Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రెజిల్లో ప్రజాస్వామ్యం పైచేయి సాధించింది. అక్టోబర్ 30న జరిగిన రెండో రౌండ్ ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు, నియంత అయిన బోల్సనారో ఓటమి పాలయ్యాడు. గతంలో రెండు సార్లు బ్రెజిల్ అధ్యక్షుడిగా వ్యవహరించిన లూలా విజయం సాధించాడు. వామపక్ష పార్టీ అయిన 'వర్కర్స్ పార్టీ' (పి.టి) నాయకుడు లూలా పూర్తి పేరు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా.
బోల్సనారో హయాంలో బ్రెజిల్ ప్రజానీకం పచ్చి మితవాద రాజకీయాలతో నలిగిపోయారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేయడానికి నిరంతరం ప్రయత్నించాడు బోల్సనారో. స్త్రీల పట్ల అమిత ద్వేషాన్ని, మానవత్వ విలువల యెడల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించాడు. తుపాకి సంస్కృతి రాజ్యం ఏలింది. బ్రెజిల్‌లోని మురికివాడలలో నివసించే పేదలను నేరస్తులుగా, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులుగా చిత్రీకరిస్తూ వారిపై దమనకాండ ప్రయోగించాడు బోల్సనారో. పర్యావరణ పరిరక్షణ పట్ల ఏ మాత్రమూ బాధ్యత లేకుండా అమెజాన్ అడవుల విధ్వంసానికి పూనుకున్నాడు. ఈ మారు బోల్సనారో గనుక గెలిచి ఉంటే దేశాన్ని పూర్తి మిలిటరీ పాలన కిందకు తీసుకువచ్చేవాడు. ఒకప్పుడు బలంగా ఉండిన ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా కేంద్రీకృత పాలనగా దిగజార్చి ఉండేవాడు. సుప్రీం కోర్టును కూడా తన తాబేదారులతో నింపి పౌర హక్కులను పూర్తిగా కాలరాసి ఉండేవాడు. కాని బ్రెజిల్ ప్రజానీకం ప్రదర్శించిన చైతన్యం బోల్సనారోను ఓడించింది. ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చింది.
లూలా నాయకత్వంలో 2003-2014 మధ్య కాలంలో వామపక్ష-మధ్యేవాద ప్రభుత్వం పేదరికాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. సామాజిక, పౌర హక్కుల్ని విస్తరించింది. మళ్ళీ ఇప్పుడు లూలా అధ్యక్షుడు కావడం అంటే నల్లజాతి ప్రజలు అధికశాతంగా ఉన్న బ్రెజిల్ కార్మికవర్గానికి తోడు దొరికినట్లు అవుతుంది. పురుషాధిక్యత ప్రభావం ఎక్కువగా ఉన్న బ్రెజిల్లో మహిళలకు పెద్ద దిక్కుగా వ్యవహరించే ప్రభుత్వం ఏర్పడుతుంది. పౌరహక్కుల విస్తరణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ప్రజాసంక్షేమంతోబాటు ప్రాధాన్యత పొందుతాయి. అభ్యుదయ భావాలుగల మధ్యతరగతి ఆలోచనలకు విలువ పెరుగుతుంది. సామాన్య ప్రజల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచే విధంగా ప్రజాస్వామ్య సంస్కరణలను చాలా పెద్ద ఎత్తున ప్రవేశపెట్టిన ఘనత లూలా నాయకత్వంలోని గత ప్రభుత్వానికి ఉంది.
బోల్సనారో ప్రభుత్వం కోవిడ్ ముప్పు నుండి ప్రజలను కాపాడడంలో ఘోరంగా విఫలమైంది. ప్రజాస్వామ్యం మీద, శాస్త్ర విజ్ఞానం మీద, ప్రజాస్వామిక వ్యవస్థల మీద విపరీతంగా బోల్సనారో దాడి చేశాడు. మంత్రులుగా సైనికాధికారులను నియమించాడు. బోల్సనారో ప్రభుత్వం నిత్యమూ ఏదో ఒక అవినీతి కుంభకోణంలో మునిగి తేల్తూ ఉండేది. ఈ పాలనను ప్రజానీకం తీవ్రంగా ద్వేషించారు. దాంతో ఈ మారు ఎన్నికల్లో లూలా చాలా భారీ విజయం సాధించగులుగుతాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. అయితే లూలాకు 51.9 శాతం ఓట్లు రాగా బోల్సనారోకు 48.1శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 3.8శాతం తేడాతో లూలా గెలుపొందాడు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇది అత్యంత స్వల్ప మెజారిటీ.
