన వారు నిర్దోషులుగా విడుదలైతే, వారికి పూలదండలు వేసి సాదరంగా స్వాగతిస్తూ మిఠాయిలు పంచుతున్నారు. గొంతెత్తి మాట్లాడేవారే లేరు. బిల్కిస్ బానో కేసులోని నేరస్థులనుదహరిస్తూ... మనం భారతదేశాన్ని ఎటు తీసుకు పోతున్నామని'' గౌతమ్ ప్రశ్నించాడు. ''తనకు అప్పగించిన బాధ్యతలను కష్టపడి నిర్వర్తించాననీ, కానీ పార్టీ మద్దతు మాకు అవసరం వచ్చినప్పుడు మా పోరాటంలో మేము ఒంటరిగానే మిగిలి పోయామని'' గౌతమ్ వాపోయాడు. ఇంటిని ధ్వంసం చేయాలనే తలంపుతో పేలుడు పదార్థాలను ఉపయోగించి హాని తలపెట్టాడనే ఆరోపణలు ఎదుర్కొన్న హుస్సేన్‌ను అక్టోబర్ 19న నిర్దోషిగా ప్రకటించారు. ఈ పరిణామం పట్ల ఆప్ ఏ విధంగానూ ప్రతిస్పందించలేదు. అదేవిధంగా బౌద్ధమత స్వీకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్న గౌతమ్ చర్యను కూడా ఆప్ సమర్థించలేదు.
భావజాల సంక్షోభం
బిల్కిస్ బానో గురించి గానీ, ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయాల గురించి గానీ మాట్లాడడం లేదనీ, మీ పార్టీ ''మృదువైన హిందూత్వ''(సాఫ్ట్ హిందూత్వ) రాజకీయాలను నడిపిస్తుంది గదా! అని, గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో మనీష్ సిసోడియాను ఒక టీవీ జర్నలిస్టు అడిగాడు. ఒక రాజ్‌పూత్‌గా, మహారాణా ప్రతాప్ వంశస్థునిగా గర్వంగా తన అస్థిత్వాన్ని ప్రకటించుకున్న సిసోడియా, ''మేము విద్య, వైద్యం, ఉద్యోగాలపై ఎక్కువగా కేంద్రీకరిస్తున్నామని'' మాత్రమే బదులిచ్చాడు.
''కొన్ని రాజకీయ శక్తులు ఈ దేశాన్ని రావణకాష్టం చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నాయి. ఆప్ మౌనం వహించడం విచారకరం. మేము భగత్‌సింగ్, అంబేద్కర్ వారసులమని ప్రకటించుకున్న తరువాత ఆప్ అదే మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది. పార్టీ చెప్పే దానికి, అమలు చేస్తున్న దానికి మధ్య ఉండే తేడాను ప్రజలు అర్థం చేసుకొని అప్పుడు ప్రశ్నించడం మొదలు పెడతారు. వాటికి మనం సమాధానం చెప్పాలి. లేకుంటే మనం ప్రజలను ఎదుర్కోలేం'' అని ఆధిపత్య రాజకీయాల గురించి గౌతమ్ ఫ్రంట్ లైన్‌తో తన అభిప్రాయాలను వెల్లడించాడు.
హిందూ రాజకీయాలు
''రాజకీయ ప్రయోజనాల కోసమే ఆప్ భగత్‌సింగ్, అంబేద్కర్ల వారసులమని ప్రకటించింది. మిగిలిన రాజకీయ ప్రముఖులకు భిన్నంగా అంబేద్కర్, భగత్‌సింగ్‌లు విమర్శలకు అతీతులు. అందరినీ కలుపుకొని పోయే భగత్‌సింగ్ జాతీయ వాదానికి భిన్నంగా, బీజేపీ అనుసరిస్తున్న మతపరమైన జాతీయవాదాన్ని ఆప్ అనుసరించాలనే తొందరలో ఉన్నట్లు కనపడుతుందని'' పంజాబ్ యూనివర్సిటీకి చెందిన అశుతోష్ కుమార్ లాంటి రాజకీయ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కేజ్రీవాల్, ఆయన పార్టీ స్టార్ క్యాంపెయినర్లు హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. వృద్ధులు ఉచితంగా తీర్థ యాత్రలకు వెళ్ళే ఏర్పాట్లు చేసే ''ముఖ్యమంత్రి తీర్థయాత్రా యోజన''ను అమలు చేసేందుకు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఒక తీర్థయాత్రా వికాస సమితిని ఏర్పాటు చేసింది. నవంబర్ 2021లో హరిద్వార్‌లో కేజ్రీవాల్ రిపోర్టర్లతో మాట్లాడుతూ... ''ఒకవేళ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలు మా పార్టీకి ఓట్లు వేస్తే, ఉత్తరాఖండ్‌లో కూడా మా పార్టీ ఈ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పాడు. అయోధ్యలో రాముని దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తాం. ముస్లింలను అజ్మర్ షరీఫ్‌కు, సిక్కులను కర్తార్‌పూర్ సాహిబ్‌కు ఉచితంగా పంపిస్తామని'' అన్నాడు. అయోధ్యలో రామమందిరం నిర్మా ణం పూర్తయిన వెంటనే ఉచిత తీర్థయాత్రలకు అవకాశం కల్పిస్తామని కేజ్రీవాల్ గుజరాత్లో వాగ్దానం చేశాడు.
