Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు మనం ఆస్వాదిస్తున్న సౌకర్యాలు, పనిముట్లు, జీవితావసరాలు, మందులు... అన్నీ సైన్స్ ఫలాలే. మానవుడు భూమి మీద జీవనం ప్రారంభించిన నాటి నుంచి, నేటి వరకూ తన ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేసి, ఈరోజు అంతరిక్షాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకొనే స్థాయికి చేరుకున్నాడంటే శాస్త్రీయ ఆలోచన, దృక్పథం కారణం. అందుచేతనే ఈ భూమి మీద ఎన్ని అవాంతరాలు, అనారోగ్యాలు, విపత్తులు సంభవించినా, తన శాస్త్రీయ ఆలోచనలతో ఎదుర్కొని నిలబడి, నవ నాగరికతకు చిరునామాగా నిలిచాడు.
అందుకే దేశంలో ప్రతీ పౌరుడు శాస్త్రీయ సంస్కృతి కలిగి ఉండాలని దిశా నిర్దేశం చేశారు. కానీ నేటి పాలకులు, మూఢ నమ్మకాలు, మూఢ మత భావనలు పాటిస్తూ ప్రచారం చేస్తున్నారు. కరోనా కాలంలో గంగలో మునగండి, గోమూత్రం తాగండి, పళ్ళాలు వాయించండి, దీపాలు వెలిగించండి, పూలు జల్లండి అని చెబుతూ సరైన వైద్యం సకాలంలో అందివ్వకుండా, కొన్ని లక్షల మంది మరణాలకు కారణం అయ్యారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకూ మూఢ నమ్మకాలు, విశ్వాసాలు పెంపొందించే జ్యోతిష్యం, వాస్తు, మూఢ మత భావనలు పెంపొందించే సిలబస్ (కరికులం) ప్రవేశపెడుతూ దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న అనేక మహమ్మారులను తరిమికొట్టడానికి, ఇంధన కొరతలను అధిగమించడానికి, వాతావరణ మార్పులను జయుంచడానికి, ఆహార ధాన్యాల కొరత నివారించడానికి, సైన్స్ ఆధారంగా శాస్త్రీయ ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేయాలి. విద్వేష ప్రసంగాలు, మత ప్రాంతీయ భాషా ఉద్రిక్తతలకు చరమగీతం పాడాలి. మన అవసరాలు తీర్చకోవడానికి, సమస్యల పరిష్కారానికి సైన్స్ ఒక సాధనం అని అందరూ గ్రహించాలి. సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే, ప్రజలందరూ శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఏ దేశాభివృద్ధి అయినా ప్రజల శాస్త్రీయ, సాంకేతికత వినియోగంపైనే ఆధారపడి ఉంటుంది. - - ఐ. ప్రసాదరావు,
సెల్ : 6305682733