Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెల్లారింది లెగండో... కొక్కరోక్కో... మంచాలింక దిగండో... కొక్కరోక్కో...' అని చెవిలో ఇల్లు కట్టుకుని అరిచినా హైదరాబాద్లోని బుడతలు పొద్దున్నే లేవలేక పోతున్నారు. చలికి దుప్పటి ముసుగుతున్ని మరీ పడుకుంటున్నారు. ఆ దెబ్బకి బడికి ఆలస్యంగా వెళ్లటం... ఆ తర్వాత గోడ కుర్చీలాంటి పనిష్మెంట్లు షరా మామూలైపోతున్నాయి. చలి పులి అనేది పోరలతో ఇలా ఓ ఆట ఆడుకుంటున్నది. కానీ ఇదే చలికాలంలో కొంపల్లో వేడి రాజుకుంటున్నది. ఈ మధ్య నిత్యావసరాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు జనం జేబులకు చిల్లులు పెడుతున్నాయి. పావుకిలో రూ.ఐదు లేదంటే పది రూపాయలుండే కూరగాయల ధరలు ఇప్పుడు ఇరవైలు, ముప్పైలు దాటి ఏకంగా నలభైపైన్నే సెటిలయ్యాయి. పాలు, పెరుగు ధరలు నానాటికి పెరుగుడే తప్ప తరుగుడు లేకపాయే. ఇగ చలికాలం కాబట్టి పిల్లలకు వేణ్నీళ్లతో స్నానం చేయిద్దామని గ్యాస్ స్టవ్ దగ్గరకు పోతే దాని ధర గుర్తొచ్చి గుండె గుభేల్మంటోంది. బియ్యం, పప్పులు, ఉప్పుల ధరలు సరేసరి. ఈ క్రమంలో చలికాలంలో సైతం సగటు మనిషిని వంటిట్లో ధరల పొగలు సెగలు కక్కిస్తున్నాయి. అందుకే ప్రధాని చెప్పిన ''అచ్చే దిన్'' ఏమోగానీ... జనానికి ''చచ్చే దిన్'' వచ్చాయి. ఇటీవల టీ-20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓడిన తర్వాత... ప్రధాని మోడీని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కలిస్తే... 'మీరు వరల్డ్ కప్ తెచ్చారా..? అని మోడీ అడిగితే, మీరు అచ్చేదిన్ తెచ్చారా...' అంటూ కోహ్లీ అడిగినట్టు ఓ వ్యంగ్య వీచికను తయారు చేసి నెట్టింట్లో వదిలి ఫ్రస్టేషన్ తీర్చుకున్నారు మన జనాలు...
-బి.వి.యన్.పద్మరాజు