Authorization
Mon Jan 19, 2015 06:51 pm
15 నవంబర్ 2022 రోజున ప్రపంచ జనాభా 8బిలియన్ల (800 కోట్ల) మైలురాయి దాటిందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా అంచనా నివేదిక వెల్లడిస్తున్నది. మానవ అభివృద్ధి సూచికలో ఇదో ముఖ్య అధ్యాయంగా నిలుస్తుందని ఐరాస తెలిపింది. ప్రపంచ జనాభా 8 బిలియన్ల మార్కు దాటిన వేళ ఇండియా జనాభా 1.41 బిలియన్లకు చేరడం గమనార్హం. ప్రపంచ జనాభా 1804లో 1 బిలియన్, 1930లో 2 బిలియన్లు, 1960లో 3 బిలియన్లు, 1974లో 4 బిలియన్లు, 1987లో 5 బిలియన్లు, 1998లో 6 బిలియన్లు, 2021లో 7 బిలియన్ల మైలురాళ్ల మార్కును దాటింది. 2037 నాటికి 9 బిలియన్లు, 2058 నాటికి 10 బిలియన్లకు విశ్వ జనాభా చేరవచ్చని ఐరాస తెలుపుతున్నది. ప్రపంచ జనాభాలో 31శాతం క్రిస్టియన్లు, 23 శాతం ముస్లిమ్స్, 15శాతం హిందువులు, 7శాతం భౌద్దులు, 6శాతం గిరిజన జాతులు, ఒక శాతం ఇతర మతస్తులు, 0.2 శాతం జూస్, 16 శాతం ఏ మతానికి చెందని వారు ఉన్నారు.
2023లో చైనాను అధిగమించనున్న ఇండియా జనాభా
ఐరాస వివరాల ప్రకారం 2019లో ప్రపంచ సగటు ఆయుర్దాయం 72.8ఏండ్లు ఉండగా, 2050 నాటికి 77.2ఏండ్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా రెట్టింపు కావడం, దాదాపు గత 12ఏండ్లలో 1 బిలియన్ జనాభా పెరగడం (7 నుంచి 8బిలియన్ల వరకు) గమనించాం. ఆసియా, ఆఫ్రికాలకు చెందిన అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉన్నట్లు విశ్లేషించారు. ప్రపంచ వ్యాప్తంగా సగటు మరణాల రేటు తగ్గడం, సగటు ఆయుర్దాయం పెరగడం కారణంగా జనాభా పెరుగుదల వ్యక్తం అవుతున్నది. 2023లో భారత జనాభా (1.41 బిలియన్లు) చైనా జనాభాను (1.45 బిలియన్లు) దాటి అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో తొలి స్థానానికి చేరనుందని తెలుస్తున్నది. ఇండియా జనాభా క్రమంగా పెరిగితే, చైనా జనాభా తగ్గుతున్నదని గమనించారు. 2050 నాటికి ఇండియా జనాభా 1.67 బిలియన్లు, చైనా జనాభా 1.32 బిలియన్లకు చేరతాయని స్పష్టం చేసింది. 2020 నుంచి జనాభా పెరుగుదల రేటు కొంత తగ్గిందని, 1950లో ప్రతి మహిళకు జనన రేటు 5 ఉండగా, నేడు 2.3 వరకు పడిపోయిందని వివరిస్తున్నారు. 2050 నాటికి ఈ రేటు 2.1 వరకు పడిపోవచ్చని విశ్లేషించారు. 2080 తరువాత ప్రపంచ జనాభా 10.4 బిలియన్లు కలిగి 2100 వరకు స్థిరంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
జనాభా విస్పొటన సవాళ్లు
జనాభా విస్పొటన సంక్షోభ ఫలితంగా బిలియన్ల బడుగులు అసమానతల ఉచ్చులో చిక్కుకొని చిక్కిశల్యం అవుతున్నారు. నేడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న వాతావరణ ప్రతికూల మార్పులు, విపత్తుల కల్లోలాలు, వడగాలులు, కార్చిచ్చులు, కరువుకాటకాలు, ఉక్రెయిన్ యుద్ధానికితోడు, యూరోప్‌లో ద్రవ్యోల్బణ విషవలయంలో నలుగుతూ నరకాన్ని అనుభవిస్తున్నారు. 1999లో ఐరాస అంచనాల ప్రకారం 2028లో ప్రపంచ జనాభా 8బిలియన్లకు చేరవచ్చనే అంచనాలు తలకిందులు కావడం గమనిస్తున్నాం. 2022-50ల మధ్య ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల జననాల రేట్లు 1శాతం లోపుకు తగ్గవచ్చని, 8 దేశాల్లో(ఇండియా, ఈజిప్ట్, కాంగో, ఇథియోపియా, నైజీరియా, పాక్, ఫిలిపైన్స్, టాంజానియా) జనాభా క్రమంగా పెరగవచ్చని సూచిస్తున్నారు. జనాభా పెరుగుదలతో పేదరిక నిర్మూలన, ఆకలి చావులు, పోషకాహార లోపం, ప్రజా అనారోగ్యం, నిరక్షరాస్యత లాంటి సవాళ్ల ను అధిగమించడం కష్టం అవుతున్నట్లు తేలింది. జనాభా పెరుగుదలతో సంబంధం కలిగిన ఆహార అభద్రత, మానవహక్కుల ఉల్లంఘనలు, భూగ్రహ కాలుష్యాలు మానవాళికి పెను సవాళ్లను విసురుతూనే ఉన్నాయి.
ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా జనాభా పెరుగుదలతో పాటు వాతావరణ సానుకూల మార్పులు, ఆహార భద్రత, మానవ హక్కుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, అక్షరాస్యత పెరుగుదల, అసమానతల భూతాన్ని తరిమేయడం, జనాభా నియంత్రణ లాంటి రంగాల్లో మానవాళి సుస్థిర అడుగులు వేయాల్సి ఉంది. అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తున్న భారతంలో సగటు మనిషి ఆకలి లేని జీవితాలను గడపాలని కోరుకుందాం.
- డా||బి.ఎం.రెడ్డి
9949700037