Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవంబరు 8న అమెరికా పార్లమెంటు, రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. పదిహేనవ తేదీ మంగళవారం నాటికి కూడా లెక్కింపు పూర్తి కాలేదు. అక్కడ అనుసరిస్తున్న ఓటింగ్, లెక్కింపు విధానాలతో ఫలితాల ఖరారు ఎక్కువ రోజులు తీసుకుంటున్నది. పార్లమెంటు దిగువసభలో 435 స్థానాలకు గాను 218 తెచ్చుకున్నవారికి స్పీకర్ పదవి దక్కుతుంది. తాజా వివరాల ప్రకారం రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 206 స్థానాలతో ఉన్నారు. రిపబ్లికన్లకు మెజారిటీ రానుంది. వంద సీట్లున్న ఎగువసభ సెనేట్‌లో ఇద్దరు ఇతర పార్టీల వారి మద్దతుతో డెమోక్రటిక్ పార్టీ బలం 50 కాగా రెండవసారి ఎన్నిక జరగాల్సిన అలాస్కా సీటు రిపబ్లికన్ పార్టీకి కచ్చితంగా దక్కుతుంది కనుక దానికి 50 సీట్లు వచ్చినట్లుగా పరిగణిస్తున్నారు. డెమోక్రాట్లకు మెజారిటీ వచ్చినందున అక్కడి ఓటర్లు కూడా రిపబ్లికన్లను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. ఉపాధ్యక్ష స్థానపు ఓటుతో డెమాక్రాట్లకు 51 ఓట్లతో మెజారిటీ ఖాయమైంది. ఇక 50 గవర్నర్ పదవులకు గాను ఎన్నికలు జరిగిన 36చోట్ల రిపబ్లికన్లు రెండు కోల్పోయి 25రాష్ట్రాలను కైవసం చేసుకోగా, డెమోక్రాట్లు అదనంగా రెండు తెచ్చుకొని 24 చోట్ల పాగావేశారు. మరొక ఫలితం తేలాల్సి ఉంది.
ఓట్ల లెక్కింపు సరళిని చూసిన అధ్యక్షుడు జో బైడెన్ గత బుధవారంనాడు చేసిన వ్యాఖ్యలు ఓటమిని పరోక్షంగా అంగీకరించటమేగాక రిపబ్లికన్లతో సఖ్యతకు సిద్దమే అనే సంకేతాలిచ్చాడు. అంచనాలకు మించి డెమోక్రటిక్ పార్టీ మెరుగ్గా ఉన్నందుకు ప్రజాస్వామ్యానికి శుభదినం, రిపబ్లికన్ల గాలి వీస్తుందన్న మీడియా, ఎన్నికల పండితులు చెప్పిందేమీ జరగలేదు అని జో బైడెన్ చెప్పాడు. ఎన్నికలకు ముందు దిగజారిన జో బైడెన్ పలుకుబడి కారణంగా డెమోక్రటిక్ పార్టీకి తగలనున్న ఎదురు దెబ్బల గురించి అందరూ విశ్లేషణలు చేశారు. రద్దయిన దిగువ సభలో డెమోక్రటిక్ పార్టీకి 220, రిపబ్లికన్ పార్టీకి 212, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రిపబ్లికన్లకు మెజారిటీ ఖరారైంది. ఓటింగ్ సరళి ప్రకారం రెండు పార్టీల తేడా తొమ్మిది సీట్లు ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల చరిత్రను చూసినపుడు ఏ పార్టీ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకొని అధికారానికి వస్తే రెండేండ్ల తరువాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షం మెజారిటీ సాధించటం ఒక ధోరణిగా ఉంది. ఈ కారణంగానే లెక్కింపు పూర్తిగాక ముందే అవన్నీ మరిచిపోదాం అన్నట్లుగా జో బైడెన్ మాట్లాడటం మొదలు పెట్టాడు. రిపబ్లికన్లతో కలసి పనిచేసేందుకు నేను సిద్దపడ్డాను, రిపబ్లికన్లు నాతో కలసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఓటర్లు స్పష్టం చేశారని కూడా చెప్పాడు.
పార్లమెంటు మీద దాడిచేయించిన డోనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదాన్ని సమర్థించిన అనేక మంది ''మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్)'' రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో ఓడిపోవటం ఒక్కటే బైడెన్‌కు ఊరటనిచ్చినట్లు కనిపిస్తోంది. సెప్టెంబరు నెలలో ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీని డోనాల్డ్ ట్రంప్, అతని మద్దతుదార్లు, అమెరికాకు అగ్రస్థానం అనే శక్తులు నడుపుతున్నందున దేశానికి ఇది ముప్పని వర్ణించిన బైడెన్ ఇప్పుడు అదే పార్టీతో కలసి పని చేస్తానని, మద్దతు కావాలని కోరటం డెమోక్రాట్ల రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు. రిపబ్లికన్ పార్టీ మొత్తంగా మితవాద శక్తులతో కూడినప్పటికీ దానిలో మాగా రిపబ్లికన్లు పచ్చి మితవాద ఫాసిస్టు, దురహంకార శక్తులు.
