Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతమున్న కార్మికచట్టాలన్నిటినీ కలిపి నాలుగు లేబర్‌కోడ్‌లుగా మార్చివేసింది. గత పార్లమెంట్ సమావేశాలలో వేతన నిబంధనల చట్టం ఆమోదం పొందింది. వీటి ప్రభావం అన్ని రంగాలతో పాటు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ (ఎస్.పి.ఇ-మెడికల్ రిప్స్) రంగం మీద కూడా పెద్ద ఎత్తున పడుతుంది. ఎన్నో సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం-1976ని నిర్వీర్యం చేస్తూ త్వరలో ''వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత మరియు పని పద్ధతులు'' పేరుతో కొత్త నిబంధనను ప్రవేశబెట్టబోతున్నది. అలాగే మరో రెండు నిబంధనలను త్వరలో ఆమోదానికి ప్రవేశబెట్టబోతున్నట్టు తెలిపింది. సామజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించి రెండు కొత్త నిబంధనల ద్వారా కార్మికుల ప్రాథమిక హక్కులను కాలరాసి, బేరసార హక్కులను తొలగించి, దోపిడీని మరింత తీవ్రతరం చేసేందుకు అనుకూలంగా ప్రభుత్వం వీటిని రూపొందించింది. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్ట సవరణ వల్ల ఇప్పటికే సాధించుకున్న హక్కులను కోల్పోవడమే కాకుండా, మరింత దుర్భర పని పద్ధతులలోకి నెట్టివేయబడతారు. అసలుకే పని పద్ధతులు నిర్ణయించబడని పరిస్థితుల్లో యాజమాన్యాల ఒత్తిడికి... సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కొత్త లేబర్ కోడ్లతో వారి జీవన ప్రమాణాలు మరింత దిగజారనున్నాయి. పని పద్ధతుల కొలమానం లేని కారణంగా ఇప్పటికే యాజమాన్యాలు సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులను వేధింపు లకు గురిచేస్తూ కక్ష సాధింపు చర్యలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
కార్మికులు సాధించిన హక్కులను కోవిడ్ గడ్డుకాలంలో వివిధ మార్గాల్లో లాక్కోవడానికి యాజమాన్యాలు ప్రయత్నించాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కోర్టులు పని చేయకపోవడం వంటి కారణాలు యాజమాన్యాలు మరింత దూకుడుగా వ్యవహరించేందుకు కారణమయ్యాయి. కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా, కార్మికవ్యతిరేక విధానాలతో ముందుకు సాగడానికి యజమానులను ప్రోత్సహించింది. వేతనాలు చెల్లించకపోవడం, వేతనాల అక్రమ కోత, బదిలీలు, మూసివేతలు, ఉద్యోగ నష్టం, సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులను వేధించడానికి వివిధ ఆన్లైన్ వర్కింగ్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. డిజిటలైజేషన్ పేరుతో సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులపై అన్ని రకాల దాడులను యాజమాన్యాలు ప్రోత్సహించాయి. ఈ దాడులు ఫీల్డ్వర్కర్ల హక్కులపై మొదలైనప్పటికీ... తర్వాత బేరసార హక్కులతో సాధించుకున్న ఒప్పందాలు, కంపెనీ యూనియన్ మధ్య కుదిరిన అవగాహనలు రద్దయ్యే దిశగా కొనసాగుతున్నాయి. సమావేశాలు, ఇతర రకాల నిరసనలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడు యాజమాన్యాల దాడులు విపరీతంగా పెరిగాయి. ద్వైపాక్షిక ఒప్పందాలను, ఉన్న చట్టాలను పక్కన పెట్టి ఏకపక్షంగా కొత్త పని విధానాలను ప్రవేశపెడుతున్నారు. దాదాపు ప్రతి కంపెనీలోనూ సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులపై కొత్త పని పద్ధతుల ద్వారా డిజిటల్ దాడులు జరిగాయి.
లాక్డౌన్లో యాజమాన్యాలు చాలావరకు తమ ఉద్యోగులను ఇంట్లోనే ఉండాలని, భద్రతను కొనసాగించాలని సూచించాయి. కానీ, వేతనాలు చెల్లించడం మటుకు ఆపేశాయి. ఉద్యోగులు వారి కుటుంబాల ఆరోగ్యం పట్ల బాధ్యత తీసుకోవాల్సిన యాజమాన్యాలు ఆ పని చేయకుండా, ఉద్యోగుల సంఖ్య తగ్గించడం, హెడ్‌క్వార్టర్స్ మూసివేయడం వంటి అనైతిక చర్యలకు పాల్పడ్డాయి. బదిలీలు, టెర్మినేషన్లు ఈ కాలంలో బాగా పెరిగాయి. ఈ విషయాలను కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వీటిని నివారించడానికి ప్రభుత్వపరంగా చెప్పుకోదగ్గ ప్రయత్నాలేవీ జరగలేదు.
డిజిటల్ మోడ్ శాస్త్రీయమైనది కాదని, సేల్స్ ప్రమోషన్ జాబ్‌లో ఎంప్లారు, డాక్టర్ ముఖాముఖి పరస్పర చర్యను భర్తీ చేయడం సాధ్యం కాదని కోవిడ్ అనుభవం స్పష్టంగా తెలియచేసింది. కానీ, యాజమాన్యాలు ఇప్పటికీ ప్రతి విషయానికి ఎస్పిఇలను బాధ్యులను చేస్తూ బెదిరించడమే కాకుండా వేతన తగ్గింపు, శిక్షాత్మక చర్యలకు పూనుకుంటున్నాయి. యాజమాన్యాలు ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకోవడం, గుర్తింపు పొందిన యూనియన్లతో చర్చించడం లాంటివి చేయకుండా నిరంకుశంగా ముందుకు వెళ్తున్నాయి. టార్గెట్ అందుకోవడంలో విఫలమైన సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులను ఇదే టెక్నాలజీతో వేధింపులకు గురిచేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సంభాషణలను అనైతికంగా రికార్డ్ చేసి, వాటి గురించి విశ్లేషణ పేరుతో లోపాలను ఎత్తి చూపుతూ మరింత వేధింపులకు పాల్పడుతున్నాయి. సేల్స్ ప్లానింగ్, మార్కెట్ ఫీడ్‌బ్యాక్ డేటా సేకరణ, సేల్స్ సమీక్ష పేర్లతో సాధ్యపడని వివిధ అవాస్తవిక వివరాలను అందించమంటూ యాజమాన్యాలు ఒత్తిడితెస్తున్నాయి. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లతో పాటు, అది అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, యాజమాన్య అనుకూల విధానాలతో ఉద్యోగులపై దాడులు మరింత పెరుగుతాయి.
- సిహెచ్.కుమార్