Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక పరిణామాలను శాస్త్రీయంగా వివరించడం కన్నా తమ దోపిడీని సమర్ధించుకునే విధంగానే వివరించడానికి పాలకవర్గాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. అశాస్త్రీయమైన ఈ సైద్ధాంతిక వివరణలనన్నింటినీ ఒకదగ్గర చేరిస్తే అది ఒక 'అశాస్త్రీయమైన ప్రత్యామ్నాయ ఆర్థిక శాస్త్రం' అవుతుంది. దీనినే మార్క్స్ ''అసభ్య అర్థశాస్త్రం'' అన్నాడు. అయితే ఈ 'అసభ్య అర్థశాస్త్రానికి' కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆర్థిక పరిణామాలను తనదైన ''అసభ్య'' పద్ధతికి లోబడి అది వివరించడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి అసభ్య పద్ధతికి కూడా కట్టుబడకుండా పూర్తి అవకాశవాదంతో, కేవలం పాలకవర్గ దోపిడీని సమర్థించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆర్థిక పరిణామాలను వివరించడానికి తయారైతే అది ''అసభ్య'' దశ కన్నా దిగజారిపోతుంది. అప్పుడు దానిలో ఏమాత్రమూ నిజాయితీ ఉండదు. ప్రస్తుతం నయా ఉదారవాద కాలంలో అటువంటి ''నిజాయితీ లేని'' దిగజారుడుతనం కనిపిస్తోంది. దీనిని వివరించడానికి నేను మూడు ఉదాహరణలిస్తాను.
మొదటి ఉదాహరణ దారిద్య్ర రేఖకు సంబంధించినది. గ్రామీణ భారతంలో రోజుకు తలసరి 2400 కేలరీల శక్తి నిచ్చే ఆహారాన్ని పొందలేనివారు, పట్టణాలలో 2100 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందలేనివారు దారిద్య్ర రేఖకి దిగువన ఉన్నట్టు మన ప్లానింగ్ కమిషన్ 1973-74లో నిర్వచనం ఇచ్చింది. ఈ ప్రాతిపదిక సరైనదా కాదా అన్న చర్చను పక్కన పెడితే, కనీసం ఒక కొలవగలిగిన ప్రాతిపదికగా ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ దారిద్య్ర రేఖకు దిగువ ఎందరున్నారో అంచనా వేయడానికి నాలుగేండ్లకోమారు జాతీయ శాంపిల్ సర్వే నిర్వహిస్తారు. నయా ఉదారవాద కాలంలో మన దేశంలో ఈ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య పెరిగినట్టు ఈ శాంపిల్ సర్వేలు చాలా స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. (2017-18 సర్వే వివరాలను వెల్లడి కాకుండా ప్రభుత్వమే దాచిపుచ్చింది)
