Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో స్త్రీని దేవతతో పోల్చుతారు. ఆడపిల్లని మహాలక్ష్మి అంటారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు నాట్యమాడతారనే సూక్తులు మన సమాజంలో చలామణిలో ఉన్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటే అడుగడుగునా వారికి అవరోధాలే ఎదురవుతున్నాయి.
దేశంలో గతేడాది నమోదైన మహిళలపై జరిగిన నేరాలు 4లక్షల 30వేలు కాగా, అందులో 32శాతం గృహహింస కేసులు ఉండటం గమనార్హం. ఐరాస పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం మన దేశంలో44ఏండ్ల లోపు మహిళల్లో గృహ హింస వల్ల స్త్రీలు ప్రాణాలు కోల్పోవడమో లేదా తీవ్ర గాయాలకు గురవడమో జరిగింది. ఇంకా మగవారి హింసను భరిస్తూ, మౌనంగా ఉన్నవారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఖచ్చితంగా రెట్టింపుగా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ రకమైన హింసని అత్యధిక మంది స్త్రీలు కూడా సమర్థించడం! 2019-21మధ్య జరిపిన కుటుంబ ఆరోగ్య సర్వేలో తెలుగు రాష్ట్రాలలో దాదాపు 84శాతం మంది మహిళలు భార్యని భర్త కొడితే తప్పులేదని అభిప్రాయపడ్డారు.
ఒకవైపు వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నా, మరోవైపు వారు వివిధ రూపాల్లో హింసని ఎదుర్కొంటూనే ఉన్నారు. వారు చదువుకునే ప్రాంతాల నుండి, పని చేసే ఆఫీసుల వరకు ఈ వేధింపుల పర్వం సాగుతూనేవుంది. కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై గహహింస పెరిగినట్లు ఆయా అధ్యయానాలు చెబుతున్నాయి. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, వారు ఎదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొంటున్నారు.
స్త్రీ అక్షరాస్యత, ఆర్ధిక స్వాతంత్రం వంటివి కొంత వరకు వారికి ఉపశమనాన్ని కల్పిస్తున్న మాట వాస్తవమే కానీ, పురుషాధిపత్యం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళా ఉద్యోగులలో ఆఫీసు పనితో పాటు, ఇంటిపని భారం మొత్తం కూడా తమపైనే వేసుకునే వారు చాలా మంది ఉన్నారు. దీని వల్ల వారు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. లైంగిక వేధింపులని ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలతో పాటు, ప్రజలలో చైతన్యం కూడా పెరగాలి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ వంటి వాటిపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలి. జనవిజ్ఞానవేదిక సంస్థ ఎదిగే ఆడపిల్ల ఏం తెలుసుకోవాలి? అనే పుస్తకాన్ని ముద్రించింది. ఇటువంటి పుస్తకాలని విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేయాలి. అలాగే ఎదుగుతున్న పిల్లలకి శరీరంలో వచ్చే మార్పుల గురించి ఉపాధ్యాయులు విపులంగా చెప్పాలి. లైంగిక దాడికి గురైన వారికి టూ ఫింగర్ టెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. బాధితులు మరింత భయపడేవిధంగా కాకుండా, వారికి భవిష్యత్తు పట్ల భరోసా కలిగేలా వివిధ హౌదాల్లో ఉన్న అధికారులు వ్యవహరించాలి.
స్త్రీలకు హింస నుండి విముక్తి కల్పించేందుకు ప్రతి ఏడాది నవంబర్ 25న అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం జరుపుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇటువంటి దినోత్సవాలకు కూడా ఇచ్చి వాడవాడలా స్త్రీ హింసకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే కొంత వరకైనా మహిళలకు హింస నుండి విముక్తి లభిస్తుంది.
(రేపు అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా)
- యం. రాం ప్రదీప్
9492712836