Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోపమొస్తే నేను మనిషిని కాదు... ఈ డైలాగ్ ఎవరైనా చెబితే, మరేందిర భై అన్నామనుకొండి అవతలవారు షాక్ తింటారు. కాబట్టి నేను మనిషినే అని జనాల దగ్గర ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉండాలి. లేకపోతే నీకు కోపమెందుకు వచ్చింది అన్న విషయం పక్కన పెట్టి, కోపమొస్తే నువ్వేమిటో చెబుతారు అని మా మిత్రుడు అంటుంటాడు. కోపం అన్నది మానవ లక్షణం, మానవ లక్షణమే కాదు కోపం జంతువులకు కూడా వస్తుంది. అయితే మనిషికి కోపం వస్తే మనకు వెంటనే తెలిసిపోతుంది. జంతువులది అలా కాదు. వాటిని చూసే వాళ్ళందరికీ వాటి కోపం కనపడదు.
మానవుడు కోతినుండి వచ్చాడని చెబితే మొదట్లో జనాలు ఒప్పుకోలేదు. తిట్టారు, కొట్టేంత పనిచేశారు. అసలామాట అన్నోడికి తెలివుందా లేదా అన్నారు. కడుపుకేమి తింటారన్నారు, ఇంకా ఇంకా ఎన్నో. అయినా ఎన్నో పరిశోధనలు చేసిన ఆ డార్విన్ మహాశయుడు ఎవ్వరి మీదా కోప్పడలేదు, నిజమైన మనిషికాబట్టి. తాను చెప్పదలచుకున్నది సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. మనుషు లెందుకు తాము కోతినుండి వచ్చారన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు వీళ్ళకింకా జంతు లక్షణాలు పోలేదేమో అని స్వగతంలో అనుకొని ఉండొచ్చు. ఏమైతేనేం తరువాత కాలానికైనా ఆ పరిశోధనను అందరూ ఒప్పు కున్నారు. కొందరు పైపైకి ఒప్పుకోనట్టు నటిస్తూనే ఉన్నారు. ఎవరి కారణాలు వారివి. ఎవరి లక్ష్యాలు వారివి మరి.
నీకే జంతువు ఇష్టమని అడిగితే ఒక్కొక్కరూ ఒకటి చెప్పొచ్చు. చిన్నయసూరి కథలు విన్నోళ్ళైతే నక్క తప్ప ఇంకోదాన్ని తనకిష్టమని చెప్పొచ్చు. తోడేలూ అలాంటిదే, దాని పేరూ చెప్పరు చాలా మంది. ఇక ఎన్నికలప్పుడు, ఓట్లకోసం అడుక్కునేటప్పుడూ ఫలానా జంతువుపై ప్రేమ పెరిగిపోతుంది కొందరికి. అదే జంతువు ప్లాస్టిక్ కవర్లు తిని రోడ్డుపక్కన చనిపోతున్నా మామూలు రోజుల్లో పట్టించుకోరు. అప్పుడు జంతువులన్నీ ఒక్కటే అన్న సమైక్య భావం వాళ్ళ మనసుల్లో ఉంటుందేమో.
ఇప్పుడు కోతిని జంతువు అనాలా వద్దా అన్నది పెద్ద ప్రశ్న. ఇరవై మార్కుల ప్రశ్న. పరీక్షలో ఓ బిట్టు తప్పుపోతే పరవాలేదు కాని ఇరవై మార్కుల ప్రశ్నకు జవాబు తప్పుగా రాస్తే ఇంకేమన్నా ఉందా? పరీక్ష పోదూ..!! అందుకే పరీక్షలో పాసయ్యేందుకు నానా పరేషాన్ పడి మనకు సమజైంది మనం రాయాలి. ఇంకా వీలైతే ఓ అడిషనల్ షీట్ తీసుకొని మళ్ళీ రాయాలి. పేపరెక్కువ వాడితే అడవులు తరిగిపోతాయి అన్న విషయం కూడా రాయాలి. లేకపోతే నీ పరీక్షే పోతుంది. ఒకటో రెండో అడిషనల్ షీట్లు తీసుకొని వాటిని దారం కట్టి పెడితే పరీక్ష పాసై పోయినట్లే. ఇది అపోహ మాత్రమే, రాసిన దాంట్లో ఎంతో కొంత విషయం ఉండాలన్నది మార్కులు మంచిగా తెచ్చుకొనే వాళ్ళు చెప్పే మాట. వాళ్ళు ఇచ్చిన బుక్లెట్లో మాత్రమే రాసినా పాసైతారు. అలా కాని వారి పరిస్థితి కొంత కష్టంగానే ఉంటుంది. అడవులు తరిగిపోయి అందులోని జంతువులు మానవుల మీదికి వస్తున్నాయి అన్న విషయం కూడా మనం గమనించాలి. మనకంటే ఈ ప్రపంచం మీద జంతువులే ముందు పుట్టాయి. ఈ విషయం కూడా దిమాక్లో ఎప్పుడూ ఉంచుకోవాలి.
