Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నా హీరో కృష్ణా!
నీవు తెలుగువారందరికీ సూపర్స్టార్వి. మాకంటే ఇరవైయేండ్లు ముందు పుట్టావ్. పదేండ్ల నుండి మేం నీ సినిమాలు చూస్తూనే ఉండేవాళ్ళం.
అంతకు ముందు ఆడుకునేటప్పుడు మా మగ పిల్లలంతా చీపురుపుల్లలతో, తాటిమట్ట లతో కత్తియుద్ధాలు, గధాయుద్ధాలే చేసేవాళ్ళం. నీ సినిమాలు చూసాకే డిష్యూం... డిష్యూం.... ఫైట్లు, చెట్ల చాటుకెళ్ళి బొమ్మ తుపాకీలతో కాల్చుకోవడం, చిత్ర విచిత్రంగా పిల్లిమొగ్గలు వేయడం నేర్చుకున్నాం. మా యాక్షన్ సీన్లు చూసి ఆడపిల్లలు పగలబడి నవ్వేవాళ్ళు తెలుసా! గూఢచారి 116, జేమ్స్‌బాండ్ అంటే నువ్వే కదా.
'అసాధ్యుడు' సినిమాలో నీవు వేసిన అల్లూరి సీతారామరాజు పాత్రే ఆలంబనగా ఆ తర్వాత రంగు రంగుల సినిమా స్కోప్గా తీసావు. అసలు సీతారామరాజు నడయాడిన మన్యం కొండిపాంతాల్లో నీవు సాహసంగా సినిమా తీసావని అప్పుడు మేం కథలు కథలుగా చెప్పుకున్నాం.
అంతకు ముందే నీవు మోసగాళ్ళుకు మోసగాడు చిత్రం కోసం రాజస్థాన్ ఎడారులకెళ్ళి షూటింగ్ చేసావు కదన్నా! అందుకే నిన్ను డాషింగ్ అండ్ డేరింగ్ హీరోగా పిలుచుకున్నాం.
'అసాధ్యుడు' దర్శక నిర్మాతలు రామచంద్రరావు, నెల్లూరు కాంతారావులు ప్రజానాట్యమండలి వారు కదా! అన్నట్టు డాక్టర్ రాజారావు దర్శకత్వంలో కొడాలి గొపాల్రావు రచన 'ఛైర్మన్' నాటకంలో నీవే హీరో మూర్తిగా నటించావటగా... అవున్లే నీలో కూడా అదే క్రమశిక్షణ.
'ప్రజానాయకుడు' సినిమాలో నాగభూషణం ప్రతినాయకుడైతే అసలు నాయకుడు రిక్షా కార్మికుడిగా నీవేగా, అంతేకాదు ఈనాడు రాజకీయ చిత్రంలో పార్టీ ఫిరాయింపుల వాళ్ళని పట్టుకుని రాజకీయ వ్యభిచారం అంటే ఇదే కాదా? అని ప్రశ్నించడం ఇప్పటికీ ఓ గుణపాఠమే.
కుటుంబ కథాచిత్రాలకు నీవేమన్నా తక్కువ తిన్నావా... సాక్షిలో నీవు నటించిన అమాయకపు గ్రామీణ యువకుని పాత్రలో ఎంతగా ఒదిగిపోయావు! నిజంగా ఆ పాత్ర ప్రభావం ఎన్ని పాత్రల్లో ప్రతిబింబించిందో...
ఎ.వి.ఎం.వారి 'పుట్టినిల్లు-మెట్టినిల్లు'లో మరో హీరో శోభన్‌బాబు ఉన్నా చెల్లెలు మీద ప్రేమ ఉన్న అన్నగా, భార్యమీద ప్రేమ ఉన్న భర్తగా, తండ్రి మంచితనానికి తనయునిగా నటించి అందరి అభిమానాన్ని చూరగొన్నావుకదా..!
నీకో విషయం తెలుసా అన్నా! నీలోని మంచితనమే నీ నటనలో ప్రతిబింబిస్తుందనడానికి అలాంటి పాత్రలెన్నో తార్కారణం. కపటం, మోసం తెలియవు గనుక నీకు అలాంటి పాత్రలు నటించడం సాద్యం కాకపోవచ్చు.
