Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది జగన్నాటకం! అందరూ పాత్రధారులే.. సూత్రధారులు అగోచరం. తెర తీసేటప్పటికి వేసిన కుర్చీల్లో అనేకమంది 'హన్మంతులు' ఆసీనులైవున్నారు. ఇంకొందరు లేటైతే తాయిలాలు దొరకవేమోనన్న ఆందోళనతో ఉరికురికి వచ్చి దొరికిన సీట్లలో కూలబడుతున్నారు. ఒకమూల విషణ్ణ వదనంతో సీతమ్మ కూచోని ఉంది. నాడు అశోకవనంలో శ్రీరామచంద్రుని కోసం వేచివున్న సీతమ్మకంటే ఆందోళనలో ఉంది ఈ ఆధునిక సీతమ్మ! ఆమె విషాదానికి ఎన్నో కారణాలున్నాయి. ఒక ప్రధాన కారణం ఆమె మాటల్లోనే... ''రామరాజ్యం దగ్గర పడ్తోంది. నాగపూర్లో మోగించిన నగారా ఢిల్లీ దాకా వినపడుతోంది. ఈ సమయంలో హన్మంతులు('డు'కాదు) మిన్నకుంటే ఎలా?'' అని వగస్తోంది సాక్షాత్తూ దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉరఫ్ 'సీతమ్మ!' ఆ ప్రశ్నలో అర్థముంది. తన రామునిపై భక్తి తప్ప హనుమంతుల వారికి ఆయన బలం ఆయనకి తెలియదట! పక్కనుండే జాంబవంతుని లాంటి వారు 'నువ్వు అంతటోడివి, ఇంతటోడివి' అని ఉబ్బేస్తే నాడు లంకకి లంఘించాడని పురాణగాథ. ఇటీవల ఒక కార్పొరేట్ల మీటింగ్ కెళ్ళిన 'సీతమ్మ' దాన్నే బయటికి తీశారు. ''మీరు హన్మంతుడి లాంటివారు. మీ శక్తి మీకు తెలియడం లేదు. మీరు పెట్టుబడులు పెట్టగలరు! పెట్టండి. ఎన్నో రాయితీలిచ్చాం. కార్పొరేట్ పన్నులు తగ్గించాం. బోలెడన్ని ఇన్సెంటివ్లిచ్చాం'' అయినా మీరు పెట్టుబడులు పెట్టకపోవడం ఏమి న్యాయం?'' అని వేడుకుంది. అక్కడితో ఆగలే! వారిని మెప్పించి ఒప్పించే ప్రయత్నం చేశారామె! ''మనది దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ. అనేక దేశాలు, పెద్దపెద్ద ఎమ్.ఎన్.సీలు మనవైపే చూస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఉబలాటపడుతున్నాయి. స్టాక్మార్కెట్లు ఉరుకులు పెడుతున్నాయి. రీటైల్ ఇన్వెస్టర్లు దానిపై నమ్మకంతో కోట్లు కుమ్మరిస్తున్నారు. హన్మంతునిలా మీ శక్తి మీరు తెలుసుకోండి. లేవండి! లేచి పెట్టుబడులు పెట్టండి!'' ఇలా కొనసాగిందావేడుకోలు.
కార్పొరేట్ పర్వంలో కిష్కిందకాండ
కార్పొరేట్లు మహాముదుర్లు. రాజకీయ నాయకులు చెప్పేవి తేలిగ్గా నమ్మరు. మీ ఇంటికొస్తే నాకేమి పెడతావ్? మాయింటి కొస్తే నాకేమి తెస్తావ్? అనేది వాళ్ళ నీతి, రీతి! పెట్టుబడులు పెట్టి ఎక్కడ అమ్ముకోవాలి? అనేది వీరి ప్రధాన ప్రశ్న. సీతమ్మ 'కష్టాలు' కార్పొరేట్ల పర్వంలో ఖాతరు చేసేవారెవరూలేరు. మోడీకి ఆ ఇద్దరే కాదు, అందరూ జాన్ జిగ్రీలేనైనా వంగతోట దగ్గరికొచ్చేసరికి 'బావా' అని పిలిచేవాళ్ళెవరూ లేరు. స్వాతంత్య్రానంతరం దేశంలో అవలంబించిన విధానాన్ని ఎడమకాలితో ఒక్క తన్ను తన్ని ఫక్తు కార్పొరేట్స్వామ్యానికి దారులు పరిచింది మోడీ ప్రభుత్వం. పాడియావులను ఎండబెడుతోంది. (ప్రభుత్వరంగ పరిశ్రమలను) ఒక్కొక్కటిగా కబేళా బాట పట్టిస్తోంది.