ఇక మనిషికోసమని మందులు, వ్యాక్సిన్లు తయారు చేస్తారు. అలా కనిపెట్టిన దానిని సీదా మనిషికి ఎక్కించరు. మొదట జంతువుల మీద పరీక్ష చేస్తారు. అవి బతికి బట్టకడితే తరువాత బట్ట కట్టే మనుషుల మీద పరీక్ష చేస్తారు. అలా మనిషి మీద ప్రయోగించాక సదరు మనిషి ఎలా ఉన్నాడు అని చూస్తారు. బాగా ఉన్నాడా సరి, లేక పోతే ఆ మనిషికేమైంది అన్నది చూస్తారు. ఇది మామూలుగా సమయమున్నప్పుడు చేసే పని. అలా కాకుండా అటు ఒక వైరసు ప్రపంచాన్ని వణికిస్తూ పోతుందనుకుందాం, ఏదో చేసినట్టు కనిపించాలి కాబట్టి మందు లేదా వ్యాక్సిన్ కనిపెడుతున్నారు త్వరలో ఆ విషయం బయటపెడతామని చెబుతారు. ఆహార విషయాల్లో క్షణాల్లో తయారయ్యే నూడుల్సు లాటి ఇన్స్టంటు అహారాలు ఉన్నట్టే, మందులనూ వ్యాక్సిన్లనూ ఇన్స్టంటుగా కొద్ది కాలంలోనే తయారు చేయాలి. అదే అసలు పరీక్ష. లేదంటే ఎన్నికల్లో పరీక్ష తప్పుతారు. అదే అసలు పరీక్ష. ఇందాక పరీక్షలో ఇరవై మార్కుల ప్రశ్న గురించి అనుకున్నాం. పక్కనున్నవాళ్ళు దయదలిస్తే వారి దాంట్లో కాపీ కొట్టి రాయాలి. అప్పుడు తనకు ఏ చదువు రాకపోయినా పాసైతాడు. అలా ఇంకో దేశం తయారు చేసిన వ్యాక్సిన్ తెప్పించుకోవచ్చు. అది కాపీ లాంటిదని భయపడి సొంతంగ రాస్తే పాసవ్వచ్చు లేదా పరీక్ష పోవచ్చు. ఈ ఇన్స్టంటు పరిశోధనలూ అంతే, మందు కరెక్టా కాదా అని చూసుకొనే సమయం లేకుండానే ఎక్కించేయడమే. అంతగా పోతే కొందరి ప్రాణాలు పోతాయి అంతే అని పెద్దోళ్ళు అనుకోవచ్చు, ఎందుకంటే అవి తమ ప్రాణాలు కాదు కాబట్టి. ఎటూ వైరస్ సోకి పోతారు దాని బదులు ఇంకో విధంగా పోతే ఏం అని ప్రశ్నించే వారినే ఎదురు ప్రశ్న వేయవచ్చు. ఎంతైనా వైరస్ పట్టిన మెదళ్ళు కదా.
జగదీశ్ చంద్రబోస్ గారు ఒక అడుగు ముందుకేసి జంతువులకే కాదు ఈ ఫీలింగ్సు, మొక్కలకు, చెట్లకు కూడా ఉంటాయి అని నిరూపించారు. జంతువుల్లాగే వాటికీ గుండె కూడా ఉంటుందన్నాడాయన. మనుషులకు, జంతువులకే విలువనివ్వని మనుషులు కొందరు మొక్కలకు, చెట్లకు విలువనిస్తారా. ఇతర గ్రహాల మీద కన్నేసి ప్రయివేటు కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి వదులుతున్న రోజులివి. అంతా వ్యాపారమే. తమకు లాభం తెచ్చేదేదైనా చేస్తారు కాని నష్టం కలిగించేది చేయరు. ఏఏ గ్రహాల మీద ప్రాణం ఉందో తెలుసుకోవాలన్న తపన పెరింగిందిప్పుడు.
జంతువులను ప్రేమించాలి, గౌరవించాలి వద్దనకూడదు. మనుషులు ఆహారం ఏది తినాలి అన్న విషయం కూడా నిర్ణయించేచోట మాంసాహారం తినేవాళ్ళు ఏది తినాలి అని కూడా ముందే నిర్ణయమైపోయి ఉంటుంది. అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉందా అంటే లేదు. ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారూ. అయినా అక్కడ కంగారూ మాంసం అనేక రూపాల్లో తింటారు. అసలు తమ కడుపు నింపే జంతువును గౌరవించాలనే తలంపు వారికి రావడమే గొప్ప. అలా చేశాక దానిని తినడం మానేశారా, లేదు కదా!! జంతువుల మీద ప్రేమ వేరు, మనుషుల మీద ద్వేషంతో వాటిపై కలిగే ప్రేమ వేరు. మనుషులనే జంతువుల్లా చూస్తున్నవాళ్ళకు వాటిపై ప్రేమ ఉందంటే ఎలా నమ్మగలం చెప్పండి!! జంతువైతేనేమిరా మనిషైతేనేమిరా అనుకునే వాళ్ళను ఇంకా మనుషులుగా చూడటమే మన మనుషులు చేస్తున్న తప్పు. అన్నమైతేనేమిరా? సున్నమైతేనేమిరా? మరి ఈ పాడుపొట్టకు అన్నమే తిందాము రా! అనేవాళ్ళే కాని నిజంగానే సున్నం పెడితే ఎవరైనా తింటారా చెప్పండి. అలాంటి అపర వేదాంతులను నమ్మడమెలా... ఆలోచించండి... జంతువైతేనేమిరా మనిషైతే నేమిరా మన ఓటు బ్యాంకుకు పనికొస్తే చాలురా అన్న మాడ్రన్ దినాల్లో ఉన్నాం.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298