ఎన్నికల్లో ఓడినప్పటికీ రోజురోజుకు పెరుగుతున్న మాగా రిపబ్లికన్ల మీద ఒక కన్నేసి ఉంచాలని ఎఎఫ్ఎల్-సిఐఓ కార్మిక సంఘం అధ్యక్షురాలు లిజ్ షులర్ హెచ్చరించారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్థారిస్తుందని అందువలన కార్మికులు లెక్కింపును జాగ్రత్తగా అనుసరించాలని పిలుపునిచ్చారు. వారు ప్రజాస్వామ్యానికి ప్రమాదకారులని చెప్పారు. అబార్షన్ హక్కు గురించి రాష్ట్రాలకు వదలి వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వలన అనేక చోట్ల అబార్షన్ హక్కుకు మద్దతు ఇచ్చిన డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చారని షులర్ చెప్పారు. ఈ శక్తులు ఓడటం వారి పట్ల అమెరికా ఓటర్లలో ఉన్న ఆందోళన, అడ్డుకోవాలనే తపనకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆర్థిక సవాళ్లు, గాస్, ఆహార అధిక ధరలు రిపబ్లికన్లవైపు ఓటర్లను నెడతాయని సాధారణ విశ్లేషణలు వెలువడినా మితవాద శక్తుల అజెండాను కూడా కార్మికులు తీవ్రమైనదిగా పరిగణించిన కారణంగానే మాగా శక్తులను ఓడించారు. యువత, మహిళలు, ఆఫ్రికన్-అమెరికన్లు, మొత్తంగా కార్మికవర్గం తమ హక్కుల రక్షణకు, ఓటింగ్‌కు ముందుకు వచ్చిన కారణంగానే రిపబ్లికన్లకు చాలా మేరకు అడ్డుకట్ట పడింది. మాగా రిపబ్లికన్లకు తీవ్ర ఎదురుదెబ్బలు తగిలినా వారి నేతగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ పట్టు పార్టీ మీద ఇంకా ఉంది, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులలో 300 మందికి ట్రంప్ మద్దతు ఉంది. వారి మద్దతుతో 2024 ఎన్నికల్లో తిరిగి తాను పోటీ చేస్తానని చెబుతున్నాడు.
ఈ ఎన్నికలు అమెరికా చరిత్రలో ఖర్చు అంశంలో కొత్త రికార్డును సృష్టించాయి. ఓపెన్ సీక్రెట్స్ అనే సంస్థ అంచనా ప్రకారం 1670 కోట్ల డాలర్ల ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మన కరెన్సీలో ఇది రూ.1,37,000 కోట్లకు సమానం. ఇది ఎన్నికలకు వారం ముందు అంచనా, అనధికారికంగా అనేక మంది చేసిన ఖర్చు దీనిలో లేదు. పార్టీల అభ్యర్థుల ఎంపిక నుంచే డబ్బు ప్రవాహం మొదలవుతుంది. గత ఎన్నికల్లో పార్టీ వెలుపలి బృందాలు 160 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే ఇప్పుడు అది 190 కోట్లకు పెరిగిందని అంచనా. రకరకాల పేర్లతో ఖర్చు చేస్తారు. జనాభాలో కేవలం 0.0003శాతం ఉన్న బిలియనీర్లు ఎన్నికల ఖర్చులో పదిశాతం డాలర్లు ఖర్చు చేస్తారని అంచనా. ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచినట్లు రెండు దశాబ్దాల సమాచారాన్ని క్రోడీకరించిన ఓపెన్ సీక్రెట్స్ సంస్థ పేర్కొన్నది. పార్లమెంటుకు పోటీ చేసి ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన వారు 71 నుంచి 98శాతం వరకు గెలిచినట్లు తేలింది.
సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి లేదు. బాలట్ పత్రాలనే వాడుతున్నారు. పోలింగ్ తేదీకి ముందే ఓట్లు వేసే అవకాశం కూడా ఉంది. మన దగ్గర విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బాలట్ మాదిరి ఏ ఓటరైనా వేయ వచ్చు. ఇమెయిల్ ద్వారా ఓటు వేసి తరువాత బాలట్ పత్రాన్ని పోస్టు ద్వారా పంపుతారు. ఈ కారణంగానే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వారాల తరబడి సాగుతున్నది. అరిజోనా రాష్ట్రంలోని మరికోపా కౌంటీలో ఈ ఏడాది 2,90,000 పోస్టల్ బాలట్లు వచ్చాయి. వాటి మీద ఉన్న సంతకాలు నిజమైనవా కాదా అన్నది సరి చూసేందుకు ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. పోలింగ్ ముగిసిన తరువాత కూడా వచ్చే పోస్టల్ బాలట్లను పరిగణనలోకి తీసుకుంటారు. నెవడాలో పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తరువాత వచ్చే పోస్టల్ బాలట్‌ను తీసుకొని లెక్కిస్తారు. ఎన్నికల అక్రమాలకు అమెరికా అతీతమేమీ కాదు. గతంలో అలాంటి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నికల నిబంధనలు అన్ని చోట్లా ఒకే విధంగా ఉండనవసరం లేదు, ప్రతి రాష్ట్రం తనదైన నిబంధనలు రూపొందించుకోవచ్చు.
వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పచ్చిమితవాద శక్తులకు ఎదురు దెబ్బలు తగిలాయి. కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడి గెలిచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఓహియోలో ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగా 33 రాష్ట్ర అసెంబ్లీ సెనెట్ సీట్లకు గాను 1951 తరువాత తొలిసారిగా రిపబ్లికన్లు 26 సీట్లు తెచ్చుకున్నారు. సౌత్ కరోలినాలో కూడా తొలిసారిగా ఇలాగే మూడింట రెండువంతుల సీట్లు తెచ్చుకున్నారు. డెమోక్రాట్లకు పట్టున్న న్యూయార్క్ రాష్ట్రంలో ఇలాంటి అక్రమాల కారణంగానే ఈ సారి నలుగురు రిపబ్లికన్లు పార్లమెంటుకు అదనంగా గెలిచారు. 2020 అధక్ష ఎన్నికల లెక్కింపు సందర్భంగా కుట్ర వార్తలు వచ్చాయి. తొలుత రిపబ్లికన్లకు ఎక్కువగా పడినట్లు భావిస్తున్న బాలట్ బాక్సులు రావటం, తరువాత డెమోక్రాట్లకు పడిన బాక్సులు రావటంతో అనుమానాలు తలెత్తాయి. కొన్ని వారాల ముందే పోస్టల్ బాలట్స్ వేయవచ్చు గానీ, వాటిని ముందుగా లెక్కించటానికి వీలులేదు. కొన్ని చోట్ల పోస్టల్ బాలట్లే ఎక్కువ. జార్జియాలో 50శాతం ఓట్లు రానట్లయితే, ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నవారి మధ్య రెండోసారి ఎన్నిక జరుపుతారు. అక్కడి రెండు సెనెట్ స్థానాలకు డిసెంబరు 6న ఎన్నికలు జరుగుతాయి. అలాస్కా రాష్ట్రంలో పార్టీలకు గుర్తింపు లేదు. పార్టీలు కాండిడేట్లను నిలిపినా వారు స్వతంత్రులుగానే ఉంటారు. ఎన్నికల తరువాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దానికి ఎన్నివారాలైనా పట్టవచ్చు. రాష్ట్రాల అసెంబ్లీలను మొత్తంగా చూస్తే డెమోక్రాట్లే ఎక్కువ మంది ప్రతినిధులను కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ రాష్ట్రాలల్లో గవర్నర్లు రిపబ్లికన్లు ఎన్నికయ్యారు.
రిపబ్లికన్ల గాలిని అడ్డుకున్నప్పటికీ అమెరికా కార్మికవర్గానికి వారి నుంచి ఉన్న ముప్పును తక్కువ అంచనా వేయ కూడదు. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్నందున కార్మిక అనుకూల ప్రతిపాదనలను అడ్డుకొనే అవకాశం ఉంది.ఆ మెజారిటీని ఆసరా చేసుకొని బైడెన్, కుటుంబ సభ్యులు, డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల మీద విచారణల పేరుతో వేధింపులకు పాల్పడి తమ అజెండాను ముందుకు తీసుకుపోవచ్చు. జడ్జీల నియామకాలకు ఆటంకం కల్పించవచ్చు. ట్రంప్ పిలుపుతో పార్లమెంటు మీద దాడిచేసిన ఉదంతంలో ట్రంప్, పార్టీ వారి మీద ఉన్నకేసులను నీరుగార్చేందుకు పూనుకుంటారు. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకొనేందుకు ఇప్పటి నుంచే పూనుకోవాలని కొందరు సూచిస్తున్నారు. అధికారంలో బైడెన్ ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమాలు లేకుండా పురోగామి అజెండాను అమలు జరిపే అవకాశం ఉండదు. నేరాలను రిపబ్లికన్లు పెద్ద అంశంగా ఎన్నికల్లో ముందుకు తెచ్చారు. సర్వేల ప్రకారం అది ప్రధాన అంశమని కేవలం పదకొండుశాతం మాత్రమే పేర్కొన్నారు. ఆర్థికం, అబార్షన్లు, ప్రజాస్వామ్యం ప్రధాన అంశాలుగా చూశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు వెల్లడించాయి. పాఠశాల కమిటీల్లో రాజకీయాలను చొప్పించిన వారిని, తిరోగామి భావాలు, పుస్తకాలను రుద్దేందుకు, ప్రయివేటీకరణకు మద్దతు ఇచ్చిన వారిని వారిని ఓడించారు. అమెరికాలో ఎవరు గెలిచినా తమ ప్రయోజనాల రక్షణకు కార్మికులకు పోరుబాట తప్ప మరొక మార్గం లేదు. ఫాసిస్టు, పచ్చిమితవాద శక్తులు ఓటమి చెందటం తాత్కాలిక ఊరటతప్ప పరిష్కారం కాదు. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288