Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్రమోడీ అధికార పర్యటన బీజేపీకి అనధికార ప్రచార యాత్రగా పరిణమించింది. ఏపీని పాలించే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఆయనకు బ్రహ్మరథం పడితే, తెలంగాణను పాలించే టీఆర్ఎస్ ప్రభుత్వం, వామపక్షాల నిరసనతో అచ్చమైన బీజేపీ యాత్రగానే మారింది. ఏ రోటి దగ్గర ఆ పాటలాగా సెంటిమెంటు అస్త్రంతో అక్కడ ఆంధ్రుల గొప్పతనాన్ని, ఇక్కడ తెలంగాణ ప్రజల వారసత్వాన్ని పొగిడేసి మెప్పించే ప్రయత్నం చేశారు మోడీ. తన సభకోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లుచేసి జనసమీకరణ భారం కూడా మోసిన జగన్ సర్కారు జోలికిపోకుండా తన ప్రభుత్వ ఘనతలు చాటుకోవడంతో సరిపెట్టారు. అదే తెలంగాణకు వచ్చేసరికి అడుగుపెట్టినప్పటి నుంచి ఆఖరి వరకూ రాష్ట్ర ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రిపైనా దాడులకే పరిమితమయ్యారు. ఆపరేషన్ ఫామ్‌హౌస్ అరెస్టులు, మునుగోడు ఎదురుదెబ్బతో గుండె చెదిరిన రాష్ట్ర బీజేపీ నేతలకు భరోసా ఇవ్వడానికి తంటాలు పడ్డారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగ కార్మికుల అరెస్టులమధ్య వేదికపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తిపై స్పందించలేదు గానీ తెలంగాణలో సింగరేణి గనుల ప్రయివేటీకరణపై దుష్ప్రచారం జరుగుతున్నదంటూ హడావుడి చేశారు. మొత్తంపైన చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో పరస్పర విరుద్ధ పోకడలు కనిపించినా సారాంశం మాత్రం బీజేపీ ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుడగలు గొప్పలు చెప్పుకోవడంగానే పరిణమించింది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర అదనంగా తోడైంది. ఈఘట్టంలో ఆయనను ముందుకు తెచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను తెలంగాణలో తమ పార్టీ పునరుజ్జీవనంపై కేంద్రీకరించానంటూ మొహం చాటేశారు. రెండుచోట్ల వామపక్షాలు మాత్రం మోడీ విధానాలకు, రాష్ట్రాల పట్ల ఆయన సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.
ఏపీలో విన్యాసాలు
ముందుగా ఏపీ సంగతి తీసుకుంటే... ఈ సమయంలో మోడీ పర్యటన జగన్ సర్కారు విశాఖ రాజకీయాలకు సానుకూల సంకేతాలు ఇస్తుందనే అభిప్రాయం బలంగా వచ్చింది. మూడు రాజధానుల పేరిట సాగుతున్న ప్రహసనంలో ఈ నగరం కేంద్ర బిందువుగా ఉంది. ఇటీవల పాలకపార్టీ ప్రేరణతో పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత చూశాం, జనసేన వారు మంత్రులపై దాడి చేయడం, ఆయన పర్యటన పట్ల పోలీసుల ప్రతికూలత తర్వాత ఆయన చెప్పుచూపిస్తూ ప్రసంగం చేయడం, చంద్రబాబు సంఘీభావంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమమంటూ ప్రకటించడం జరిగాయి. పోలీసుల వైఖరి ప్రభుత్వం ప్రతిపక్షాల కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదంటూనే బీజేపీని వ్యతిరేకించకుండా వీరు ఎలా ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేయగలరనేది సహేతుకమైన ప్రశ్న. తెలుగుదేశం, జనసేన కలసి పోవడమే గాక బీజేపీతోకూడా కూటమి ఏర్పాటుచేస్తాయని కథలు వినిపించాయి. బీజేపీ టీడీపీతో సంబంధం ఉండబోదని, పవన్ మాత్రం తమతో ఉంటాడని ఒకటికి రెండు సార్లు ప్రకటించింది. జగన్ కేంద్రంపై విమర్శలు చేయకుండా విధేయత ప్రదిర్శిస్తున్న నేపథ్యం ఉండనేవున్నా, రాజకీయంగా వంటరిగానే ఉంటామని వైసీపీ చెబుతూవస్తున్నది. ఏపీ రాజకీయంలో మూడు ప్రాంతీయపార్టీలు తమలో తాము తిట్టుకుంటూ బీజేపీకి మార్గం సుగమం చేస్తున్నాయనేది స్పష్టమైపోయింది. రాష్ట్రంకోసం కలసికట్టుగా కేంద్రంపై పోరాడటమనే ప్రసక్తి లేకుండాపోయింది.
