Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమ సమాజం కోసం, పీడిత, తాడిత బలహానవర్గాలకు సమానత్వం కోసం, ఆకలిలేని రాజ్యం కోసం కమ్యూనిజమే మార్గమని భావించి తన జీవితాంతం మార్క్సిస్టు పార్టీ కార్యక్తగా పనిచేసిన నిబద్ధత గల నేత అమరజీవి వనగంటి ఈశ్వర్. మిత్రుడు గాండ్ల శేఖర్ ద్వారా తెలకపల్లి నర్సింహయ్యతో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా సీపీఐ(ఎం) పార్టీ రాజకీయ విధానం పట్ల ఆకర్షితులై కామ్రేడ్ వనగంటి ఈశ్వర్ 1969లో పార్టీలో చేరారు. ఆ తర్వాత వనపర్తిలో పార్టీ విస్తరణ కోసం కృషి చేశారు. విద్యార్థి, యువజన సంఘాలను ఏర్పాటు చేసి విస్తరింపచేశారు. కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి వనపర్తి పట్టణ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యునిగా పనిచేస్తూ 1985లో సీపీఐ(ఎం) పార్టీ జీల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 23ఏండ్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. వనపర్తి గ్రామ సర్పంచ్‌గా, మున్సిపల్ ఛైర్మన్‌గా పోటీచేసి ఓడిపోయినా, రెండవ స్థానంలో నిలిచారు.
గుక్కెడు గంజికి కరువు ఏర్పడ్డ పరిస్థితుల్లో అంబలి కేంద్రాల ఏర్పాటుకు పార్టీ పూనుకున్నది. అంబలి కేంద్రాలు కొద్దిరోజులకే 84గ్రామాలకు విస్తరించాయి. రాష్ట్రవ్యాపితంగా గొప్ప మద్దతు లభించింది. ఈ కృషిలో వనగంటి ఈశ్వర్ మంచి చొరవని ప్రదర్శించడమేకాదు, స్వయంగా వాలంటీర్‌గా కృషిచేశారు. ఈ క్రమంలో నగ్జలైట్ల నిర్భందాన్ని ఎదుర్కొన్నారు. కొంతకాలం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. జిల్లాలో నగ్జలైట్లు మార్క్సిస్టు పార్టీకి చెందిన ముగ్గురు నాయకులను హత్యచేశారు. ఇంతటి తీవ్ర నిర్బంధంలో సైతం ఏమాత్రం బెరుకు లేకుండా వనగంటి ఈశ్వర్ ధైర్యంగా పార్టీ కర్తవ్యాన్ని నిర్వహించారు. పార్టీ సాహిత్యం, ప్రజాశక్తిని నడపడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతగా నిర్వహించేవారు. పార్టీ నిర్మాణంలో భాగంగా, తన పనిలో విమర్శ-ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు సాగేవారు. కామ్రేడ్ వనంగటి ఈశ్వర్ భౌతికంగాదురమై 2022, నవంబర్ 18కి రెండేండ్లు. ప్రజా సమస్యలపై నిరంతర ఉద్యమాలకు పునరంకితం కావడమే వనగంటి ఈశ్వర్‌కు నిజమైన నివాళి.
(నేడు కామ్రేడ్ వనగంటి ఈశ్వర్ 2వ వర్ధంతి)
- కందికొండ మోహన్
9491630406