Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు దేశవ్యాపితంగా కేంద్ర బీజేపీ సర్కార్ ఓవైపు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహిస్తూనే, మరోవైపు రాజ్యాంగ మౌలిక పునాదులను గడ్డపారతో తవ్వి పెకిలిస్తోంది. బీజేపీ మతోన్మాద కబంధ హస్తాల కింద మన రాజ్యాంగం నలిగి పోతోంది. రాజ్యాంగానికి మూల స్తంబాలుగా ఉన్న ప్రజస్వామ్యం, లౌకికవాదం, ఫెదరలిజం, సామాజిక న్యాయాలనే రాజ్యాంగ లక్ష్యాలను సమాధి చేస్తోంది. పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరుపకుండానే అప్రజాస్వామికంగా తమకు ఉన్న మందబలంతో పేద లకు నష్టం చేసే అనేక బిల్లులను ఆమోదించు కుంటోంది. నూతన విద్యా విధానం 2021 బిల్లును ఆమోదించింది. ప్రజాస్వామిక గొంతులపై ఉక్కుపాదం మోపుతూ 'ఊపా' వంటి నిరంకుశ చట్టాలు తీసుకొచ్చింది. 80ఏండ్ల కురువృద్ధుడైన వరవరరావు వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాలకు నాగ్‌పూర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను నిరాకరిస్తోంది. మేధావులు కల్బుర్గి ఫన్సారే, దబోల్కర్ గౌరీలంకేశ్ వంటి వారిని కూడా ఈ కాలమే పొట్టనబెట్టుకుంది. ప్రశ్నిస్తూ వార్తలు రాసినందుకు సుమారు 25మంది జర్నలిస్టులు హత్యగావించబడ్డారు. ఇవన్నీ భారత ప్రజాస్వామ్యాన్ని బలిచేస్తున్న ఘటనలలో కొన్ని మచ్చుతునకలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేసిందీ ప్రభుత్వం. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి లౌకిక స్ఫూర్తిని దెబ్బతీసింది. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్రాల హక్కులను కాలదన్నుతోంది. సామాజిక న్యాయం అనే భావం స్థానంలో సామాజిక సామరస్యం పేరుతో చాతుర్వర్ణ వ్యవస్థలను పదిలంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వారి లక్ష్యాలకు అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో మనుధర్మాన్ని ప్రవేశ పెట్టడానికి కుట్రలు చేస్తోంది.
నేటి మన రాజ్యాంగం మన దేశ ప్రజలకు ఏ మాత్రం వర్తించదని, దానిని రద్దు చేయడం ప్రతీ హిందువు లక్ష్యం కావాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఒక సొట్ట లాంటిదని, సుదీర్ఘ కాలం ఆర్ఎస్ఎస్ సర్ సంఫ్‌ు చాలక్‌గా పని చేసిన ఎంఎస్ గొల్వల్కర్ 1967 జనవరి 2న తమ అధికార పత్రిక అయిన ఆర్గనైజర్‌లో స్పష్టంగా రాశారు. వారి ఆదిగురువుల లక్ష్యాల కనుగుణంగా నేటి రాజ్యాంగ రద్దుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతున్నది. ఇప్పటికే వారి కాషాయ ఎజెండా హిందూత్వ లక్ష్యంగా ఓ నూతన ప్రణాళికను డ్రాప్ట్ చేసి ఉంచింది. దాని లక్ష్యం తిరిగి మధ్యాయుగాల నాటి వెనుకబాటు మూఢత్వ పద్ధతులు అమలు చేయడం, చాతుర్ వర్ణధర్మాలు తిరిగి ప్రవేశ పెట్టడడమే. మన రాజ్యాంగానికి 73ఏండ్లు నిండాయి. ఇప్పటికే105 సార్లు సవరణలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను సమీక్షించాలనే రాగమెత్తుతోంది. మొదటిసారి 13రోజుల ప్రధానిగా పనిచేసిన వాజ్‌పారు కాలంలోనే ఈ చర్చను లేవనెత్తారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ప్రస్తుత సర్ సంఫ్‌ు చాలక్‌గా ఉన్న మోహన్ భగవత్ సైతం రిజర్వేషన్లను రాజ్యాంగాన్ని సమీక్షించాలని పలుమార్లు ప్రస్తావించారు. చివరికి నిజమాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కూడా మాకు పార్లమెంట్లో బలం ఉంది, బాజాప్తా భాజపా రాజ్యాంగాన్ని మారుస్తుంది అని చెప్పాడు. అవి కేవలం ఎంపీ అరవింద్ మాటలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అవి ఆర్ఎస్ఎస్, బీజేపీల ఆలోచనలు అనేది మనం గుర్తించాలి.