బాబు అదృశ్యం... పవన్ ఆశాభంగం
విశాఖ ఘటనల తర్వాత గుంటూరుజిల్లా ఇప్పటం గ్రామంలో ఘటనలు వేడిని మరింత పెంచాయి. పలు కేసులూ అసహన వివాదాలు కూడా నడుస్తున్నాయి. టీడీపీ జనసేన మధ్య సంబంధాలే గాక బీజేపీ వాటిలో ఎవరితో ఉందీ, లేదు అనే తర్జన భర్జనలూ పెరిగాయి. ఎందుకంటే ఆ రెండు పార్టీలూ జగన్ ప్రభుత్వ తప్పిదాలనే విమర్శిస్తూ కేంద్రం పోకడల గురించి, రాష్ట్రాలపై దాడి గురించి మాట్లాడటమే మానేశాయి. పైగా అదంతా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనంటూ వాదిస్తున్నాయి. రామతీర్థం వంటి వివాదాలను పెంచడంలో బీజేపీకి తీసిపోని విధంగా వ్యవహరించాయి. ఆ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తే రాలేదు గనక తన వ్యూహం మార్చుకోవలసి రావచ్చని పవన్ అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అన్ని పార్టీలనూ ఒకతాటిపైకి తెస్తానని పవన్ అంటుంటే చంద్రబాబు బీజేపీ తమకు దగ్గరవుతున్నదనే కథనాలు ప్రచారంలో పెట్టారు. అదేమీ జరక్కపోగా బీజేపీ అధినేతలు జనసేనకే తమ పొత్తు పరిమితమని స్పష్టం చేస్తూవచ్చారు. అమరావతి రాజధానిగా ఉండాలనేది తమ విధానమని రాష్ట్రంలో బీజేపీనేతలతో చెప్పిస్తూనే కేంద్రం నుంచి అత్యున్నత నాయకత్వం నుంచి ఆ సూచనలు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇవన్నీ బీజేపీ ద్వంద్వ రాజకీయాలను కపటనీతిని తెలియజెప్పే ఉదాహరణలు. అయినా మోడీపై బీజేపీపై ఎనలేని గౌరవం ప్రకటించిన పవన్ కళ్యాణ్‌తో బంధం అట్టిపెట్టుకోవడానికి కూడా నాయకత్వం ఈ పర్యటనను అవకాశంగా చేసుకోవడంలో ఆశ్చర్యంలేదు. (చంద్రబాబు ఈ తేదీలలోనే తన తెలంగాణ యాత్ర పెట్టుకున్నారు). ఆఖరి నిముషంలో మొక్కుబడిగా పవన్‌తో భేటీని పీఎంవో ఖరారు చేస్తే అదేదో మహత్తర ఘటనగా మీడియాలు కొన్ని ప్రచారం చేశాయి. పవన్నే ముఖ్యమంత్రిగా ప్రకటించి టీడీపీ వైపు వెళ్లకుండా ఆపుతారని ఊహాగానాలు నడిచాయి. రాష్ట్ర ప్రభుత్వంపై అయిదు పేజీల నోట్ తయారు చేసుకుని వెళ్లిన జనసేనాని మోడీకి దాన్ని సమర్పించడం తప్ప పెద్దగా మాట్లాడినట్టు లేదు. స్పష్టత అంతకన్నా లేదు. 'రాష్ట్రానికి తెలుగువారికి మంచిరోజులు వస్తాయని' సినిమా పాట తరహాలో డైలాగు చెప్పి ఆయన వెళ్లిపోయారు. దాంతో ఇదంతా ప్రచారకాండేనని తేలిపోయింది. విశాఖ ఉక్కుపై జగన్‌ను పదేపదే ప్రశ్నించిన పవన్ తాను ఆ ముక్కయినా ప్రస్తావించినట్టు ఇప్పటి వరకూ చెప్పలేదు. మొదట భారీ కథలతో చెలరేగి తర్వాత హతాశులైన మీడియాలో వెంటనే పవన్ ఇచ్చిన పత్రాల ఆధారంగా జగన్‌పై చర్యలు తప్పవని కొత్తపల్లవి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై శాంతి భద్రతల వైఫల్యంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని పదేపదే కోరడం రాజ్యాంగ విరుద్ధమే గాక బీజేపీకి పెత్తనమిచ్చే వైఖరి.
