Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ జనాలకు ఇప్పుడు ఫార్ములా ఫోర్ రేసు ఫీవరొచ్చింది. శనివారం అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన ఈ బుల్లి కార్ల పందెం... ఇప్పుడు నగర వాసులనే కాదు రాష్ట్ర ప్రజలను సైతం ఉర్రూతలూగిస్తోంది. భాగ్యనగరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి సచివాలయం, లుంబినీ వనం, ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ థియేటర్ వరకూ అట్నుంచి ఇటూ, ఇట్నుంచి అటూ కొనసాగే ఈ కార్ల రేసు... వీక్షకులకు కన్నుల పండగ చేసింది. ఈ పందేన్ని టీవీల్లో చూసిన బుడతలు సైతం తెగ గంతులేశారు. అయితే ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చినట్టు... ఇంతలా హంగామా సృష్టించిన ఈ రేసు హైదరాబాద్లోని వాహనదారులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఆయా రహదారులను ట్రాఫిక్ పోలీసులు అష్టదిగ్బంధనం చేసి...బైకులు, కార్లను దారి మళ్లిస్తుండటంతో వేలాది వాహనాలు అనకొండలా బారులు తీరుతున్నాయి. ఐదు నిమిషాలకోసారి ఇలా కదలటం, అలా సిగల్ పడుతుండటంతో బస్సుల్లోని ప్రయాణీకులతోపాటు వాహనదారులు సైతం నరకయాతన పడుతున్నారు. ఇంతకీ ఈ రేసును ఎందుకు తీసుకొచ్చారు..? ఒకవేళ తీసుకొచ్చినా నగరం నడిబొడ్డున పెట్టి జనాల్ని నానా ఇబ్బందులకు గురి చేయటమేంటి..? అంటూ వారు నిర్వాహకులను, ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఎక్కడో నగర శివార్లలో నిర్వహించుకోవాల్సిన ఈ పందేన్ని మా మీద రుద్ది... ఆగం ఆగం పట్టిస్తిరి కదా సామీ... అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-బి.వి.యన్.పద్మరాజు