2019-20 ఆర్థిక సర్వే పత్రంలో ''ప్రయివేటీకరణ Ê సంపద సృష్టి'' అనే అధ్యాయం మార్గరేట్ థాచర్ కొటేషన్ ''స్వేచ్ఛా వాణిజ్యం అనేది స్వేచ్ఛలో ఒక కీలకాంశం'' అనే దానితో ప్రారంభమైంది. థాచర్ మాటలు 1979 నాటివి. థాచర్, ఆమె మాటలు ఏరకంగా తప్పో ప్రపంచంలో రుజువవుతోంది. వాటిని గుదిగుచ్చి థామస్ పిక్కెట్టి వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త లెందరో సోదాహరణంగా రుజువు చేశారు. 1950-80ల మధ్య సాపేక్షంగా సమానత్వం ఉన్న దేశాలన్నీ 80ల తర్వాత ఏవిధంగా అసమానత్వంలోకి జారుకున్నామో పిక్కెట్టి చెప్పారు. ముఖ్యంగా 1990ల తర్వాత రష్యాలో అసమానతలు ఎలా పెరిగాయో ఆయన రాసిన అంకెలు చూసి ప్రపంచం విస్తుపోయింది. ఇవన్నీ బీజేపీ పాలకులకు అనవసరమనుకుంటా!
కుక్కతోక పట్టుకుని ప్రయివేటీకరణ మంత్రం చదివి గోదావరిలో దూకారు. ఇప్పుడు దేశాన్ని ముంచారు. కార్పొరేట్లకు మునుపెన్నడూ లేనంతగా లాభాలు కట్టబెట్టారు. ప్రయివేటు పెట్టుబడులు, వినియోగం పెరుగుతాయనుకున్నారు. నికర ఎగుమతులు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూరుస్తాయన్నది వారి నమ్మకం. ప్రయివేటు పెట్టుబడి యొక్క జంతు ప్రవృత్తి (యానిమల్ స్పిరిట్స్)ని ఇదే రేగ్గొంటుతుందని ఆశపడ్డారు. ప్రభుత్వం నుండి మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందని కంపెనీలు, పొందే కంపెనీలుగా విడగొట్టి కార్పొరేట్ పన్నుల్లో తగ్గింపులిచ్చారు. వీటన్నిటి వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.45లక్షల కోట్లు లోటు వచ్చింది. బ్యాంకులు తిలోదకాలిచ్చిన (రైట్ ఆఫ్ చేసిన) కార్పొరేట్ లోన్స్ రూ.13లక్షల కోట్లు. ఇటీవల ప్రొడక్షన్లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పేర విదేశీ కంపెనీలతో పోటీలో నెగ్గుకురావడానికి భారతీయ తయారీరంగ పరిశ్రమలకు మరో రూ.1.97లక్షల కోట్లు (14 రంగాలకు) రాయితీ ప్రకటించింది. మన కార్పొరేట్ల వద్ద గుట్టలుగా డబ్బు కుప్పలున్నాయి. కాని పెట్టుబడులు పెట్టాలంటే లాభాల ''రేటు'' కోసం వెనకా ముందు ఆడుతున్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఛీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ అన్నారు. (మచ్చుకు కొన్ని కంపెనీల క్యాష్ రిజర్వులు చడండి.. రిలయన్స్ ఇండిస్టీస్ రూ.21,714కోట్లు, జె.ఎస్.డబ్ల్యు. స్టీల్ రూ.15,527కోట్లు, టి.సి.ఎస్. రూ.13,692కోట్లు, ఇన్ఫోసిస్ రూ.12,270 కోట్లు, వేదాంత రూ.7.148కోట్లు ఈ రకంగా 15 కంపెనీల వివరాలు బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెర్చ్ బ్యూరో విడుదల చేసింది. ఇన్ని చేసినా ప్రయివేటు పెట్టుబడులు చాలాకాలంగా మన ఆర్థిక వ్యవస్థలో పెరగడం లేదు. 