ఆప్, ఆరెస్సెస్ మానసపుత్రికని కాంగ్రెస్ పార్టీ అంటుంటే, ఆప్ దాని నాయకులు ''హిందూ వ్యతిరేకులని'' బీజేపీ నాయకులు అంటున్నారు. మత మార్పిడికి సంబంధిం చిన కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తీసిన వీడియోను చూసి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజూ ''కేజ్రీవాల్ అతని మనుషులు హిందువులను, హిందూత్వను ఎందుకు ఇంతగా ద్వేషిస్తున్నారని'' ట్వీట్ చేశాడు. హిందూమతం, బౌద్ధమతం ఈ రెంటి మూలాలు పురాతన భారతీయ సంస్కృతిలో ఉన్న విషయాన్ని నొక్కి చెపుతూ... ''మోడీ బౌద్ధమతాన్ని భారతదేశ ప్రాపంచిక మార్గంలో ప్రధానమైనదిగా గుర్తించి, మొదటి సారి బుద్ధ జయంతికి అధికార హౌదాను కల్పించాడని'' రిజిజూ అన్నాడు.
రూపాంతరం
జాతీయ రాజకీయాల్లో ప్రధాన స్రవంతిలోని పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ఉద్భవించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ''నేనొక సామాన్య మనిషిని'' అని రాసి ఉన్న తెల్ల గాంధీ టోపీని ధరించి ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఈ సంవత్సర ఆరంభంలో పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసే సందర్భంలో భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు, రాజ్ భవన్‌కు బదులుగా భగత్‌సింగ్ పుట్టిన ప్రాంతం ఖట్కర్ కాలన్ను వేదికగా నిర్ణయించింది. రాష్ట్ర పార్టీ నాయకులు, మంత్రులు స్వాతంత్య్ర సమరయోధునికి (భగత్‌సింగ్) గౌరవ సూచకంగా పసుపు రంగు తలపాగాలు ధరించారు. అదే విధంగా భగత్ సింగ్, అంబేద్కర్ చిత్రపటాలు ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయం చేసింది.
పెరుగుతున్న విమర్శలు
సిసోడియాను భగత్ సింగ్‌తో పోల్చినందుకు భగత్ సింగ్ కుటుంబ సభ్యులు కేజ్రీవాల్‌ను తీవ్రంగా విమర్శిస్తూ, ఆ ప్రకటనను విరమించుకోవాలని అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీతో సంబంధం ఉందన్న ఆరోపణలపై సిసోడియాను 9గంటల పాటు సీబీఐ నిర్బంధంలోకి తీసుకున్న తరువాత కేజ్రీవాల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
దేశ్ రాజ్ కాళీ అనే ప్రముఖ పంజాబీ నవలా రచయిత, దళిత సాహితీవేత్త ఆప్ ద్వంద్వ స్వభావం కలిగి ఉందని మొహమాటం లేకుండా చెప్పారు. ఇటీవల కేజ్రీవాల్‌తో కలిసి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... తమ ఇరువురి సెల్ ఫోన్లలో బ్యాలెన్స్ లేదని భగవంత్ మాన్ అన్నాడు. ఈ కపటత్వం గురించి మనం ఏమనాలి? ఆప్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అద్దె విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇది వారు రెండు రాష్ట్రాలను నడిపిస్తున్న తీరు. అవినీతి ఆరోపణలపై బహిష్కరణకు గురైన పంజాబ్ ఆరోగ్య శాఖామంత్రి విజరు సింఘ్లా పార్టీ కార్యక్రమాలలో నిత్యం కనిపిస్తాడని కాళీ అన్నారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, ''ఢిల్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ గ్యారెంటీ స్కీం'' ప్రచారం నిమిత్తం 2021-22 కాలంలో 19కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ కాలంలో కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే రుణాలను మంజూరు చేసింది. మూడింట ఒక వంతు ఢిల్లీ ప్రభుత్వాధీనంలో ఉన్న పాఠశాలలు మాత్రమే 11, 12 తరగతుల విద్యార్థులకు సైన్స్ బోధిస్తున్నాయని గత ఆగస్ట్ నెలలో పీటీఐ నివేదిక తెలిపింది. ఆప్ తమదిగా చెప్పుకుంటున్న భావజాలానికి, క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధానాలకు ఎలాంటి పొంతన లేకుండా పోయిందని పరిశీలకులు భావిస్తున్నారు. ''ఢిల్లీ నమూనా''లోని లోపాలను ఎత్తిచూపుతూ, ఆప్ ప్రభుత్వ ఉపాధి కల్పనా చర్యలను నిందిస్తున్నారు.
ఇటీవల కాలంలో భగత్‌సింగ్‌పై అనేక రచనలు చేసిన ప్రొఫెసర్ చమన్ లాల్, భగత్ సింగ్ అనుసరించిన భావజాలాన్ని ప్రోత్సాహించేందుకు ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుతూ అనేక ఉత్తరాలు రాసారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో శాసనసభ్యులతో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు, ప్రభుత్వ గ్రంథాలయాల్లో భగత్ సింగ్‌పై ఉన్న రచనలను సమకూర్చాలని కోరుతూ రెండు ప్రభుత్వాలకు సిఫార్సు చేశాడు. అంబేద్కర్, భగత్ సింగ్‌ల రచనలు, వారిపై రచించిన గ్రంథాలను యువకులకు ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు పరిచయం చేయకుండా వారి భావజాలం ఎవ్వరికీ తెలియదని ప్రొ.చమన్ లాల్ అభిప్రాయపడ్డారు. తన సిఫార్సులు ఏవైనా అమలయ్యాయా అనే ప్రశ్నకు బదులిస్తూ... ఇంత వరకు ఈ రెండింటిలో ఏ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లభించలేదని ప్రొ.చమన్ లాల్ అన్నారు.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
- అశుతోష్ శర్మ
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451