Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల వాగ్దానాలు అవినీతి ఆచరణను ఏర్పరుస్తాయా? అవి ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాన్డక్ట్ (ఎంసీసీ) విధించే పరిమితులకు లోబడి ఉండాలా? కేంద్ర ప్రభుత్వ పథకాలు సంక్షేమ చర్యలు అయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉచితాలు అవుతాయా? ఎవరో తెలియని దాతల నుండి ఎన్నికల బాండ్ల రూపంలో నిధులు పొందడం రాజకీయ పార్టీలకు సరైనదేనా? ఎంసీసీ మార్గదర్శకాల్లో మార్పులను సూచిస్తూ ఎన్నికల కమిషన్ (ఈసీ) చేసిన ప్రతిపాదనకు ప్రతిస్పందనగా రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలివి.
అక్టోబర్ 4వ తేదీన, ఎన్నికల వాగ్దానాల్లోని ఆర్థికపరమైన పర్యవసానా లపై ఒక ప్రకటనను డిమాండ్ చేస్తూ, ఎంసీసీని బలోపేతం చేసే ప్రతిపాదనతో అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ ఒక లేఖను పంపింది. చాలా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు దీనిని అసాధ్యమైనవిగా భావించాయి. ఎన్నికల వాగ్దానాలపై మార్గదర్శకాలను జారీ చేయాలంటూ 2013లో ఇచ్చిన ఆదేశాలను ఈసీ పట్టుదలతో అనుసరిస్తుంది కనుక అక్టోబర్ 19 నాటికి రాజకీయ పార్టీలు వాటి అభిప్రాయాలను తెలియజేయాలి, లేకుంటే ఈ ప్రతిపాదిత మార్పులపై ఆ పార్టీలు చెప్పేదేమీ లేనట్టుగా భావించబడుతుందట.
ఇది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈసీ తెలిపిన అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి, ఇప్పుడు ఈసీ చర్య గందరగోళంగా ఉంది. ఎన్నికలకు ముందు లేదా తరువాత ఉచితాలను వాగ్దానం చేయడమనేది ఆయా పార్టీలకు సంబంధించిన విధాన నిర్ణయమనీ, అలాంటి విధానాలు ఆర్థికంగా నెరవేర్చదగినవా, కాదా అనే ప్రశ్నను ఓటర్లు నిర్ణయించాల్సి ఉంది అని అప్పటి అఫిడవిట్ తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ అనుసరిస్తున్న విధానాలను, తీసుకున్న నిర్ణయాలను (చట్టంలో నిబంధనలు లేకుండా చర్యలకు పూనుకుంటే అధికార దుర్వినియోగం చేయడమే అవుతుంది కాబట్టి) తాను (ఈసీ) క్రమబద్ధీకరించలేనని కూడా తెలిపింది.
బీజేపీ తప్ప, సంక్షేమ పథకాలు, ఎన్నికల వాగ్దానాలు ఉచితాలని ఏ ఇతర రాజకీయ పార్టీలు అనుకోవడం లేదు. ప్రధానమంత్రి అదే పనిగా ఉచితాలను విమర్శిస్తున్నాడు. ఉచితాల అమలు, ''రెవ్రీ'' సంస్కృతి లాంటిది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఉచితంగా ఇచ్చే మిఠాయి లాంటిది ''రెవ్రీ'' అని ఒక సందర్భంలో అన్నాడు.
సుబ్రమణ్యం బాలాజీ కేసులోని ఉత్తర్వులను పునరాలోచన చేయాలని కోరుతూ పిటీషన్‌ను వేయడం ద్వారా, ''ఉచితాల''పై బీజేపీ నాయకుడు అశ్వినీకుమార్ ఉపాధ్యారు చట్టపరమైన చర్చకు మరొకమారు తెరలేపారు. సంక్షేమ పథకాలు ఉచితాలు కావని నొక్కి చెపుతూ, డీఎంకే, ఆప్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మధ్యలో జోక్యం చేసుకుంటూ దరఖాస్తులను దాఖలు చేశాయి. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ''మరొక ప్రజాస్వామ్య వైఫల్యం''గా పేర్కొంది.
ఉపాధ్యారు వేసిన పిటిషన్ ఫలితంగా ఈ విషయం సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు, ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటును రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఎన్నికల వాగ్దానాలను వివరించాలని రాజకీయ పార్టీలను బెదిరించడం అంటే చట్టం పరిధిలోకి చొరబడడంగా భావించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రధాన నిర్ణేతలనే వాదనలు కూడా జరిగాయి.
ప్రతిపక్ష పార్టీల ఆగ్రహం
ఎంసీసీని నిష్పక్షపాతంగా, ప్రతి ఒక్కరికీ అన్వయించాలని సుదీర్ఘ కాలంగా రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాల విషయంలో, ఎన్నికల బాండ్ల విషయంలో ఈసీ అసమర్థ చర్యలు, మౌనం కొన్ని ప్రశ్నలను లేవదీశాయి.
ఈ సందర్భంగా ఎన్నికల వాగ్దానాలను క్రమబద్ధీకరించే చర్యలు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలకు ఆగ్రహం తెప్పించాయి. ఈసీ ఉత్తరంతో పాటు రెండు భాగాలతో కూడిన ఒక ప్రొఫార్మా కూడా ఉంది. ఎన్నికల వాగ్దానాల్లో తప్పకుండా చేసే ఖర్చుల జాబితాతో పాటు వాగ్దానం చేసిన పథకం, సంక్షేమ చర్యలు, జనాభా, లబ్దిదారుల సంఖ్య, చేయబోయే ఖర్చుల్లో ఆర్థికపరమైన పర్యవసానాలు, మొత్తం ఖర్చుల వివరాలు పార్ట్ ఏ లో చూపాలి. విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు, చిన్న చిన్న వినియోగ వస్తువుల పంపిణీ, రుణాల రద్దు, ఉచిత నీరు, ఉచిత విద్యుత్, ఉచిత రవాణా, ఉద్యోగస్తులకు పెన్షన్ పథకాల లాంటి పథకాల స్వభావాల జాబితా ఈసీ తయారు చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ఆదాయం, ఖర్చు, అప్పులు, జీఎస్డీపీ, బయటి వారికి చెల్లించే అప్పులు, బడ్జెట్ అంచనాలు లాంటి సమాచారాన్ని పార్ట్ బీలో చూపాలి. ఈ ప్రొఫార్మాలోని వివరణ ప్రకారం ఈ సమాచారం, రాజకీయ పార్టీలు వనరులు సమకూర్చుకోవడంలో హేతుబద్ధమైన అంచనాలకు ఉద్దేశించబడింది. ఎన్నికలను నిర్వహించి, అభ్యర్థులు ప్రజా ప్రాతినిధ్య చట్టం అవసరాలు తీర్చు కోవడంలో హామీని ఇవ్వడం ఎన్నికల కమిషన్ ప్రధాన బాధ్యత.
2013 కేసు పరిశీలనలు
మిక్సీలు, గ్రైండర్లు, ల్యాప్ టాప్స్, కలర్ టీవీల పంపిణీ వాగ్దానాలు అవినీతికరమా, కాదా అనే పరిశీలనపై 2013లో సుప్రీంకోర్టు, మ్యానిఫెస్టోలోని ప్రతీ ఎన్నికల వాగ్దానాన్ని అవినీతికరమైనదిగా ప్రకటించడం తప్పుడు విధానమని వ్యాఖ్యానించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎలాంటి వాగ్దానాలు చెయ్యాలి, ఎలాంటి వాగ్దానాలు చెయ్యకూడదనే అంశం కోర్టు పరిధిలో లేదని కూడా తెలిపింది.