2011లో దేశ జీడీపీలో 31శాతం నుండి 2020 నాటికి 22శాతానికి పడిపోయిందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2021 జులై లో 612 పెట్టుబడుల ప్రతిపాదనలొస్తే 2022 జులైకి అవి 118కి పడిపోయాయి. ఇవీ వాస్తవ పెట్టుబడులు కాదు సుమా! కేవలం ప్రతిపాదనలే! కరోనా కాలంలో అత్యంత లాభాలు దండుకున్న కార్పొరేట్లు తమ డబ్బును షేర్ మార్కెట్లకు తరలించడం మినహా భౌతికంగా పెట్టుబడులు పెట్టలేదు, కొత్త ఉపాధి దేశంలోకి రాలేదు. ఇవిగో పెట్టుబడులు, అవిగో ఉద్యోగాలు అంటూ మోడీ ఊరించినా, కేటీఆర్ ఆశలు గొల్పినా వాస్తవానికి అవి శుష్కవాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియాన్ ఎకానమీ (సీఎంఐఎ) లెక్క ప్రకారం మహమ్మారి దేశాన్ని దెబ్బతీసిన ఎడాది 2020-21లో 24,347 కంపెనీల నికర లాభం రూ.5.6లక్షల కోట్లు. 2021-22లో మొత్తం అమ్మకాల్లో 60శాతం అమ్మకాలున్న 3299ల నికర లాభం రూ.6.7లక్షల కోట్లు. అన్ని కంపెనీలవి కలిపితే రూ.8లక్షల కోట్లు దాటతాయి. కాని వీటన్నింటి నికర స్థూల ఫిక్స్డ్ ఆస్థులు మాత్రం దానిలో 2శాతం కూడాలేదు.
ఒక పక్క బంగారు గుడ్లు పెట్టే ప్రభుత్వరంగం భ్రష్టుపట్టిపోయింది. 1951లో ఐదు కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలతో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థలో 2019 నాటికి ఆ సంఖ్య 249కి చేరింది. ప్రభుత్వరంగం నష్టాలకి మారుపేరన్న ప్రచారం 1990ల నుండి దేశంలో మారుమోగింది. ఆ నష్టాలకి కారణం వాటి ''అసమర్థ యాజమాన్య'' పద్ధతులన్నారు. కానీ, అత్యంత లాభాలార్జించే పది కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమల లాభాలు రూ.1,07,949 కోట్లు. ఇవి మొత్తం ప్రభుత్వ పరిశ్రమల్లో 61.83శాతం. టాప్ పది నష్టాలార్జించే ప్రభుత్వరంగ పరిశ్రమల నష్టాలు రూ.29,751కోట్లు. మొత్తం నష్టాల్లో ఇవి 94శాతం. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలు చేకూర్చిన సొమ్ము ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ పన్ను, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, అప్పులపై వడ్డీ, డివిడెండ్ కలిపి రూ.4.96లక్షల కోట్లు. ఆ ముందు సంవత్సరం కంటే ఇది 31.14శాతం ఎక్కువ. (పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సర్వే నివేదిక)
మన దేశీయ మార్కెట్ కుంచించుకుపోయింది. గ్రామీణ మార్కెట్ మరీ ముడుచుకుపోయిందని నీల్సన్ ఐక్యూ అంచనా వేసింది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ పెరుగుదల రేటు మోడీ సర్కార్ ఊదరగొట్టినట్టు 7శాతం ఉండదు. ఐఎంఎఫ్ అంచనా 6.8 శాతం కాగా, ప్రపంచ బ్యాంకు అంచనా 6.5శాతం. ఈ సంస్థలన్నీ రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని దీనికి ప్రధాన సాకుగా చూపుతున్నాయి. ఈ దశలో పెట్టుబడులు పెట్టే 'అమాయకులా' కార్పొరేట్లు? మన పాలకులు 2014 సెప్టెంబర్లో 'మేకిన్ ఇండియా' అన్నారు. అంటే ఏ దేశంవాడైనా మన దేశంలో పెట్టుబడులు పెట్టి ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అదీ విజయవంతం కాలేదు. కారణం ప్రపంచం మాంద్యం అంచునుండటం. ఐఎంఎఫ్ అంచనాలో ప్రపంచ జీడీపీ 2021లో 6.2శాతం నుండి 2022లో 3.2శాతం గాను, 2023లో 2.7శాతం గాను ఉంటుందట!
