Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దోచిపెట్టేటోళ్లను, దోచుకునేటోళ్లను వదిలిపెట్టం...'' అన్న ప్రధాని మోడీ సాబ్ ముచ్చట ఇంటుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా, దయ్యాలే వేదాలు వల్లించినట్టుగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను పాత ఇనుప సామానును కిలోల లెక్క తూకమేసి అమ్మినట్టు కార్పొరేట్లకు కట్టబెడుతున్నదెవరో జగమెరిగిన సత్యమే. వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా అన్నీ అందుతాయనే సామెతకు మోడీ సర్కారు తీరే నిదర్శనం. అయినోడి ఆకుల్లో కానోడి కంచాల్లో వడ్డించినట్టుగా దేశ సంపదను అంబానీ, ఆదానీలకు అప్పనంగా కట్టబెడుతున్నదీ తెలిసిందే. మోడీ మహాప్రభువు ఏలికలో అదానీ సంపద 150 బిలియన్ డాలర్లకు చేరువై ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడుగా నిలిపింది. అరె రెక్కలు, ముక్కలు జేసుకుని రేయింబవళ్లు కష్టపడ్డా నెలాఖరుకొచ్చేసరికి పూటగడిచేది కష్టమవుతున్న గీ సమయంలో గాయన సంపద గంత ఎట్ట పెరుగుతుందో అర్థం కాక సామాన్యులు తలలు పట్టుకోబట్టే! దేశమంతటా ఒక్కసారే ప్లేట్లు కొడితే ఆ సౌండ్కు కరోనావైరస్ చెవుల్లోకెళ్లి రక్తం కారి చనిపోతుందన్నట్టుగా... ఇండ్ల ముందట ఒకేసారి దీపాలు పెడితే ఆ వెలుతురులో కరోనా మాడిమసైపోతుందన్నట్టుగా మోడీసాబ్ వల్లించి నలుగురిలో నవ్వులపాలైన సంగతీ తెలిసిందే. సారు గా సంగతి మర్చపోయినట్టుంది. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి అంధవిశ్వాసాల మీద కూడా మరోమారు లెక్చర్ ఇచ్చిండు.
- అచ్చిన ప్రశాంత్