Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కోసం సాగుతున్న ప్రజాస్వామ్య దేశంలో 58ఏండ్ల పాటు ప్రజలకు ఎలాంటి సమాచారం అందుబాటులో ఉంచకుండానే బండి నడిపించేసారు. పౌర సమాజం, ఉద్యమకారుల నిరంతర ఉద్యమాలకు తలొగ్గిన పాలకులు ఎట్టకేలకు 2005 అక్టోబర్ 12 నుండి సమాచార హక్కుచట్టాన్ని అమలు పరుస్తున్నారు. కానీ గత 17ఏండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో పారదర్శకత, జవాబుదారితనంను పెంపొందిస్తున్నట్లు సెలవిచ్చిన ఈ విప్లవాత్మక శాసనానికి తూట్లు పొడిచేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల సమాచార కమిషన్లలో కొండలా పెరిగిపోతున్న పెండింగ్ దరఖాస్తులు, జరిమానాలు విధించడంలో ఉదాసీనత, సమాచార సంఘాలలో సమాచార కమిషనర్లను నియమించడంలో నిర్లక్ష్యం, సవరణలతో సహచట్టాన్ని సారహీనం చేయడం మొదలైన చర్యలతో ''సహ'' స్ఫూర్తిని నీరుగార్చుతున్నారు.
దేశంలో కేంద్ర సమాచార కమిషన్‌తో పాటు 28 రాష్ట్రాలలో సమాచారం కమిషన్లు పనిచేస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్రాల సమాచార కమిషనర్ల పనితీరుపై ఇటీవల విడుదలైన సతార్కు నాగరిక్ సంఘటన్ నివేదిక ప్రకారం 2019 మార్చి 31 నాటికి దేశంలోని అన్ని సమాచార కమిషన్లలో 2,18,347 ఆప్పిళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండగా జూన్ 30, 2022 నాటికి ఆ సంఖ్య 3,14,323కి పెరిగింది. పెండింగ్ కేసుల కొండలు కరగాలంటే ఏడాది నుండి 24ఏండ్లు పడుతుంది. సహచట్టం నిబంధనల ప్రకారం ఒక సమాచార కమిషనర్ ఒక ఏడాదిలో 3200 అప్పిళ్లు, ఫిర్యాదులు విచారణ చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇలా జరగడం లేదు. అలాగే చాలా రాష్ట్రాల కమిషన్లలో ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన పెండింగ్ దరఖాస్తులు పెరుగుతున్నాయి.
సమాచార కమిషన్ల ఉదాసీన వైఖరి..
దేశంలో సమాచార హక్కుచట్టం అమల్లోకి వచ్చి 17 వసంతాలు గడిచినా ఇప్పటివరకు కేవలం మూడు శాతం మంది ప్రజలే దీన్ని వినియోగించుకున్నారు. సహచట్టం సెక్షన్ 9(3),18(1) ప్రకారం కేసులు తక్కువగా వస్తున్నా వాటిని విచారించి పరిష్కరించడంలో సమాచార కమిషన్లు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నాయి. సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్న ప్రజా సమాచార అధికారులపై సహచట్టం సెక్షన్ 20 ప్రకారం కొరడా జూలిపించాల్సిన కమిషనర్లు నిర్లక్ష్యంను ప్రదర్శిస్తున్నారు. సమాచార కమిషన్లకు వస్తున్న కేసులలో కేవలం 5శాతం కేసులకు మాత్రమే జరిమానా విధిస్తున్నాయి. సెక్షన్ 20(2) ప్రకారం గడిచిన ఏడాదిలో దేశంలో ఒక్క ప్రజా సమాచార అధికారిపై సర్వీస్ నిబంధనల కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు.
సమాచారానికి సర్కారు గ్రహణం...
సమాచార హక్కుచట్టం కింద సమాచారం ఇవ్వకుండా గత 17వసంతాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కుట్రలు చేస్తూనే ఉన్నాయి. సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు- 2013ను ప్రవేశపెట్టి రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం కిందకు రాకుండా అడ్డుకోగలిగాయి. సమాచార హక్కుచట్టం సవరణ బిల్లు-2018 తీసుకోవచ్చి సమాచార కమిషన్ల పనితీరును ప్రభావితం చేశాయి. అలాగే సమాచార హక్కుచట్టం శిక్షణ, ప్రచారంకు కేంద్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయిస్తూ తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సమాచార హక్కు చట్టం శిక్షణ, ప్రచారం అవగాహన కార్యక్రమాలకు రూ.18.46 కోట్లు కేటాయించగా, 2021-22 సంవత్సరంలో రూ.5.50 కోట్లు 2022-23 బడ్జెట్లో కేవలం మూడు కోట్లు మాత్రమే కేటాయించినది. అలాగే ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో గత 18నెలల నుంచి పదిమంది సహచట్టం ఉద్యమకారులపై దరఖాస్తులు పెట్టకుండా నిషేధం విధించింది. అలాగే చాలా రాష్ట్రాలలో సమాచార కమిషన్లలో విశ్రాంత అధికారులను కమిషనర్లుగా నియమిస్తూ వృద్ధాశ్రమాలుగా మారుస్తున్నది. సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడుగితే భౌతికదాడులకు దిగుతున్నారు. సహ చట్టమే ఆయుధంగా అక్రమాలను వెలుగులోకి తెచ్చే క్రమంలో ఇప్పటివరకు దేశంలో 95మందికి పైగా ఉద్యమకారులు అమరులయ్యారు.
పారదర్శకతకు పట్టం కట్టాలి...
పాలనలో పారదర్శకతకు ఎంతగా ప్రాధాన్యమిస్తే ప్రజలకు ప్రజాస్వామ్యంపై అంతగా విశ్వాసం ఇనుమడిస్తుంది. కనుక గ్రామపంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు ప్రజాధన వినియోగానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్లైన్లో ఉంచాలి. రాజకీయ అవసరాలను అశ్రిత పక్షపాతాన్ని పక్కనపెట్టి సమాచార కమిషనర్లను నియమించాలి. అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరించాలి. సహచట్టం సెక్షన్ 26 ప్రకారం చట్ట ప్రచారానికి, ప్రజా సమాచాధి కారుల శిక్షణకు ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించాలి. స్వేచ్ఛా యుత వాతావరణంలో తమకు కావలసిన సమాచారాన్ని పొందే అవకాశాన్ని ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కాబట్టి ఆ మేరకు అధికార యంత్రాంగానికి పాలకులు దిశ నిర్దేశం చేస్తేనే రాజ్యాంగబద్ధమైన సమాచార హక్కుకు మన్నన దక్కుతుంది.
- అంకం నరేష్
6301650324