భారత రాజ్యాంగం మన పార్లమెంట్ చేసిన శాసనం కాదు. రాజ్యాంగ సభ నిర్మాణం చేసిన ఒక గొప్ప లిఖితపత్రం. ఇదే మన భారత దేశ సంవిధానం. 2006 జూన్ నాటికి 444ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్‌తో పాటు 26 భాగాలున్నాయి. వీటిలో 3, 4 భాగాలు మన రాజ్యాంగానికి గుండెకాయలు. 3వ భాగం పౌరుని ప్రాథమిక హక్కులు తెలియజేస్తే, 4వ భాగం ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాలను తెలియజేస్తుంది. రాజ్యాంగంలో ప్రవేశిక, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు, రిజర్వేషన్లు వంటి 4 ముఖ్యమైన నిబంధన లున్నాయి. ప్రవేశిక ప్రాణం వంటిది. భారతదేశాన్ని సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందిం చడానికి భారత దేశంలో ఉన్న ప్రజలందరూ కులాలు మతాలు ప్రాంతాలు బాషా బేధం లేకుండా కంకణబద్ధులు కావాలని ప్రవేశిక ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుండి19 ప్రకారం అన్ని రకాల వివక్ష, నిషేధం, అంటారానితనాలు అమానుషం, చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఆచరణలో జరిగుతుందేమిటి?
73ఏండ్ల రాజ్యాంగం అమలు తర్వాత కూడా నేటికీ దళితులు 116 రకాల వివక్ష రూపాలను ఎదుర్కొంటున్నారు. సామూహిక సంబరాల్లో పాల్గొననివ్వరు. ఎస్సీ ఉద్యోగులు సైతం క్లాసు వివక్ష ఎదుర్కొంటున్నారు. విడిసిల పేరుతో సాంఘిక బహిష్కరణలు, కులదురహంకార హత్యలు, దళిత స్త్రీలపై గ్యాంగ్ రేప్‌లు కోకొల్లలుగా కొనసాగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 8ఏండ్ల కాలంలో మరింత అమానుషమైన వివక్ష కొనసాగుతోంది. నవంబర్ 18న కర్నాటక రాష్ట్రంలోని హెగ్గోటర అనే గ్రామంలో దళిత మహిళ వాటర్ ట్యాంక్‌లో మంచినీళ్లు తాగిందని, ఆ వాటర్ ట్యాంక్ మలినమైందని మనువాదులు పెత్తందారులు ఆవు మూత్రంతో పరిశుభ్రం చేశారు. రాజస్థాన్‌లో ఓ విద్యార్థి పాఠశాలలో కుండలో ఉన్న మంచినీళ్లు తాగాడాని ఆ విద్యార్థిని టీచర్ చితకబాది హత్యగావించాడు. యూపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఎవరైనా దళితులు తనని కలవాలంటే షాంపూలతో తలస్నానం చేసి రావాలని చెపుతున్నారు! 2019లో యూపీ హత్రాస్‌లో గ్యాంగ్ రేప్ ఉదంతానికి పాల్పపడిన నింధితులని బీజేపీ రక్షించిన తీరు సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. ఇదేనా దళితుల పట్ల బీజేపీ విధానం? మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలు ఎటువైపు పయనిస్తున్నాయి. ఇలాంటి దారుణ అమానుష ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లెక్కలేనన్ని జరిగాయి, జరుగు తున్నాయి. ఓ వైపు శాస్త్రసాంకేతిక రంగం ఆకాశం ఎత్తున అభివృద్ధి చెందుతుంటే మరో వైపు దళితులపై మధ్యయుగాల నాటి మానసిక చట్టాల శిక్షలు, కులవివక్షలు, దేశవ్యాప్తంగా దాడులు 300రేట్లు పెరిగాయి.
ఈ దేశం మతంతో సంబంధంలేని లౌకిక రాజ్యాంగంగా ఉంటుందని మన రాజ్యాంగం వాగ్దానం చేసింది. కానీ నేడు కేంద్ర బీజేపీ సర్కార్ ప్రతి అంశంలో రాజ్యాంగ స్ఫూర్తిని వదిలేసి, మతపరమైన వైషమ్యాలు రెచ్చగొడు తోంది. మతాన్ని రాజకీయాలతో పులమడం అంటే మతోన్మాద హింసను పెంచడమే. రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని ప్రవేశ పెట్టాలీ, త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేయాలీ అన్న ఆర్ఎస్ఎస్ కలలను సాకారం చేయడమే బీజేపీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది మన రాజ్యాంగ నియమాలనూ, సమాఖ్య స్పూర్తినీ విచ్ఛిన్నం చేస్తుంది. నేటి యువతరం రాజకీయాల కతీతం గా రాజ్యాంగ రక్షణకు సైనికులుగా సిద్ధం కావాలి.
(నేడు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం)
- టి. స్కైలాబ్ బాబు
సెల్:9177549646