Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊరంతా ఒక్కదారి ఉలిపికర్రది మరోదారి అనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అదే జరుగుతున్నది. గాంధీభవన్‌లో ముఖ్యనాయకులంతా సమావేశమై... పార్టీ పరిస్థితిపై చర్చిస్తుంటే... ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మాత్రం అసెంబ్లీలోని సీఎల్పీలో కూర్చున్నారు. పార్టీ అధ్యక్షుడు నిర్వహించిన సమావేశానికి కూడా పోవట్లేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి కూడా దూరం దూరంగా ఉంటున్నారు. ఇటీవల తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి కూడా వెళ్లి వచ్చారు. జగ్గన్న అంటేనే తెల్లటి గడ్డంతో రాజకీయాల్లో ఒక సింబల్‌గా, గంభీర్యంగా ఉంటారు. కొన్నేండ్ల తర్వాత గడ్డం తీయడంతో ఆయన గుర్తుపట్టలేనంతగా తయారయ్యారు. గడ్డంలేకుండా ఆయన్ను చూసేందుకు అభిమానులు వస్తున్నారంటే నమ్మశక్యం కాదు. ఆయన ఓ సమావేశానికి పోతే ఎమ్మెల్యే ఇంకా రాలేదా? అని అడిగారట. ముందు వరసలో కూర్చున్నారు... చూడలేదా? అంటే దగ్గరికి వెళ్లి నిర్ధారణ చేసుకుంటున్నారట. గడ్డానికి ముందు, ఆ తర్వాత అన్నట్టుగా గడ్డంపై చర్చలు చేస్తున్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఒక సీనియర్ జర్నలిస్టు మిత్రుడు అసెంబ్లీ ఆవరణలో కలిసి నాతో ఇలా అన్నాడు. జగ్గారెడ్డి వచ్చాడట. ఉన్నాడా? ఇంటికి వెళ్లిపోయాడా? అని అడిగాడు. మీ బీట్ కూడా కాదు ఆయన గురించి ఎందుకు అడుగుతున్నా రంటే, ఏమీ లేదు బై... జగ్గన్నను గడ్డం తీసిన తర్వాత చూడలేదు. ఒక్కసారి చూసి పోదామని వచ్చాను. ఒక్కసారి కలిపిస్తావా? అని అడిగాడు. సర్లే దాందేముందని ఆయన కూర్చున ఆఫీస్‌లోకి తీసుకెళ్లాను. అదే సమయంలో ఆయన డార్క్ రూమ్‌లో ఏదో సీరియస్‌గా ఫోన్లో మాట్లాడుతున్నాడు. అరగంటకు పైగా వేచి ఉండి బాధతప్త హృదయంతో ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడు. నేను కూడా చేసేదేమీ లేక మీకు ఆయన్ను చూసే అవకాశం లేదు. వెళ్లిపోయవాలని సూచించాను. జగ్గన్నా... మజాకా? ఆయన రూటేసపరేటు అని అంటున్నారు విలేకర్లు.
- గుడిగ రఘు