Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుగోడు ఓటమితో బీజేపీ లొల్లి బందైపోయింది. అన్ని విషయాల్లో గీత దాటి కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఓటమిని ఒకరిపై మరొకరు తోసేకుంటున్నారు. డీజేలను తలపించేలా మాట్లాడే బీజేపీ నేతలు మునుగోడు తర్వాత మౌనమేలనోయి అంటూ కూనిరాగాలు తీస్తున్నరు. మునుగోడుకు ముందు ఎంతో హడావుడి, కోలాహలంగా ఉండే కార్యాలయం కొంతమేర కలతప్పింది. ఉప ఎన్నికలో గెలిచి ఇతర పార్టీలకు చుక్కలు చూపించాలనే ప్లాన్ కాస్త రివర్సయింది. ఎట్లాగైనా తెలంగాణాను ఎలాలనే ఆశకు తొలిమెట్టులోనే ఆటంకం ఎదురైంది. అయితే కొత్త కుట్రలకు పావులు కదుపుతున్నట్టు కనపడుతున్నది. కొత్త మిత్రుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న చర్చలకు తెరలేపిన నేపథ్యంలో తెలంగాణలోనూ పాత మిత్రులను మేల్కొలిపేందుకు చక్రం తిప్పుతున్నది. అందులో భాగంగా టీటీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను పెట్టి, బీసీలను మచ్చిక చేసుకోవడం ద్వారా మళ్లీ సైకిల్‌ను పరుగు పెట్టించాలని భావిస్తున్నారు. తద్వారా టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని ఆ పార్టీ పునాది కలిసొచ్చేలా మరో కుట్రకు పాల్పడుతున్నది. మునుగోడులో బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం ద్వారా కాషాయం కమిలిపోయింది. ఇదే ఒరవడి భవిష్యత్తులో కొనసాగితే కమలం పువ్వు వికసించడం కష్టమే. అందుకే తెలంగాణ పల్లెల్లో కాస్తో కూస్తో మిగిలివున్న సైకిల్ ప్రభావాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కమలనాథులు రహస్య మంతనాలు మొదలు పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.
- గుడిగ రఘు