Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో భారత ఎన్నికల కమిషన్ (ఇ.సి) తీసుకున్న కొన్ని చర్యలు, అనుసరించిన వైఖరులు... స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించే పర్యవేక్షకురాలిగా, నిష్పక్ష పాత మధ్యవర్తిగా తనకు గల పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా ఉన్నాయి. గత కొన్నేళ్ళుగా, ముఖ్యం గా మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అయిష్టంగానైనా సరే ఇ.సి వ్యవహరించడం కనిపిస్తోంది. పైగా గతంలో తాను తీసుకున్న కొన్ని స్వతంత్ర వైఖరుల నుండి కూడా వెనుకంజ వేస్తోంది.
కొన్ని సంఘటనలు ఈ దురదృష్టకరమైన ధోరణిని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలు ఇస్తామంటూ చేసే హామీలు, వాగ్దానాలనేవి తమ పరిధిలోకి రావంటూ ఇ.సి సుప్రీం కోర్టులో గతంలో తన వైఖరి స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా కూడా తమ అధికారాలను ఉల్లంఘించి వ్యవహరించడమే అవుతుందని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఎన్నికల కమిషన్ ఎలాంటి మినహాయింపులు లేని రీతిలో తీసుకున్న ఈ వైఖరిని - జులైలో ప్రధాని మోడీ 'రేవడి' సంస్కృతిపై తీవ్రంగా ధ్వజమెత్తి, ప్రజలకు ఉచితాలు ఇస్తున్నారంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన వెంటనే మార్చుకుంది. ఎన్నికల నిబంధనావళిని సవరించాలని ఆలోచిస్తున్నామని, రాజకీయ పార్టీలు చేసే ఎన్నికల వాగ్దానాలు, వాటి ఆర్థిక పర్యవసానాల వివరాలను వెల్లడించే ప్రొఫార్మాను ప్రవేశపెట్టాలను కుంటున్నామంటూ రాజకీయ పార్టీలకు ఇ.సి అక్టోబర్లో తెలియచేసింది. పైగా, రాజకీయ పార్టీలు తాము ఇచ్చే హామీలను నెరవేర్చేందుకు అవసరమయ్యే అదనపు వనరులను ఎలా సమీకరిస్తారో కూడా తెలియచేయాల్సి వుంటుందని పేర్కొంది. ఈ రీతిలో ప్రజలకు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల విషయంలో జోక్యం చేసుకోవడమనేది... విజ్ఞతతో కూడిన ఆర్థిక సుస్థిరత పరిధిలో రాజకీయ పార్టీ విధానాన్ని నియంత్రించే ప్రయత్నమే. ఇటువంటి ఎన్నికల వాగ్దానాలను సమీక్షించాల్సిన పని ఇ.సి.కి లేదు. కానీ, ఇటువంటి చర్య తీసుకోవడం ద్వారా, కొద్ది మాసాల క్రితం సుప్రీం కోర్టులో తాను తీసుకున్న వైఖరికి పూర్తి భిన్నంగా, ప్రధాని ఆదేశాలను నెరవేరుస్తున్నారన్న ఆరోపణలను మూటగట్టుకునే రీతిలో ఇ.సి వ్యవహరించింది.
ప్రభుత్వం మొదటిసారిగా ప్రతిపాదించిన ఎన్నికల బాండ్ల పథకానికి వ్యతిరేకంగా ఇ.సి నిర్ద్వంద్వంగా తన వైఖరిని తెలియచేసింది. ఎలాంటి పారదర్శకత లేని ఈ వ్యవస్థ గురించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఇటువంటి అజ్ఞాత నిధులు, విరాళాలు స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికల నిర్వహణను ఎలా దెబ్బతీస్తాయో తెలియచేసింది. ఇది 2018లోనే చెప్పింది. అప్పటి నుండి, ఈ విషయం ఎప్పుడు సుప్రీం కోర్టుకు వచ్చినా, ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా పిటిషన్లను విచారిస్తున్నా ఇ.సి దీనిపై తీవ్రంగా వ్యవహరించలేదు.
ఎన్నికల్లోకి అజ్ఞాతంగా వచ్చిపడే నిధుల ప్రవాహాన్ని ఎలా అడ్డుకోవాలనేది తీవ్రంగా ఆలోచించడానికి బదులుగా, రాజకీయ పార్టీలు అందుకునే చిన్న మొత్తాల విరాళాలను ఎలా కనిపెట్టాలంటూ ఇ.సి మరింతగా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం, రూ.20 వేలకు పైబడిన విరాళాలకు రాజకీయ పార్టీలు మూలం ప్రకటించాలని చట్టం పేర్కొంటోంది. అయితే, రూ.2 వేలకు పైబడిన విరాళాలు వచ్చినా వాటిని కూడా ప్రకటించేలా ఈ చట్టాన్ని సవరించాలని సెప్టెంబర్లో న్యాయశాఖా మంత్రికి ఇ.సి లేఖ రాసింది. రూ.2 వేల కన్నా తక్కువ మొత్తంలో అజ్ఞాతంగా వచ్చిన విరాళాలపైనా ఆంక్షలు విధించాలని ఇ.సి భావిస్తోంది. కానీ, ఎన్నికల బాండ్ల ద్వారా అజ్ఞాతంగా వచ్చే కోట్లాది రూపాయల విరాళాలపైన ఎన్నికల కమిషన్ అస్సలు ఆందోళన చెందకపోవడం విచారకరం. ఈ అక్టోబర్లో 22వ విడత ఎన్నికల బాండ్లను జారీ చేసిన తర్వాత మొత్తంగా రూ.10,791 కోట్లు ఈ అజ్ఞాత మార్గం ద్వారా వచ్చిపడ్డాయి. ఇందులో పెద్ద వాటా పాలక పార్టీదే.
ఏడాదిలో నాలుగుసార్లు జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరుల్లో 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఎన్నికల బాండ్లు జారీ చేస్తారు. అయితే ఈ ఏడాది అక్టోబరులో చివరి విడత తర్వాత మోడీ ప్రభుత్వం నిబంధనలను సవరించింది. నవంబరు 8న అదనంగా మరోసారి ఎన్నికల బాండ్లు జారీ చేసి 15రోజుల పాటు అమలయ్యేలా చూసింది. డిసెంబరు మొదటి వారంలో గుజరాత్ ఎన్నికలు జరగనున్నందున వాటిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు ఈ సవరణ చేసింది. పాలక పార్టీకి విధేయంగా వుండడానికి సదా సన్నద్ధంగా వుండే కార్పొరేట్లు, చీకటి వ్యాపారుల నుండి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించగలమని సహజంగానే బీజేపీ ఆశతో ఉంది. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయ కుండా... ఎన్నికల కోసం ఉద్దేశించిన లెక్కలోకి రాని నగదు వినియోగంపై ఎలాంటి కట్టడి ఉండదు. అయితే, రూ.2 వేలు వంటి చిన్న మొత్తాలు, అంతకు పైబడిన విరాళాలను జవాబుదారీగా చేయడంతోనే ఇ.సి సంతృప్తి చెందుతోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో కొత్త ప్రామాణికాలను కూడా ఇ.సి ప్రవేశపెట్టింది. మొదటగా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత చాలా ఆలస్యంగా గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. గుజరాత్లో పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు, పథకా లను అమలు చేసేందుకు ప్రధాని ఈ అదనపు సమయాన్ని ఎలా ఉపయోగించారో ప్రతి ఒక్కరూ చూశారు.
ఇక రెండో అసాధారణమైన చర్య ఏమిటంటే, తమ సంస్థల్లో పని చేసే కార్మికులు ఎన్నికల్లో పాల్గొనే రీతిని, వారి భాగస్వామ్యాన్ని పర్యవేక్షించేందుకు గుజరాత్ లోని వెయ్యికి పైగా కార్పొరేట్ సంస్థలతో ఎన్నికల కమిషన్ అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఓటు వేయని వారి పేర్లను సంస్థ వెబ్సైట్లు లేదా నోటీసు బోర్డుల్లో ప్రచురించడం. అంటే ఇది, బలవంతంగానైనా ఓటింగ్లో పాల్గొనేలా చూసే ప్రమాదకరమైన చర్యకు దగ్గరగా ఉంది. దీంతో తమ సంస్థల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు అందరూ తప్పక ఓటు వేసేలా చూసే బాధ్యత ఇప్పుడు ఆయా సంస్థలు, కంపెనీల యాజమాన్యా లపై ఉంది. ఇక ఓటు ఎలా వేయాలో వారికి సలహా ఇవ్వడమే తదుపరి చర్య కాగలదు.
ఎన్నికల కమిషన్ అనేది మన ప్రజా స్వామ్యానికి చాలా విలువైన, కీలకమైన సంస్థ. నిరంకుశ ప్రభుత్వం... ఈ సంస్థ స్వేచ్ఛను, సమగ్రతను నిర్మూలించడాన్ని ఎంత మాత్రమూ అనుమతించలేం. ఎన్నికల కమిషన్లో సంస్కరణలు తీసుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ముందుగా, ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఒక కమిటీ ద్వారా జరగాలి. ఆ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇ.సి కమిషనర్ల ఎంపిక పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే వుంటోంది. ఇక రెండోది, పదవీ విరమణ చేసిన తర్వాత, కమిషనర్ ఎలాంటి అధికారిక పదవిని చేపట్టరాదు. పార్లమెంటుకు లేదా అసెంబ్లీకి సభ్యులుగా వీరిని రాజకీయ పార్టీలు నామినేట్ చేయరాదు.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం