Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శీతల పవనాలు జోరుగా వీస్తున్నాయి
శిశిరం ముందే వచ్చింది కొత్త గొంతుల్ని రాలుస్తూ
కాకులు కూస్తున్నాయి కోయిల గొంతులతో
కాలం నెత్తుటి రుతువును పూసింది
ఆశల చూపుల రెక్కల్ని ఒక్కొక్కటే తుంచి
రేపటి నడకలు నేరుస్తున్న కాళ్ళని నరికి
ప్రజాస్వామ్యాన్ని ప్రవచిస్తోంది
కాదన్న గొంతులపై బూటు కాళ్ళతో
వీలైతే కొనుగోళ్ళు కాదంటే ఈడీ దాడులు
ఆధిపత్యపు జూదంలో 'ప్రతినిధులే' పావులు
అధికార వికృత క్రీడలో విలువలే సమిధలు
ప్రజాస్వామ్య స్తంభాలకు నిలువెత్తు బీటలు
గొంతెత్తిన నిరసనకు 'దేశద్రోహ' బహుమానం
హక్కులకై నిలబడితే చెరసాలే 'ఉపా'యం
రాజ్యాంగపు వృక్షానికి సంకుచితపు చీడ పీడ
అంతులేని ద్వేషానికి మనువాద ఛత్రచ్ఛాయ
అపరిమిత అధికారం జడలు విప్పి
అల్ప జీవులపై జోలు విదులుస్తోంది
విద్వేషమే దేశభక్తి లా విరగబూస్తోంది
పసిపిల్లల హృదయాల్లో విషం చిమ్ముతూ
చిమ్మచీకట్లు ముసురుకుంటున్న వేళ
అబద్ధాల తారలు ఒక్కొక్కటే మెరుస్తున్నాయి
వక్రీకరణలే వాస్తవాలని ఊరేగుతున్నాయి
సత్యం చెరసాల ఊచల వెనుక
కరుణ, సహనాలకు అర్థాలు మారుతున్నాయి
బహుళత్వం, భిన్నత్వం చిదిమివేయ బడుతున్నాయి
శిలా సదృశ ఏకరూపతే ఇప్పుడు దేశ భక్తి
పుష్పగుచ్ఛం లో అన్నీ ఒక్క రంగు పూలే
అయినా మిత్రమా! శిశిరం ఎల్లకాలం ఉండదు
మోడుబారిన మానులన్ని కొత్త చిగుళ్ళు తొడుగుతాయి
శుక పికాల రవాలతో ప్రజాస్వామ్యం ప్రతిధ్వనిస్తుంది
చీకట్లను చీలుస్తూ ఇనబింబం తూర్పునే ఉదయిస్తుంది.
- టి. హరికష్ణ,, 9494037288