అయితే ప్లానింగ్ కమిషన్ దారిద్య్రం యొక్క నిర్వచనాన్నే మార్చేసింది. తలసరి ఆహార వినియోగాన్ని లెక్కలోకి తీసుకోడానికి బదులు వినిమయ ధరలసూచీని ప్రాతిపదికగా చేసింది. ఒకానొక సంవత్సరంలో కనీసస్థాయి కేలరీలు పొందడానికి అవసరమైన ఆహారపు ధరల స్థాయిని నిర్థారించింది. అప్పటి ధరల సూచికలోని పాయింట్లను దారిద్య్రరేఖకు ప్రాతిపదికగా నిర్ణయించింది. ఇక ఆ తర్వాత సంవత్సరాలలో ధరలసూచిక పాయింట్లలో వచ్చే మార్పులను బట్టి దారిద్య్రరేఖను మార్చుతూవస్తోంది. వాస్తవంగా ఆ పాయింట్లవద్ద లభించే ఆహారం ఎన్ని కేలరీల శక్తినిస్తోందో ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ధరలసూచికను లెక్కిస్తున్న తీరు మనకి తెలుసు. వాస్తవంగా పెరుగుతున్న ధరలను అది పూర్తిగా పరిగణనలోకి తీసుకోడం లేదు. ధరల పెరుగుదల ఎక్కువగా ఉంటోంది. ధరలసూచిక పాయింట్లు మాత్రం ఆ పెరుగుదలలో కొంత భాగాన్నే చూపిస్తున్నాయి. ధరల సూచిక పాయింట్ల ప్రాతిపదికన దారిద్య్రరేఖను నిర్ణయించినందువలన క్రమంగా ఆ పాయింట్ల వద్ద అంతకంతకూ తక్కువ కేలరీల ఆహారం లభిస్తోంది. తొలుత నిర్ణయించిన కేలరీల ప్రాతిపదిక స్థానంలో ధరలసూచికను ప్రాతిపదిక చేసినందువలన వచ్చిన ఫలితం ఇది. అయితే పాలకులు మాత్రం దీనిని చూడటానికి నిరాకరిస్తూ, దారిద్య్రం తగ్గిపోతోందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 1973-74తో పోల్చితే గ్రామీణ భారతదేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి శాతం 2011-12 నాటికి 56.4 నుండి 25.7కు తగ్గిందని, అదే పట్టణ ప్రాంతాలలోనైతే 49 నుండి 13.7కు తగ్గిందని, ఆ తర్వాత కాలంలో కూడా అదే ట్రెండ్ కొనసాగుతోందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కాని అదే సమయంలో ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం స్థానం నానాటికీ దిగజారుతూ 107కి చేరింది. (మొత్తం 120 దేశాలను పరిశీలించి ఆకలి సూచికను రూపొందించారు)
దేశంలో ఆకలి పెరిగిందని ఒప్పుకోడానికి బదులు ప్రభుత్వ ఆర్థికవేత్తలు ప్రజల స్థితిగతులు మెరుగుపడ్డాయి గనుకనే వాళ్ళు తీసుకునే ఆహారపు కేలరీల విలువ తగ్గిపోయిందన్న వాదనను ఎత్తుకున్నారు. ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడింది గనుకనే వాళ్ళు తమ బిడ్డల చదువు కోసం, కుటుంబ వైద్య అవసరాలకోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని, అందువలన వాళ్ళు తీసుకునే ఆహారపు కేలరీల విలువ తగ్గిపోవడం వారి జీవన ప్రమాణాల తగ్గుదలకు కాకుండా మెరుగుపడిందనడానికి సంకేతం అని వారు వాదిస్తున్నారు. వేరే ఏ దేశంలోనైనా, తలసరి ఆదాయం పెరిగితే అక్కడ ఆహారపు కేలరీల విలువ పెరుగుతోంది. మన దేశంలో కూడా ఆదాయాలు పెరిగిన సామాజిక తరగతుల ప్రజలు తీసుకునే ఆహారపు కేలరీల విలువ పెరుగుతోంది. కాని ఈ వాస్తవం మన అధికారిక ఆర్థికవేత్తలకు పట్టదు.