మ్యానిఫెస్టో అనేది ఒక అభ్యర్థి విధాన ప్రకటన కాదు, కానీ సంభవమైన ఒక భవిష్యత్తు ప్రభుత్వ విధాన ప్రకటన. అవినీతికి పాల్పడిన వ్యక్తి (అతని పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేదా అనే దానితో నిమిత్తం లేకుండా)కి సెక్షన్ 123 వర్తిస్తుంది. ఒక రాజకీయ పార్టీ, అవినీతి ఆచరణలకు సంబంధించిన నిబంధనల పరిధిలో ఉండదు కాబట్టి ఆ రాజకీయ పార్టీ చేసిన వాగ్దానాలు, అవినీతికరమైనవిగా పరిగణించరు.
ఒక ఆచరణ అవినీతికరమైనదని ఎత్తిచూపే లక్ష్యంతో ఏ కొత్త నిబంధనలకు కోర్టులు ఎలాంటి మార్గదర్శకాలను జారీ చెయ్యలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక చట్టాన్ని చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కలర్ టీవీలు, ల్యాప్ టాప్స్ లేదా మిక్సీలు, గ్రైండర్ల రూపంలో రాష్ట్ర వితరణల పంపిణీ మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించిందని ఒక అర్జీదారు అడిగిన ప్రశ్నను కూడా కోర్టు పరిశీలించింది. ఈ అధికారిక చర్యలు ప్రభుత్వ విధానం యొక్క ఆదేశిక సూత్రాలకు సంబంధించినవి అని కోర్టు స్పష్టం చేసింది. ఆదేశిక సూత్రాలను అమలు చేస్తున్నప్పుడు, ప్రజల అవసరాలను, ఆర్థిక వనరులను పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా సంబంధిత ప్రభుత్వానిదే ఉంటుంది.
ప్రజాధనాన్ని ప్రయివేట్ ఆస్తులను సృష్టించడానికి ఉపయోగించొచ్చా అనే సమస్యపై కోర్టు, ఆ వ్యాజ్యానికి యోగ్యత లేదనే నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరగకుండా సాధారణంగా కోర్టు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎన్నికల మ్యానిఫెస్టో వాగ్దానాలు (ప్రస్తుత చట్టాల ప్రకారం) అవినీతికి సంబంధించినవి కావని కోర్టు ప్రకటించింది.
ఈసీకి మార్గదర్శకాలు
ఒక ప్రత్యేకమైన సమస్యపైన చట్టాలు చేయాలని చట్టసభలకు మార్గదర్శకాలివ్వడానికి కోర్టుకు చాలా పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయని సుప్రీంకోర్టు 2013 కేసులో స్పష్టం చేసింది. ఉచితాల వాగ్దానం ప్రతీ ఒక్కరికీ సమానమైన అవకాశాలు కల్పించే పరిస్థితికి భంగం కలిగించిందని ఈసీ సంబంధిత అఫిడవిట్లో వ్యక్తం చేసింది. ''ఎలక్షన్ మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రత్యక్షంగా అదుపుచేసే చట్టాలు లేవనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని, అభ్యర్థుల ప్రవర్తన, సమావేశాలు, ప్రదర్శనలు, పోలింగ్ రోజుకు, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే క్రమంలో అలాంటి వాటికోసం అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో చర్చించి మార్గదర్శకాలను రూపొందించాలని మేము ఎన్నికల కమిషన్ ను ఆదేశించాం. అదే విధంగా, రాజకీయ పార్టీ విడుదల చేసే ఎన్నికల మ్యానిఫెస్టోలో మార్గదర్శకాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన భాగాన్ని కూడా ఎంసీసీలో రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు మార్గదర్శినిగా ఉండేట్లు పొందుపరచాలి'' అని కూడా కోర్టు పేర్కొంది.
