Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాప్-27 సదస్సు ఈనెల 6న ఈజిప్ట్‌లోని శర్మ్ ఎల్షేక్ నగరంలో మొదలయింది. ఈ సదస్సు ఈనెల 18 వరకు జరుగుతుంది. ఈ సదస్సులో భారతదేశంతో సహా 197 దేశాలు పాల్గొంటు న్నాయి. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఖచీఖీజజజ) లోని సభ్యదేశాలు ప్రతి ఏటా నిర్వహించే వాతావరణ మార్పు సమావేశాలను కాప్ అని అంటారు. ఇప్పటివరకు 26 కాప్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఖచీఖీజజజ అనేది ఒక అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం. వాతావరణంలో హరితవాయువులను తగ్గించటం, వాతావరణ వ్యవస్థలో ప్రమాదకరమైన మానవ జోక్యాన్ని ఎదుర్కోడానికి ఈ ఒప్పందం జరిగింది.
ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు వినియోగదారుల్లో మొదటి స్థానం చైనా ఆక్రమిస్తే, రెండవ స్థానం భారతదేశం ఆక్రమిస్తున్నది. భారతదేశంలో 70శాతం విద్యుత్‌శక్తి ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతుంది. బొగ్గు వినియోగం పర్యావరణానికి ప్రమాదకరం. భూతాపానికి ప్రధాన కారణం బొగ్గు వినియోగమే. బొగ్గు భూగర్భం లోపలే ఉండాలి, బయట కాదని సైన్స్ చెబుతోంది. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో నిర్వహించిన కాప్ 26 సదస్సులో 2030 నాటికి విద్యుత్తు ఉత్పత్తిలో 50శాతం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చు కుంటామని, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అంటే 2070 నాటికి దేశంలో కర్బన ఉద్గారాలు సున్నా ఉంటాయి అన్నమాట.
ఇది ఇలా ఉంటే భారతదేశానికి చెందిన ప్రపంచ కుబేరుడు అదానీ బొగ్గు గనుల వ్యాపారం మాత్రం ''యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్'' ఒప్పందానికి విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించేలా ఉంది. దీనిపై పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. ఒక పక్క భారత్, చైనాలు పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెడుతుంటే, అదానీ గ్రూప్ ఉత్పత్తి చేసే బొగ్గును ఎక్కడికి ఎగుమతి చేస్తారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ''అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్'' భారతదేశం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాలలో దాని గనులను నిర్వహిస్తుంది. అదాని ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వ్యాపారం చేస్తే, 2030 నాటికి విద్యుత్తు ఉత్పత్తిలో 50శాతం పునరుత్పాదక వనరుల ద్వారా ఎలా సమకూర్చుకుంటాం? 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ ఎలా మారుతుంది? అదాని బొగ్గు వ్యాపారం కలగజేస్తున్న పర్యావరణ విధ్వంసం, ప్రజలను నుంచి ఎదుర్కొంటున్న నిరసనకు ఆస్ట్రేలియాలోని కార్మైకెల్ బొగ్గు గని, ఛత్తీస్ఘడ్ని కోర్బా, సర్గుజా, సూరజ్‌పూర్ జిల్లాల్లో హస్డియో అటవీ ప్రాంతం మంచి ఉదాహరణలు.
ఆస్ట్రేలియాలోని క్వీన్సాండ్ రాష్ట్రంలో గెలీలీ బేసిన్లో అదానీ సంస్థ కార్మైకెల్ బొగ్గు గనిని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 15మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుంది. అనంతరం ఉత్పత్తి సామర్థ్యాన్ని 27.5 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని అదానీ గ్రూపు భావిస్తోంది. ఈ బొగ్గు గని ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక పర్యావరణ వేత్తలు ''స్టాప్ అదానీ'' అనే పేరుతో ఉద్యమిస్తున్నారు. ఆస్ట్రేలియాలో సముద్రతీరాలకు చాలా ప్రాధాన్యం ఉంది. కానీ ఇప్పుడు బొగ్గువల్ల అవి దెబ్బతింటాయి. పోర్టుల కారణంగా తీరాల్లో బొగ్గు కనిపిస్తోంది. ఈ బొగ్గు గని వలన పర్యావరణ కాలుష్యము కలుగుతుంది.