నిజానికి 2009-10లో చేసిన శాంపిల్ సర్వే ప్రకారం 2004-5తో పోల్చుకుంటే 28.3శాతం నుండి 33.5శాతానికి పేదరికం పెరిగింది. (ధరల సూచిక ప్రాతిపదికన) అదే కేలరీల ప్రాతిపదికన చూసినప్పుడు పేదరికం 69.5 నుండి 75.5శాతానికి పెరిగింది. అయితే అధికారులు ఆ శాంపిల్ సర్వే చేసిన ఏడాది కరువు వచ్చిందని, అందువలన ఆ సర్వే ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవడం కుదరదని ప్రకటించారు. నిజానికి 2009-10లో కరువు వచ్చినప్పటికీ ఆర్థిక వృద్ధి మొత్తం మీద 8.6శాతంగా నమోదైంది. వ్యవసాయ రంగంలోనైతే 1.5శాతం వృద్ధి నమోదైంది. అయినా, దారిద్య్రరేఖకు దిగువన ఉండేవారి శాతం పెరిగింది. కనీసపు కేలరీల ఆహారం పొందలేకపోయినవారి శాతం పెరిగింది. మన ఆర్థిక వేత్తలు ఒకవైపు దేశంలో ఆర్థికవృద్ధి నమోదైంది కాబట్టి అది పేదరికం తగ్గుదలకు సంకేతం అని వాదిస్తారు. మరోపక్క అలా ఆర్థికవృద్ధి నమోదైన సంవత్సరంలో వచ్చిన సర్వే ఫలితాలను మాత్రం ఒప్పుకోకుండా మళ్ళీ సర్వే చేయమని ఆదేశిస్తారు. వారిలో నిజాయితీ లేదనడానికి ఇదొక ఉదాహరణ.
ఇక రెండో ఉదాహరణ ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించినది. వ్యవసాయదారు లకు ఆ యా దేశాల ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలలో కొన్నింటిని ''మార్కెట్‌ను దెబ్బ తీసే సబ్సిడీలు'' గాను, మరికొన్నింటిని ''మార్కెట్‌ను దెబ్బ తీయని సబ్సిడీలు'' గాను ప్రపంచ వాణిజ్య సంస్థ పరిగణిస్తుంది. సంపన్న పెట్టుబడిదారీ దేశాలు (యూరపియన్ యూనియన్ దేశాలు, అమెరికా) తమ తమ వ్యవసాయ రంగాలకు నేరుగా నగదు రూపంలో ఇచ్చే సబ్సిడీలు మార్కెట్‌ను దెబ్బ తీయవని ప్రపంచ వాణిజ్య సంస్థ అంటుంది. అదే మన దేశంలో ఇచ్చే మద్దత్తు ధర గాని, ఇన్పుట్ సబ్సిడీలు (ఎరువులకు విత్తనా లకు ఇచ్చేవి) గాని మార్కెట్‌ను దెబ్బ తీస్తాయని, అందుచేత వాటిపై పరిమితులు విధించాలని అంటుంది. నిజానికి మన దేశంలో ఇచ్చే మద్దత్తు ధరలు చిన్నరైతు వ్యవసాయాన్ని నిలబెట్టడంలోగాని, ప్రజా పంపిణీ వ్యవస్థను కొనసాగించడానికి గాని ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
కానీ ప్రపంచ వాణిజ్య సంస్థ వాదన వేరేగా ఉంది. మద్దత్తు ధరలు ప్రకటించడం అంటే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడం అని, ఆ విధంగా జోక్యం చేసుకుంటే మార్కెట్లోని సమతూకం దెబ్బ తింటుందని అంటుంది. అయితే అమెరికా తన దేశంలోని కొద్దిమందిగా ఉండే రైతులకు ఇచ్చే 10,000 కోట్ల డాలర్ల నగదు సబ్సిడీ మాత్రం మార్కెట్ మీద ఏ ప్రభావమూ చూపదని అంటుంది. నిజానికి అమెరికాలో చాలా సంవత్సరాలలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన నగదు సబ్సిడీ విలువ కన్నా ఆ రైతులు ఉత్పత్తి చేసిన పంటల విలువ తక్కువగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ వాదన ప్రకారం చూసుకుంటే, వ్యవసాయ భూమి విస్తీర్ణం బట్టి ఇచ్చే ఆ నగదు సబ్సిడీ ఫలితంగా, అమెరికాలో అసలు ఎవరూ పంటలే పండించనవసరం లేదు. కాని ఆ విధంగా జరగలేదు కదా! ప్రభుత్వం ఇచ్చిన నగదు దన్నుతో ఆ రైతులు తమ పంటలను ఎక్కువగా పండించారు. భారతదేశంలో కూడా మద్దత్తు ధరలు, ఇన్పుట్ సబ్సిడీలు ఇక్కడ ఉన్న చిన్నచిన్న రైతులు నిలదొక్కుకుని వ్యవసాయోత్పత్తిని పెంచడానికి తోడ్పడతాయి. మరి అమెరికాలో ఇచ్చే సబ్సిడీ విధానం సరైనదని, ఇక్కడ సబ్సిడీ విధానం తప్పు అని ప్రపంచ వాణిజ్య సంస్థ ఎందుకు వాదిస్తోంది? కేవలం సంపన్న పెట్టుబడిదారీ దేశాల ప్రయోజనాలను కాపాడి వర్థమాన దేశాల వాణిజ్య ప్రయోజనాలను దెబ్బ తీయడమే దాని అసలు లక్ష్యం.