ఎన్నికల ప్రక్రియతో ముడిపడి ఉన్నందున, ఎన్నికల మ్యానిఫెస్టోని క్రమబద్ధీకరించే అధికారాన్ని కూడా ఈసీకి ఇవ్వడం జరిగింది. జూలై 5, 2013న పీ.సదాశివం, రంజన్ గొగోరులతో కూడిన ఇద్దరు జడ్జీల బెంచ్, వీలైనంత త్వరగా ఈసీ ఆ పనిని చేపట్టాలని ఆదేశించింది.
ఎన్నికల కమిషన్ ఆగస్ట్ 12, 2013న రాజకీయ పార్టీలతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ విషయంపై పార్టీలు అనంగీకారంగా ఉన్నాయి. 2015 లోఎంసీసీలోని 8వ భాగంలో కొన్ని మార్గదర్శకాలను పొందుపరిచారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో రాజకీయ పార్టీలు అవసరానికి మించిన ప్రభావాన్ని చూపే, లేదా ఎన్నికల ప్రక్రియలోని స్వచ్ఛతను కలుషితం చేసే వాగ్దానాలను మానుకోవాలని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. మ్యానిఫెస్టోలు వాగ్దానాలలో ఉండే హేతుబద్ధతను ప్రతిబింబించి, ఆర్థిక అవసరాలు తీర్చే మార్గాలను కూడా సూచించాలి. నెరవేర్చడానికి సాధ్యమయ్యే వాగ్దానాలపై ఆధారపడి మాత్రమే ఓటర్ల విశ్వాసాన్ని కోరాలి. ఈ మార్గదర్శకాలు ఉన్నప్పటికి కూడా, చాలా ధ్రువీకరణలు నిత్యకృత్యంగాను, అస్పష్టంగాను ఉంటూ,ఓటర్లకు అవసర మైన సమాచారాన్ని సమకూర్చడం లేదని ఈసీ పేర్కొంది.
ఎన్నికల కమిషన్ ప్రతిపాదన ''అసాధారణంగాను, వింతగానూ'' ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభిప్రాయపడింది. ఒకవేళ ఒక రాజకీయ పార్టీ, ప్రభుత్వ పాఠశా లల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠశాల యూనీఫాం ఇస్తామని నిర్ణయం తీసుకుంటే, అలాంటి వాగ్దానంలోని యోగ్యతను ఓటర్లు నిర్ణయించాల్సి ఉంటుందని సీపీఐ(యం) తర్కబద్ధంగా పేర్కొంది. కేటాయించబడే నిధులు ఎన్నికైన ప్రభుత్వం నుంచే జమవుతాయి కానీ ఎన్నికల కమిషన్ నుండి కాదు.
''ఎన్నికల బాండ్ల విషయంలో ఎన్నికల కమిషన్ నుండి పారదర్శకత కొరవడింది. ద్వేషపూరిత ప్రసంగాల్లో, అర్థంలేని హెచ్చరికలు జారీ చేయడంలో ఈసీకి భాగస్వామ్యం ఉన్నట్లు కనపడుతుంది. ఈసీ తన గొంతును కూడా వినిపించడం లేదు. ప్రజలు ఇలాంటి ప్రసంగాలు చేసి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అవుతున్నారని'' ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝూ ఫ్రంట్ లైన్‌తో అన్నారు. రాజకీయ పార్టీల నుండి ఈసీ కోరి, సేకరించిన స్పందనలు అన్నీ రోటీన్‌గా తీసుకున్నవే గానీ వాటిని వారు ఏనాడూ సీరియస్‌గా భావించలేదని అయన అన్నాడు. ''మేము, నిరంకుశమైన నిర్మాణ వ్యవస్థ, నిరంకుశపూరిత ఆజ్ఞలతో నిరంకుశ రాజ్యం వైపు చాలా వేగంగా దూసుకుపోతున్నాం. అలాంటి ఆజ్ఞలకు, ఎన్నికల కమిషన్ ఒక దూరశ్రవణనాదం (మెగాఫోన్)గా మారిందని'' ఝా అన్నాడు.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
- టీ.కే.రాజ్యలక్ష్మి