బ్రెజిల్లో మితవాద శక్తులు ఎంత బలంగా వేళ్ళూనుకుని ఉన్నాయో దీనిని బట్టి తెలుస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ బోల్సనారో దాదాపు సమానమైన ఓట్లు సాధించాడు. క్రైస్తవ మత ప్రచారకులు చాలా వేగంగా విస్తరించి మితవాద భావాల వ్యాప్తికి తోడ్పడ్డారు. సాంప్రదాయ పురుషాధిక్య భావనలను సమర్థిస్తూ అబార్షన్‌ను, గే వివాహాలను వ్యతిరేకిస్తూ, వాటినే ప్రధానమైన అంశాలుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. లూలా సైతానుతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, లూలా గనుక గెలిస్తే చర్చిలను మూసివేస్తాడని ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా విపరీతంగా రాజకీయ హింస చెలరేగింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని బోల్సనారో మద్దతుదారులు పుకార్లను ప్రచారం చేశారు. హింసను రెచ్చగొట్టారు. బోల్సనారో స్వయంగా చేసిన విద్వేషపూరిత ప్రసంగాలు దీనికి దోహదం చేశాయి. పోలీసు యంత్రాంగం, మిలిటరీ అధికారులు, కార్పొరేట్లు బోల్సనారోకు అండగా నిలిచారు. ఎన్నికల ఫలితాలు లూలాకు అనుకూలంగా వచ్చినప్పటికీ మొదట్లో ఆ ఫలితాలను గుర్తించడానికి మితవాద శక్తులు నిరాకరించారు. అయితే, బ్రెజిల్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇంకా బలంగా ఉన్నందువలన బోల్సనారో ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. లూలా అధ్యక్ష పదవీ కాలం 2023 జనవరి 1 నుండి మొదలు కానుంది.
లూలా ప్రభుత్వం ముందున్న సవాళ్ళు
బోల్సనారో హయాంలో ముందుకొచ్చిన విద్వేషపూరిత ఎజెండా స్థానే సామాజికాభివృద్ధి అంశాలపైన, దేశ ఆర్థిక స్థితిగతులపైన చర్చ జరగాలి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇప్పటికీ బలంగా ఉన్న మితవాద శక్తులు సృష్టించే ఆటంకాలను లూలా అధిగమించాల్సి ఉంటుంది. విద్య, వైద్యం వంటి రంగాలలో ప్రమాణాలను మెరుగుపరచాల్సి ఉంటుంది. పర్యావరణానికి సముచిత ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో పేద, శ్రామిక ప్రజల కొనుగోలుశక్తిని గణనీయంగా పెంచేవిధంగా సంక్షేమ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. సంక్షేమం ప్రభుత్వాధినేతల దయాధర్మ భిక్షగా కాకుండా ప్రజల న్యాయమైన హక్కుగా ఉండాలి.
గత దశాబ్దంలో ప్రపంచంలో పలు దేశాల్లో మితవాద, అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలు అధికారంలోకి రావడం ఒక ధోరణిగా కనిపించింది. అమెరికాలో ట్రంప్, ఇండియాలో మోడీ, ఫిలిప్పీన్స్‌లో డుటార్టె, బ్రెజిల్లో బోల్సనారో ఆ విధంగా వచ్చినవారే. ఇప్పుడు బ్రెజిల్లో మళ్ళీ అభ్యుదయ, వామపక్ష, మధ్యేవాద శక్తులు అధికారం లోకి రావడం చూస్తే గత దశాబ్దపు ట్రెండ్ మారబోతున్నదని అనిపిస్తోంది. అయితే మళ్ళీ మితవాద శక్తులు బ్రెజిల్లో పుంజుకోకుండా ఉండాలంటే విశాల ప్రాతిపదికన పేద తరగతులను, మధ్యతరగతిలోని అభ్యుదయ శక్తులను సమీకరించి వారిని ఐక్యంగా నిలబెట్టవలసి ఉంటుంది. జెండర్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయవలసి ఉంటుంది. సాంస్కృతికంగా అభ్యుదయ భావాలు గల బ్రెజిల్ సమాజంలో ఆధిక్యత సాధించేలా గట్టి కృషి చేయవలసి ఉంటుంది.
మన దేశంలో...
ప్రస్తుతం భారతదేశంలో మోడీ నాయకత్వంలో కొనసాగుతున్న పచ్చి మితవాద ప్రభుత్వాన్ని ఓడించాలని కోరుకునేవారందరికీ బ్రెజిల్ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మన దేశంలో పురోగామి శక్తులు బ్రెజిల్ ఎన్నికల అనుభవాలను, అక్కడ మితవాద శక్తులు ఆఖరు క్షణం వరకూ సాగించిన దారుణమైన కుట్రలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. మితవాద, మతతత్వ శక్తులను ఓడించాలంటే కార్మికవర్గం సాధించవలసిన ఐక్యతను, చైతన్యాన్ని, ప్రదర్శించాల్సిన చొరవను గుర్తించాలి. అవి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. వాటితోబాటు సాంస్కృతిక రంగంలో కృషి, సామాజిక తరగతులలో కృషి, పురుషాధిక్యతపై పోరాటం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కూడా ప్రాధాన్యత కలిగివున్నాయి.
మన దేశంలో కూడా గతంలో ఎమర్జెన్సీ వంటి తీవ్ర సవాళ్ళను అధిగమించి ప్రజాస్వామ్య శక్తులు విజయం సాధించిన అనుభవాలు ఉన్నాయి. తిరిగి ప్రజాస్వామ్యం దేశంలో పైచేయి సాధించాలని, మితవాద, మతతత్వ శక్తులను సాగనంపాలని ఆశిద్దాం. బ్రెజిల్లో ప్రజాస్వామ్య శక్తుల విజయాన్ని స్వాగతిద్దాం.
- ఎం.వి.ఎస్. శర్మ