నీ సహచరి విజయనిర్మల దర్శకత్వంలో మీనా చిత్రం చేసినా, దేవదాసు చిత్రంలో నటించినా నీకే చెల్లింది. నీలో వృత్తి నిబద్ధతే కాదు, నీవు స్త్రీలకు, స్త్రీల పనికి ఇచ్చే గౌరవం కూడా అప్పుడే తెలిసింది. నీ ప్రోత్సాహం లేకుండానే ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళగా విజయనిర్మలమ్మకు గుర్తింపు వచ్చేదా..?
ఇప్పుడు ఓ హీరో సినిమా విడుదల కావాలంటే ఒక్కోసారి రెండేండ్లకు పైగా పడుతుంది. మా అన్న హీరో కృష్ణ సినిమాలు ఒక ఏడాదిలో 18 విడుదలయ్యాయంటే ఎవ్వరూ నమ్మడం లేదు, అందుకు నీవిచ్చిన సమాధానం వింటే వళ్ళు పులకరిస్తుంది.
'సినిమా అంటే వందల మందికి పని. అదో ఉపాధి రంగం. ఒక చిత్రం నిర్మిస్తున్నామంటే, టెక్నిషియన్లు, ఎక్స్ట్రా ఆర్టిస్టులు, సెట్ డిజైనర్లు, లైట్బారులు, వీరితో పాటు విడుదలయ్యాక సినిమా హాల్సులో గేట్కీపర్లు, ప్రచారం చేసేవాళ్ళు... ఇలా వీరందరి బతుకు తెరువు గురించి ఆలోచిస్తున్నప్పుడు మూడు షిప్టులేం కర్మ, నాలుగైదు షిప్టులైనా నటించాలని ఉంటుంది' అన్నప్పుడు కదా నీ విశాల హృదయం తెలిసింది.
అలాగే ఆచరణలో ఎప్పటికప్పుడు కొత్తవారికి ప్రోత్సాహం ఇస్తూ, ఎక్కడికక్కడ ఈ సినిమా ఫీల్డులో గుత్తాదిపత్యాన్ని బ్రద్దలు కొట్టేందుకు పూనుకున్నావుగా. సీనియర్ ఎన్టీఆర్‌తో కలసి ''దేవుడు చేసిన మనుసులు'' సినిమా తీసేటప్పుడు కూడా బేధాలు మరిచి స్థాయికి తగ్గ పాత్రలు ఇచ్చి గౌరవించావుగా!
సీతారామరాజు చిత్రం తర్వాత, సింహాసనం వంటి చిత్రానికి దర్శకత్వం వహించాక, హిందీ చిత్రసీమకు నీవు పరిచయం అయ్యాక, నిన్ను 'శివాజీ' పాత్రలో చూడాలని చాలామంది నిర్మాతలు, అభిమానులు కోరుకున్నారు. అందుకు మళ్ళీ నీవిచ్చిన సమాధానం ఎంత గొప్పగా ఉంది..?
''సీతారామరాజు చిత్రంలో విలన్లు బ్రిటిష్ సామ్రాజ్యవాద దొరలు, దానిని ప్రజలు సులభంగా స్వీకరించగలరు. కానీ శివాజీ చిత్రంలో విలన్‌గా ఔరంగజేబును చూపాలంటే... ముస్లింలు ఇప్పుడు మన సామాజిక జీవన స్రవంతిలో ప్రధాన భాగం. ఆ సోదరులు బాధపడటం, మత సామరస్యానికి విఘాతం కలగడం సబబుకాదనే ఉద్దేశ్యంతోనే మానుకున్నా'' అని చెప్పడంలో నీలోని సామాజిక స్పృహ, ఔన్నత్యం అర్థమయిందన్నా. నీ ఈ భావన నిజంగానే మతోన్మాదులకు చెంపపెట్టు.
ఏది ఏమైనా, మాకు దూరంగా తెరపై హీరోగా నిన్ను చూసి ఉత్సాహపడినా, నీ ఈ మాటలతో, చేతలతో మా మనసులకు దగ్గరైన మామంచి రియల్ హీరోవి నీవే కదన్నా నీవు...
అశృతనయనాలతో..
ఓ అభిమాని.
- కె. శాంతారావు
9959745723