ఈ లెక్కన భారతదేశంలో తయారు చేసిన సరుకులు ఎక్కడ అమ్ముకుంటారు? అందుకే పాలకుల హడావుడి తప్ప పెట్టుబడులు రావట్లేదు. ఉదాహరణకు మన తెలంగాణలో ఏ ఒక్క పారిశ్రామికవాడల్లో కొత్త పరిశ్రమలు రాలేదు గత 8-10 ఏండ్లలో. అనేకం మూతబడ్డాయి. భారత ప్రభుత్వం ద్వారా భారత ప్రజల్లో కార్పొరేట్లు, సారీ! కార్పొరేట్ హన్మంతులు సాగించిన కిష్కింద కాండ ఇది!
ఉద్యోగ పర్వంలో యుద్ధకాండ
మహాభారతంలోని 18 పర్వాలలో ఐదవది ఉద్యోగ పర్వం. దీనిలో కురుపాండవ యుద్ధ సన్నాహాలుంటాయి. దానికి ఉద్యోగపర్వం అని ఎందుకన్నారో తెలియదుకాని మన సందర్భంలో అది చక్కగా సరిపోతుంది. కార్పొరేట్లు లాభాల కోసం తెగబడ్డారు. పాలకులు వారికి అండగా నిలిచి కార్మికులపైనా రైతాంగంపైనా దాడిచేయడం విశ్వమంతా సర్వసాధారణం అయిపోయింది. ఇటీవల అమెరికాలోని అమెజాన్లో వివిధ స్థాయిల్లో యూనియన్లు ఏర్పడ్డాయి. సమ్మెలూ జరిగాయి. అప్పటి వరకు యూనియన్లను నిరోధిస్తున్న కె.ఎఫ్.సి. వంటి ఎన్నో సంస్థల్లో క్రిస్టమస్ ముందురోజు వరకు సమ్మెలు జరిగాయి. గ్యాలప్ అనే సంస్థ అంచనా ప్రకారం 65శాతం అమెరికన్లు యూనియన్లను అంగీకరిస్తున్నారట! ముఖ్యంగా యువతలో ఇది ఎక్కువగా ఉందట. యూనియన్ల ఏర్పాటును వ్యతిరేకించే యాజమాన్యాల పైనా, దిగజారుతున్న పని పరిస్థితుల మీద కార్మికులు ప్రతిఘటన సాగిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది.
దీనికి మనదేశం మినహాయింపు ఏమీకాదు. మనదేశంలో 14/15 కోట్ల రైతులు తమ జీవితాలు తెల్లారే మార్గమే లేదనుకుని ముప్పయ్యేండ్లుపాటు ఆత్మహత్యలే శరణ్యమనుకున్నారు. మోడీ సర్కార్ తెచ్చిన రైతు చట్టాలతో వ్యవసాయం దెబ్బతిని భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం రాగానే ఉత్తర భారతంతో మొదలై క్రమంగా దేశమంతా విస్తరించిన రైతు పోరాటం నేటి మన అనుభవం.
చిన్న ఉత్పత్తిదారులు - అది రైతులైనా, వృత్తిదారులైనా, చిన్న పరిశ్రమలైనా స్వాతంత్య్రానంతరం ఇవ్వబడ్డ రక్షణలన్నీ నేడు మోడీ పాలనలో కొండెక్కాయి. చేనేతకిచ్చిన సబ్సిడీలు, చిన్న పరిశ్రమలకిచ్చిన రకరకాల రిజర్వేషన్లు పోయాయి. తాజాగా హెయిర్కటింగ్లోకి అంబానీ ప్రవేశం చూస్తున్నాం. అందుకే యుద్ధం ప్రారంభమైపోయింది. ఎవరికీ తప్పించుకునే చాన్సేలేదు. విజయమా? వీరస్వర్గమా? రెండే ఆప్షన్లువున్నాయి కష్టజీవులముందు!
- ఆర్. సుధాభాస్కర్