ఈ కార్మైకెల్ బొగ్గు గని వలన
పర్యావరణానికి కలిగే నష్టాలు
1. నేల కాలుష్యం ఏర్పడి నేల నిస్సారం అవుతుంది. 2. ఈ బొగ్గు గని నుండి తొవ్విన బొగ్గును జల మార్గం ద్వారా ఓడలలో ఇతర ప్రాంతాలకు చేర వేస్తారు. సంవత్సరానికి 500ఓడల ద్వారా బొగ్గును ఇతర ప్రాంతాలకు చేరవేయడానికి అదాని అనుమతి పొందారు. ఈ విధంగా జలమార్గం ద్వారా బొగ్గును ఇతర ప్రాంతాలకు చేర వేసేటప్పుడు జల కాలుష్యం ఏర్పడుతుంది. సముద్ర జీవులు తమ ఉనికిని కోల్పోతాయి. 3. ఈ బొగ్గు గని వలన సంవత్సరానికి 4.6బిలియన్ల కార్బన్ కాలుష్యం వాతావరణంలోనికి విడుదలవుతుంది. ఇది వాతావరణ మార్పులకు దారితీస్తుంది. ఆస్ట్రేలియా ఇదివరకే వాతావరణ మార్పులకు గురి అయి కొన్ని ప్రాంతాలలో కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. 4. ఈ బొగ్గు గని కోసం అదాని 270బిలియన్ లీటర్ల భూగర్భ జలాలను 60ఏండ్ల పాటు ఉచితంగా వాడుకోవడానికి అనుమతి పొందారు. దీనివలన క్వీన్సాండ్ రాష్ట్రంలో భూగర్భ జలాలు అంతరించి పోయే అవకాశం ఉంది. 5. ఈ బొగ్గు గని వలన సన్నని ధూళి రేణువులు వాతావరణంలోకి విడుద లయి అక్కడ స్థానిక ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.
ఛత్తీస్‌ఘడ్‌లో అదాని బొగ్గు గనులు
ఛత్తీస్‌ఘడ్‌లోని కోర్బా, సర్గుజా, సూరజ్‌పూర్ జిల్లాల్లో హస్డియో అటవీ ప్రాంతం 170,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఒక ప్రసిద్ధ వలస కారిడార్. ఏనుగులు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి. ఇది మహానదికి అతిపెద్ద ఉపనది అయిన హస్డియో నది పరివాహక ప్రాంతం కూడా. దాదాపు 840 ఎకరాల దట్టమైన అడవులు నాశనమై, ఈ ప్రాంతంలోని జీవవైవిధ్యంపై ప్రభావం చూపుతాయి. 2009లో ఈ ప్రాంతాన్ని మైనింగ్ చేయకూడని ప్రాంతంగా (చీశీ-+శీ ్గశీఅవ) కేంద్రమే ప్రకటించి నప్పటికీ అదానీ అక్రయ మైనింగ్‌ను అడ్డుకోలేక పోయాయి.
హస్టియో అరణ్య ప్రాంతంలో రెండవ దశ మైనింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వడాన్ని నిరసిస్తూ 2022 ఏప్రిల్ 11న ఢిల్లీలో ఛత్తీస్‌ఘడ్ సదన్ ముందు ప్రదర్శన జరిగింది. కాప్-26 వంటి అంతర్జాతీయ సమావేశాలలో అడవి ప్రాంతాన్ని కార్బన్ సింకులుగా పెంచుతామని, శిలాజ ఇంధనాలను దశలవారిగా తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, మరోవైపు సుసంపన్న మైన జీవవైద్యం ఉన్న అడవులను నాశనం చేయాలని ఆదేశాలు ఇస్తున్నది. ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద ప్రమాణాలకూ, చిత్తశుద్ధిలేమికి నిదర్శనం.
ఇప్పటికైనా భారత ప్రభుత్వం కాప్- 26 సమావేశాలలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండి అదానీ వంటి పారిశ్రామికవేత్తల సొంత లాభాల కోసం జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని నిలువరిం చాలి. కాప్-27 సదస్సు ముఖ్య ఉద్దేశం భూతాపాన్ని తగ్గించడం. భూతాపం పెరగడానికి ప్రధాన కారణం బొగ్గు వినియోగమే. మరి ఈ కాప్-27 సదస్సులో భూతాపం తగ్గడానికి భారత ప్రభుత్వం ఏమి హామీ ఇస్తుందో వేచి చూడాలి.
- డాక్టర్ శ్రీధరాల రాము
సెల్:9441184667