మోడీకి జగన్ బహిరంగ సంకేతాలు
ఇక శనివారం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలో కవితలు పాటల ఆధారంగా రాజధాని తరలివస్తుందనే సంకేతాలు వదిలారు. తాము గతంలో ఇచ్చిన విజ్ఞప్తులు నెరవేర్చాలని కోరుతూ... విశాఖ ఉక్కు, పోలవరం ప్రత్యేక హోదా వంటివి (తెలుగులో) ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఇతర రాజకీయాలు తమకు అవసరం లేదంటూ మోడీతో ప్రత్యేక అనుబంధం నొక్కిచెప్పి జగన్ నమోనమః అంటూ రెండు చేతులూ జోడించేశారు. పూర్తి కాని అంశాలు ఇన్ని ఉన్నాయంటున్న జగన్, మోడీ ప్రత్యేక ప్రేమతో ఏపీకి అన్నీ ఇచ్చేస్తున్నారని పొగడ్డం మరో విపరీతం. మోడీ మాత్రం ఆయన కోరిన వాటిపై పెదవి మెదపలేదు. దేశాన్ని తామెంత గొప్పగా పాలిస్తున్నామో, తెలుగువారెంత గొప్పవారో పొగిడి మురిపించేందుకు ప్రయత్నించారు. విశాఖపట్టణం విశేష పట్టణం అంటూ సర్కారుకు సానుకూలత చూపించారు. విశాఖను చూస్తే వెంకయ్యనాయుడు, హరిబాబు గుర్తుకు వస్తారని తమ పార్టీ నేతలనే ప్రస్తావించారు తప్ప ఆఖరుకు తెన్నేటి విశ్వనాథం వంటివారినైనా తలవలేదు. పవన్ చెప్పినట్టు మంచిరోజులను సూచించే ప్రకటన ఒకటైనా చేయకుండానే హైదరాబాద్ బయిలుదేరారు.
కేసీఆర్‌పై యుద్ధ ప్రకటనే!
హైదరాబాద్‌లో దిగగానే మోడీ డబల్ ఫొటో మొదలైంది. ఆయనను స్వాగతించేందుకు కేసీఆర్ రాలేదు గాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. బేగంపేట విమానాశ్రయం దగ్గరే తొలి ప్రసంగంతోనే కేసీఆర్ సర్కారుపై యుద్ధ ప్రకటన చేశారు. నిజాం సర్కారు లాంటి ఈ ప్రభుత్వానికి మర్యాద లేదన్నారు. తనను తిట్టినా పర్వాలేదు గాని, తెలంగాణ ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హుంకరించారు. గవర్నర్‌ను అవమానించారన్నారు. ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వ అవినీతిని అంతం చేయకుండా వదిలేది లేదన్నారు. తెలంగాణలో బీజేపీ నేతలకు ఇప్పటి చీకట్లు తొలగిపోయి కొత్తవెలుగులు వచ్చేస్తాయని, చీకట్ల మధ్యనే కమలం వికసిస్తుందని ఓదారుస్తూ ఆపరేషన్ ఫాం హౌస్ దెబ్బలకు మందుపూసే ప్రయత్నం చేశారు. మునుగోడులో తమ వాళ్లు బాగా పోరాడారంటూ పొగిడారు. ఓడిపోయిన రాజగోపాలరెడ్డి వెన్నుతట్టి మరీ భరోసా ఇచ్చారు. సింగరేణి కాలరీస్‌ను ప్రయివేటీకరిస్తామనేది దుష్ప్రచారమనీ, 51శాతం వాటావున్న రాష్ట్రానికి తెలియకుండా తామేమీ చేయలేమని పదేపదే చెప్పారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా సింగరేణిపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెలరేగిపోయారు. తమాషా ఏమంటే బ్రహ్మాండమైన ఉక్కుఫ్యాక్టరీ ప్రయివేటీకరణపై నోరుమెదపని ప్రధాని, తెలంగాణలో అదేపనిగా ఆ సంగతి మాట్లాడటం. రామగుండం కర్మాగారం కూడా ఏడాది కిందనుంచి పనిచేస్తూ బాగా లాభాలు ఆర్థించిన విషయం రాష్ట్ర ప్రభుత్వం లెక్కలతో సహా విడుదల చేసింది. ఇక మర్యాదల విషయానికి వస్తే అందులో 11శాతం వాటా ఉన్నా ముఖ్యమంత్రిని ప్రధాని కార్యాలయం సంప్రదించకుండా ఆ శాఖా మంత్రి సమాచారం మాత్రమే పంపడంలో కేంద్రం మర్యాదేంటో తెలుస్తుంది. నిజానికి రెండు రాష్ట్రాలలోనూ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు అంటూ ఊదర గొట్టడమే గాని వాస్తవంలో అవి మూడోవంతు మాత్రమే పూర్తయిన పనులు. అది కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో! వీటిపై వదిలిన టీవీ యాడ్ ప్యాకేజీలలోనే ఈ సంగతి మనకు స్పష్టమవుతుంది. వీటితోనే ఏదో మహత్తరమైన మేలు జరిగిపోతున్నట్టు ఆర్భాటం చేయడం అర్థ రహితం. మరింత గట్టిగా పోరాడటమే అత్యవసరం. తెలుగు రాష్ట్రాలకూ దేశానికి కూడా అదొక్కటే మిగిలిన మార్గం.
- తెలకపల్లి రవి