ఇక నా మూడో ఉదాహరణ మన ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ విధానం గురించి. మన దేశంలో రైతులకు కనీస మద్దత్తు ధర ఇవ్వడం నిలిపివేయాలని వాదించేవాళ్ళు చాలా కాలం నుండీ ఉన్నారు. అలా కనీస ధర గ్యారంటీ చేయడం వలన రైతులు ఆహార పంటలను ఎక్కువగా పండిస్తున్నారని, ఎక్కువ ఆదాయాలు ఆర్జించిపెట్టే ఆహారేతర, వాణిజ్య పంటలవైపు రైతులు దృష్టి పెట్టడం లేదని వాళ్ళు అంటున్నారు. ఒకవైపు ఆకలివున్న ప్రజానీకం సంఖ్య పెరిగిపోతూవుంటే రైతులు ఆహారేతర పంటలవైపు మళ్ళాలని వాదించడమే అర్థం లేనిది. ఆహారధాన్యాల నిలవలు పెరిగిపోతున్నాయి గనుక ఆహారేతర పంటల వైపు మళ్ళాలని చెప్పడం కూడా సరైన వైఖరి కాదు. ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోకుండా ఉండాలంటే ఈ దేశంలో ఆకలిగొన్న ప్రజానీకపు కొనుగోలు శక్తిని పెంచడం పరిష్కారం అవుతుందే తప్ప ఆహార పంటల సాగు మానుకోడం పరిష్కారం కాదు.
పోనీ, ఈ మేథావుల చెప్పినట్టు విని మన రైతులు ఆహార పంటలనుండి ఆహారేతర పంటలవైపు మారారే అనుకుందాం. అప్పుడు ఆ పంటల ధరలు పతనం కావు అని గ్యారంటీ ఏమైనా ఉందా? అలా ఆహారేతర పంటల ధరలు ఒక్కసారి పడిపోతే అప్పుడు ఈ రైతులను ఆదుకోడానికి మళ్ళీ మద్దత్తు ధరలు ప్రకటించాల్సివస్తుంది కదా?
రైతుల పంటలకు కనీస మద్దత్తు ధర ప్రకటించే విధానాన్ని ఎత్తివేయాలని వాదించేవాళ్ళు ప్రపంచ వాణిజ్య సంస్థ ఎజండానే మరో రూపంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రైతులను ఆహారపంటలవైపు నుండి మళ్ళించి తద్వారా దేశ ఆహార భద్రతను దెబ్బ తీయడామే వారి అసలు లక్ష్యం. అత్యధిక ప్రజానీకానికి ద్రోహం చేసే నయా ఉదారవాద విధానాలు తమ అసలు రూపాన్ని కప్పి పుచ్చుకోడానికి, తమ ఎజండాను సమర్థించుకోడానికి ఇటువంటి నిజాయితీలేని వాదనలను ఆర్థిక సిద్ధాంతాల పేరుతో ముందుకు తెచ్చే తాబేదార్లను ఉపయోగించుకుంటాయి.
- ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానువాదం)