Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ప్రతి దేశం ఏదో ఒక విపత్తును ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభాలు, పర్యావరణ సంక్షోభాలు, రకరకాల వైరస్, బ్యాక్టీరియాలతో కూడిన వ్యాధులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో విపత్తులు వచ్చి పడతాయో అన్న భయం నేడు నెలకొంది. రుతువులు గతి తప్పుతున్నాయి. మంచు పర్యాతాలు కరగటం, ఓజోన్ పొరకు రంధ్రాలు పడటం, అనేక జీవులు అంతరించిపోవటం, మొత్తం జీవవైవిధ్యానికే ముప్పు ఏర్పడింది. వాతావరణంలో విపరీత మార్పులు, రకరకాల ప్రకృతి విపత్తులు ఇవన్నీ పర్యావరణంలో సమతూకం దెబ్బతినడం వల్లనే జరుగుతున్నాయి. మానవాళితో పాటు సమస్త జీవరాశులకు మృత్యుఘంటికలు నేడు మోగుతున్నాయి. భూమి మీద పర్యావరణం కాపాడుకోకపోతే జీవ మనుగడ కష్టమని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే పర్యావరణ విధ్వంసంలో ధనిక దేశాలదే ప్రధాన పాత్ర. ఈ దేశాలు కర్బన ఉద్గారాలను యదేచ్ఛగా వదులుతూ పర్యావరణాన్ని శతాబ్దాలుగా పాడుచేస్తున్నాయి.
పారిశ్రామిక విప్లవం(16 శతాబ్దం) ఎప్పుడైతే మొదలైందో పర్యావరణం, జీవజాతులకు ప్రమాదం కూడా అప్పుడే ప్రారంభమైంది. ప్రపంచ పెట్టుబడికి, భూగోళ పర్యావరణానికి మధ్య విధ్వంసక ఘర్షణ ముందుకు వచ్చింది. ప్రకృతిని పెట్టుబడి (సొంత ఆస్తి)గా మలుచుకొనే దురాశే ప్రకృతి విధ్వంసానికి కారణం. పర్యవసానంగా భూగోళం మీద జీవమే అంతరించి పోయే పరిస్థితికి దాపురిస్తున్నది. ప్రకృతిలో మనిషి తాను ఒక్కడినే ప్రాణిని అనుకుంటే మిగలడు. కనుమరుగైపోతాడు. మనిషి కూడా సమస్త జీవరాశిలో భాగమే. ఎక్కువ కాదు, తక్కువ కాదు. మానవ జీవనానికి, మనుగడకు పర్యావరణమే పునాది అనే వాస్తవాన్ని గుర్తించక పోవటం వలన సంభవిస్తున్న అనర్థాలను ప్రపంచవ్యాప్తంగా మానవాళి నేడు అనుభవిస్తున్నది. మానవజాతి చరిత్రలో సాంకేతిక అభివద్ధితో ఎంతో సంపదను మనిషి సృష్టించాడు. చివరకు గ్రహంతర యాత్ర కూడా సాగించాడు. మానవ జాతి సాధించిన ప్రగతిని వర్ణించటానికి మాటలు చాలవు. అయితే ఇదంతా పర్యావరణ విధ్వంసం మీద సాధించిన ప్రగతి అనే విషయాన్ని మనం మరవకూడదు. దీని ఫలితంగా పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయని కోట్లాది మూగ జీవరాశులు కూడా మూల్యం చెల్లిస్తున్నాయి. ఇప్పటికే సమయం మించి పోయింది. రాగల ప్రమాదాలను, పొంచి ఉన్న ముప్పును గుర్తించి, మానవాళి సమిష్టిగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. లేకుంటే రాబోయే ప్రళయం ఊహించనంత నష్టాన్ని మిగిలిస్తుంది. ఆ నష్టం పూడ్చు కోవటానికి కూడా అవకాశం మిగలదు.
ఇటువంటి పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి తొలిసారి 1992లో ధరిత్రి సదస్సు నిర్వహించింది. అప్పటి నుండి క్యాప్ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సం నవంబర్ 6నుంచి 18 వరకు 12 రోజుల పాటు ఈజిప్టు దేశంలో 27వ పర్యావరణ పరిరక్షణ సదస్సు ఏర్పాటు చేశారు. 195 సభ్య దేశాలతో పాటు వ్యాపారవేత్తలు, శాస్త్రజ్ఞులు, పర్యావరణ ఉద్యమ కారులు పాల్గొన్నారు. కానీ, 1992 నుండి జరుగుతున్న సదస్సులలో పర్యావరణ పరిరక్షణకు కొన్ని ఒప్పందాలు, లక్ష్యాలు నిర్ధేశించుకోవటం, వాటిని గాలికి వదిలివేయడం ఒక తంతుగా మారింది. ప్రస్తుత సదస్సు నిర్వహణ బాధ్యతలను ప్రముఖ బహుళజాతి కంపెనీ కోకోకోలా తీసుకోవడం ఇందుకు మరో ఉదాహరణ. ఈ సంస్థ ప్లాస్టిక్ కాలుష్య కారిణిగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఈ సంస్థ 200 పైగా దేశాలలో తన వ్యాపారాన్ని విస్తరించుకుంది. డ్రింక్స్ తాగిన తర్వతా పారేసే ప్లాస్టిక్ బాటిళ్లను బిలియన్ల కొద్ది ఉత్పత్తి చేస్తున్నది. విచ్చలవిడిగా భూగర్భజలాలను వాడుకుంటున్నది. పర్యావరణానికి తీరని హాని చేస్తున్నది. ఇలాంటి కార్పోరేట్ కంపెనీల కనుసన్నల్లో జరిగే పర్యావరణ సదస్సుల వలన ప్రయోజనం ఏమిటన్నది అంతుచిక్కని ప్రశ్న.
భారత దేశంలో కూడా పర్యవరణ హననం యదేచ్ఛగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు ఊపరితిత్తులైన నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలు, విశాఖ పరిసరాల్లో బాక్సెడ్ తవ్వకాలు జరిగే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇవి జరిగితే తెలుగు ప్రజలకు పీల్చుకోవటానికి మంచి గాలి కూడా దొరకదు. ఇప్పటికే దేశంలో జీవవైవిద్యం నశించి జీవ, వృక్ష జాతులు అనేకం కనుమరుగై పోతున్నాయి. వర్షాలు గతి తప్పి మహానగరాలు ముంపునకు గురవుతున్నాయి. వాగులు, వంకలు పొర్లి పొంగుతున్నాయి. రవాణా, పరిశ్రమల వ్యర్థాలు గాలి నాణ్యతను దెబ్బతిస్తున్నాయి. వాయు కాలుష్యం దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ప్రపంచంలోని 50 అతి కాలుష్య నగరాలలో 25 మన దేశంలోనే ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ తీరు సూచికలో 180 దేశాలలో భారతదేశం 177వ స్థానంలో ఉంది. గాలి నాణ్యతలో 178వ స్థానంలో ఉంది. ప్రజారోగ్యంలో 180వ స్థానంలో ఉంది. ఈ స్థితికి కారణం పెట్టుబడిదారి, సామ్రాజ్యవాద విధానాలు అమలు చేసే ప్రభుత్వాలే. కాబట్టి ఈ భూగోళం మీద మునుముందు జీవం మిగిలి ఉండాలంటే పెట్టుబడిదారి, సామ్రాజ్యవాద వ్యవస్థలను సమాధి చేసి సమసమజాన్ని నిర్మించుకోవాలి.
- షేక్ కరిముల్లా
9705450705